సాక్షి, సూర్యాపేట: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి జగదీష్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. రేవంత్‌ది కంపు నోరు.. మురుగు కాల్వ కంటే అధ్వాన్నం అని ఎద్దేవా చేశారు. బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పలేక బూతులు మాట్లాడి ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని విమర్శించారు.
మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి సూర్యాపేటలో మీడియాతో మాట్లాడుతూ..‘రేవంత్ రెడ్డికి ప్రధాని మోదీ, చంద్రబాబు అవసరం ఉండొచ్చు.. కానీ, తెలంగాణ ప్రజలకు లేదు. కేసీఆర్ స్ట్రీట్ ఫెలోస్ గురించి మాట్లాడలేదు. రేవంత్ రెడ్డిది కేసీఆర్ స్థాయి కాదు. రాబోయే ఎన్నికల్లో ప్రజలే కాంగ్రెస్ పార్టీకి బండ రాయి కట్టి మూసీ నదిలో పడేస్తారు. కేసీఆర్ అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పలేక బూతులు మాట్లాడి తప్పుదోవ పట్టిస్తున్నారు. రేవంత్ తోలు కాదు, ప్రభుత్వం తోలు వలుస్తాం.
కేసీఆర్ ప్రజాక్షేత్రంలోకి వస్తే తమ బట్టలు ఇప్పుతాడనే భయంతోనే ఫ్రస్టేషన్‌లో రేవంత్ మాట్లాడుతున్నాడు. రేవంత్ భాషకి ప్రజాక్షేత్రంలో తప్పక శిక్ష పడుతుంది. ప్రజలే రాజకీయ సమాధి చేస్తారు. కేసీఆర్ ముందు రేవంత్ బచ్చా. ఇరిగేషన్ మంత్రి ఒక అజ్ఞానపు మంత్రి. ఉత్తమ్ కుమార్‌కు కనీస అవగాహన లేదు. మహబూబ్‌నగర్, నల్లగొండ, రంగారెడ్డి జిల్లాలకు తీవ్ర అన్యాయం జరుగుతోంది. ప్రజా సమస్యలపై ప్రశ్నించడం ప్రతిపక్షాల బాధ్యత’ అని వ్యాఖ్యలు చేశారు.


