నేటి ఆధునిక యుగంలో ఆర్థిక స్వేచ్ఛ సాధించడం ప్రతి ఒక్కరి కల. అయితే కొందరు వ్యక్తుల్లో ‘ఎదుటివారిని మోసం చేస్తేనే ధనవంతులు కాగలం’ అనే తప్పుడు అభిప్రాయం బలంగా పాతుకుపోయింది. ఈ విధమైన అక్రమ సంపాదన ధోరణి తాత్కాలికంగా ఫలించినా అది ఎప్పుడూ స్థిరమైన, గౌరవప్రదమైన జీవితాన్ని ఇవ్వలేదు. నిజమైన, నిలకడైన సంపదను, గౌరవాన్ని సాధించాలంటే కచ్చితంగా ధర్మబద్ధమైన మార్గాలనే అనుసరించాలి. సగటు ఉద్యోగి, వ్యాపారి లేదా ఇతర రంగాల్లో ఉన్నవారు నైతిక విలువలను పాటిస్తూ సరైన ఆర్థిక ప్రణాళికతో ధనవంతులు ఎలా కావాలో చూద్దాం.
ఆదాయాన్ని పెంచే నైపుణ్యాలపై దృష్టి
ఉద్యోగులు తమ వృత్తిలో అత్యంత విలువైన వ్యక్తిగా మారడానికి ప్రయత్నించాలి. కొత్త నైపుణ్యాలు నేర్చుకోవడం, సాంకేతిక పరిజ్ఞానాన్ని మెరుగుపరుచుకోవడం ద్వారా జీతం పెరిగే అవకాశాలు మెరుగుపడతాయి. ముఖ్యంగా సంస్థకు లాభాలను తెచ్చిపెట్టే లేదా సమస్యలను పరిష్కరించే నైపుణ్యాలపై పెట్టుబడి పెట్టాలి.
వ్యాపారులు, ఇతర నిపుణులు తమ ఉత్పత్తులు లేదా సర్వీసుల్లో నిరంతరం కొత్త ఆవిష్కరణలు తీసుకురావడం, మార్కెట్ అవసరాలకు అనుగుణంగా తమను తాము మార్చుకోవడం ద్వారా వ్యాపార విస్తరణ, లాభాల పెంపు సాధ్యమవుతుంది. నాణ్యత, నమ్మకమే విజయానికి పునాది అనే విషయాన్ని గుర్తుంచుకోవాలి.
ఖర్చులపై నియంత్రణ, పొదుపు
ధనవంతులు కావడానికి కేవలం ఎక్కువ సంపాదించడం మాత్రమే మార్గం కాదు. సంపాదించిన దానికంటే తక్కువ ఖర్చు చేయడం చాలా ముఖ్యం. నెలవారీ ఖర్చులను ట్రాక్ చేస్తూ దేనికి ఎంత ఖర్చు చేస్తున్నారో స్పష్టంగా తెలుసుకోవాలి. అనవసరమైన, ఆడంబరమైన ఖర్చులను తగ్గించుకోవాలి. జీతం రాగానే మొదట కొంత మొత్తాన్ని పొదుపు/ పెట్టుబడి ఖాతాలోకి మళ్లించాలి. మిగిలిన దానితోనే ఖర్చులను ప్లాన్ చేసుకోవాలి. ఈ అలవాటు ఆర్థిక క్రమశిక్షణను పెంచుతుంది.
తెలివైన పెట్టుబడులు
కాలంతో పాటు డబ్బు విలువ తగ్గకుండా వృద్ధి చెందేలా పెట్టుబడి పెట్టడం అవసరం. పదవీ విరమణ, పిల్లల చదువులు వంటి దీర్ఘకాలిక లక్ష్యాల కోసం ప్లాన్ చేసుకోవాలి. మ్యూచువల్ ఫండ్స్, ఈక్విటీ మార్కెట్లు, రియల్ ఎస్టేట్, బంగారంలో క్రమబద్ధంగా పెట్టుబడులు పెట్టడం ద్వారా వడ్డీ, రాబడి రూపంలో సంపద పెరుగుతుంది. వీటిలో ఇన్వెస్ట్ చేసేముందు నిపుణుల సలహా తీసుకోవాలి. అధిక వడ్డీ ఉన్న అప్పులను (ముఖ్యంగా క్రెడిట్ కార్డు అప్పులు) వీలైనంత త్వరగా తీర్చేయాలి. మంచి అప్పులు (వ్యాపార విస్తరణకు లేదా విలువ పెంచే ఆస్తుల కొనుగోలుకు) మాత్రమే చేయడం తెలివైన నిర్ణయం అవుతుంది.
ఇదీ చదవండి: కాలంతో మారిన కంపెనీలు.. అందుకు కారణాలు


