పిల్లలకు మితిమీరిన సంఖ్యలో ఇస్తోన్న టీకాల వల్ల ఆటిజం కేసులు పెరిగే అవకాశం ఉన్నట్లు జోహో వ్యవస్థాపకుడు శ్రీధర్ వెంబు ఇటీవల చేసిన ఒక సోషల్ మీడియా పోస్ట్ ఆన్‌లైన్‌లో వైరల్‌గా మారింది. భారతదేశంలో ఆటిజం కేసులు పెరుగుతున్నాయని, దీనికి తల్లిదండ్రులు పిల్లలకు ఇప్పిస్తున్న టీకాలు కూడా కారణమని వెంబు ఎక్స్(గతంలో ట్విట్టర్) వేదికగా అభిప్రాయపడ్డారు.
వెంబు ఈ వ్యాఖ్యలు చేస్తూ మెక్ కలౌ ఫౌండేషన్ నివేదిక ఫలితాలను ఉటంకించారు. 300కు పైగా అధ్యయనాలను సమీక్షించి రూపొందించిన ఈ నివేదికలో రెండేళ్లలోపు పిల్లలకు సుమారు 32 టీకాలు వేయిస్తున్నట్లు చెప్పారు. ఇది ఆటిజం స్పెక్ట్రమ్ డిజార్డర్ (ASD)కు కారణమవుతున్నట్లు తెలిపారు. వెంబు తన పోస్ట్‌లో ‘తల్లిదండ్రులు ఈ విశ్లేషణను తీవ్రంగా పరిగణించాలి. చిన్న పిల్లలకు మితిమీరిన సంఖ్యలో టీకాలు ఇస్తున్నట్లు ఆధారాలు ఉన్నాయి. ఇది భారతదేశంలో కూడా వ్యాపిస్తోంది. ఇండియాలోనూ ఆటిజం వేగంగా పెరుగుతున్నట్లు తెలుస్తుంది’ అని పేర్కొన్నారు.
వెంబు వ్యాఖ్యలు ఆన్‌లైన్‌లో చర్చకు దారితీశాయి. కొందరు నెటిజన్లు ఆయన పోస్ట్‌కు మద్దతు తెలుపుతూ ‘ఈ మెసేజ్‌ను పంపడానికి చాలా ధైర్యం కావాలి’ అని ప్రశంసించగా, మరికొందరు టీకాల ఆవశ్యకతను, అవి ప్రాణాంతక వ్యాధులను నివారించడంలో పోషించిన పాత్రను నొక్కి చెబుతూ విమర్శిస్తున్నారు.
Parents should take this analysis seriously. I believe there is increasing evidence that we are giving way too many vaccines to very young children. This is spreading in India too and we are seeing a rapid increase in autism in India. https://t.co/AeiVaieYug
— Sridhar Vembu (@svembu) October 28, 2025
ఆటిజం అంటే ఏమిటి?
ఆటిజం అనేది ఒక న్యూరోడెవలప్‌మెంటల్ డిజార్డర్ (మెదడు అభివృద్ధికి సంబంధించిన సమస్య). దీన్ని సాధారణంగా ఆటిజం స్పెక్ట్రమ్ డిజార్డర్ (ASD) అని పిలుస్తారు. ఇందులో స్పెక్ట్రమ్ అనే పదం ఈ వ్యాధి లక్షణాలు, తీవ్రత వ్యక్తినిబట్టి వైవిధ్యంగా ఉంటాయని సూచిస్తుంది. ఆటిజం లక్షణాలు సాధారణంగా చిన్న వయస్సులోనే (సాధారణంగా 2 సంవత్సరాల వయస్సులోపు) బయటపడుతాయి. తల్లిదండ్రులు లేదా ఇతరులు పేరు పెట్టి పిలిచినా స్పందించకపోవడం, ఇతరుల భావాలను అర్థం చేసుకోలేకపోవడం లేదా వాటిని పంచుకోలేకపోవడం, ముఖ కవళికలను ఉపయోగించడంలో ఇబ్బంది పడటం వంటి లక్షణాలు ఆటిజంలో భాగంగా ఉన్నాయి.
ఇదీ చదవండి: ఎలాన్ మస్క్ టెస్లాకు బై..బై?


