పెద్ద కంపెనీల్లో ఉద్యోగం సంపాదించాలనే ఆశతో లక్షలాది మంది విద్యార్థులు ఏటా జేఈఈ వంటి ప్రవేశ పరీక్షలను ఎదుర్కొని ఐఐటీల్లో చేరడానికి తీవ్రంగా ప్రయత్నిస్తారు. ఈ క్రమంలో కుటుంబ సభ్యుల నుంచి తీవ్ర ఒత్తిడి ఎదురవుతోంది. అయితే, సాంప్రదాయ విద్యా విధానంపై ఉన్న ఈ ఒత్తిడిని తగ్గించాలని, ఉద్యోగాలకు కాలేజీ డిగ్రీ అవసరం లేదని జోహో సీఈఓ, చీఫ్ సైంటిస్ట్ శ్రీధర్ వెంబు చేసిన తాజా వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి.
శ్రీధర్ వెంబు తమ కంపెనీ జోహోలో ఏ ఉద్యోగానికీ కాలేజీ డిగ్రీ అవసరం లేదని స్పష్టం చేశారు. తల్లిదండ్రులు తమ పిల్లలపై డిగ్రీల కోసం ఒత్తిడి తేవడం మానుకోవాలని కూడా కోరారు.
కాలేజీ డిగ్రీ ఎందుకు..?
యూఎస్ ఆధారిత సంస్థ పాలంటిర్ హైస్కూల్ గ్రాడ్యుయేట్‌లను నేరుగా కీలకమైన సాంకేతిక, జాతీయ భద్రతా ప్రాజెక్టులపై పనిచేయడానికి అనుమతిచ్చింది. ఈ కొత్త నియామక విధానంతో దీనిపై చర్చ మొదలైంది. ఈ విధానంలో దాదాపు 500 మంది టీనేజర్లు దరఖాస్తు చేసుకోగా 22 మంది ఎంపికయ్యారు. దీనిపై స్పందించిన శ్రీధర్ వెంబు డిగ్రీతో పనిలేకుండా నిజాయతీగా పని చేయాలని కోరుకునే యువతలో వస్తున్న సాంస్కృతిక మార్పును హైలైట్ చేశారు.
‘స్మార్ట్ అమెరికన్ విద్యార్థులు ఇప్పుడు కాలేజీకి వెళ్లడం మానేస్తున్నారు. ముందుచూపుతో ఆలోచించే కంపెనీల యజమానులు వారికి అవకాశం ఇస్తున్నారు’ అని పేర్కొన్నారు. ఈ ధోరణి వల్ల పేరెంట్స్ భారీ అప్పులు చేయకుండానే యువత తమ కాళ్లపై తాము నిలబడగలుగుతారని, చాలా కుటుంబాలు పిల్లల విద్య కోసం లక్షల రూపాయల రుణాలు తీసుకుంటున్న నేపథ్యంలో ఇది ఒక సానుకూల పరిణామమని చెప్పారు.
తల్లిదండ్రులకు విజ్ఞప్తి
ఈ పరిణామాలను గమనించాలని వెంబు ప్రత్యేకంగా భారతీయ తల్లిదండ్రులను, కంపెనీలను ఉద్దేశించి విజ్ఞప్తి చేశారు. ‘విద్యావంతులైన భారతీయ తల్లిదండ్రులు, ఉన్నత పాఠశాల విద్యార్థులు, ప్రముఖ కంపెనీలు శ్రద్ధ వహించాలని నేను కోరుతున్నాను’ అని ఆయన అన్నారు. భారతదేశంలో తరతరాలుగా అత్యంత ప్రతిష్టాత్మకమైన కాలేజీ డిగ్రీలకే ప్రాధాన్యత ఇస్తున్న నేపథ్యంలో నైపుణ్యం ఆధారిత నియామకాల వైపు మార్పు చాలా అవసరమని అభిప్రాయపడ్డారు.
జోహో నియామక విధానం
జోహో నియామక విధానాన్ని వివరిస్తూ వెంబు ‘జోహోలో ఏ ఉద్యోగానికి కాలేజీ డిగ్రీ అవసరం లేదు. కొంతమంది మేనేజర్లు డిగ్రీ అవసరమయ్యే ఉద్యోగాన్ని పోస్ట్ చేస్తే మీ వద్ద ఉన్న నైపుణ్యాలను క్లుప్తంగా వివరిస్తూ డిగ్రీ అవసరాన్ని తొలగించడానికి మర్యాదపూర్వకమైన సందేశాన్ని పంపండి’ అని తెలిపారు. తమిళనాడులోని కంపెనీ యూనిట్‌లో తాను సగటున 19 ఏళ్ల వయసు కలిగిన బృందంతో కలిసి పనిచేస్తున్నానని చెప్పారు. ‘వారితో కలిసి పనిచేయడానికి నేను చాలా కష్టపడాలి’ అని వెంబు ఆ యువత సామర్థ్యాన్ని కొనియాడారు.
ఇదీ చదవండి: పుతిన్ కారు ప్రత్యేకతలివే..


