టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్ ప్రతిపాదిత 1 ట్రిలియన్ అమెరికన్ డాలర్ల(సుమారు రూ.88 లక్షల కోట్లు) వేతన ప్యాకేజీని వాటాదారులు ఆమోదించడంలో విఫలమైతే అతడు సంస్థను విడిచిపెట్టే ప్రమాదం ఉందని టెస్లా బోర్డు ఛైర్మన్ రాబిన్ డెన్హోమ్ హెచ్చరిక జారీ చేశారు. నవంబర్ 6, 2025న జరగనున్న కంపెనీ వార్షిక సమావేశానికి ముందు డెన్హోమ్ వాటాదారులకు పంపిన లేఖలో ఈమేరకు వివరాలు వెల్లడించారు. ఈసారి మస్క్ వేతన ప్యాకేజీకి సంబంధించిన ఓటు టెస్లా భవిష్యత్తుకు అత్యంత కీలకం అని లేఖలో స్పష్టం చేశారు.
మస్క్ ఏం చేయబోతున్నారు?
మస్క్ ప్రతిపాదించిన ఈ పరిహార ప్రణాళిక ఎందుకు కీలకమో డెన్హోమ్ లేఖలో వివరించారు. ‘మస్క్ ఆధ్వర్యంలోని కంపెనీలు అత్యంత ప్రతిష్టాత్మకమైన పనితీరు లక్ష్యాలతో ముడిపడి ఉన్నాయి. 2035 నాటికి టెస్లా మార్కెట్ క్యాప్‌ను 1.36 ట్రిలియన్ డాలర్ల నుంచి 8.5 ట్రిలియన్ డాలర్లకు పెంచాలని నిర్ణయించుకున్నారు. ఏటా 20 మిలియన్ వాహనాలను డెలివరీ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. 1 మిలియన్ రోబోటాక్సీలను తయారు చేయాలని, మరో 1 మిలియన్ ఆప్టిమస్ హ్యూమనాయిడ్ రోబోట్లను డెలివరీ చేయాలని నిర్ణయించుకున్నారు’ అని చెప్పారు.
డెన్హోమ్ తన లేఖలో.. ఈ లక్ష్యాలను సాధించడానికి మస్క్ నాయకత్వం చాలా అవసరమని చెప్పారు. మస్క్ లేకపోతే టెస్లా గణనీయమైన విలువను కోల్పోయే ప్రమాదం ఉందని హెచ్చరించారు. మస్క్ వేతన ప్యాకేజీ ఓటు టెస్లాకు కీలకమైన భవిష్యత్ పెట్టుబడి అని చెప్పారు. అయితే ఈ ప్యాకేజీపై ఇప్పటికే తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఐఎస్ఎస్ వంటి కార్పొరేట్ అడ్మినిస్ట్రేటివ్ అడ్వైజరీ సంస్థలు ఈ ప్యాకేజీ నిర్మాణంపై విమర్శలు గుప్పించాయి. దీనిపై మస్క్ స్పందిస్తూ విమర్శకులను ‘కార్పొరేట్ టెర్రరిస్టులు’ అని పేర్కొన్నారు. ఇదిలాఉండగా, వాటాదారుల ఓటు నవంబర్ 5, 2025 రాత్రి 11:59 గంటలకు ముగియనుంది. టెస్లా వార్షిక సమావేశం నవంబర్ 6, 2025న నిర్వహించనున్నారు.
ఇదీ చదవండి: ధర్మ మార్గాన ధనార్జన


