ప్రపంచవ్యాప్తంగా ప్రజాదరణ పొందిన అనేక ప్రముఖ కంపెనీల చరిత్రను పరిశీలిస్తే వాటి ప్రస్తుత ఉత్పత్తులకు లేదా సర్వీసులకు పూర్తి భిన్నంగా వాటి తొలి ఉత్పత్తులున్నాయి. లాంబొర్ఘిని (Lamborghini) కంపెనీ స్థాపించిన తొలినాళ్లలో ట్రాక్టర్లు తయారు చేసేది, కోకాకోలా (Coca-Cola) సిరప్‌లను విక్రయించింది. సోనీ (Sony) రైస్ కుక్కర్లను, ఎల్‌జీ (LG) ఫేషియల్ క్రీమ్‌లను, నోకియా (Nokia) టాయిలెట్ పేపర్లను, ఐకియా (IKEA) పెన్నులను తయారు చేశాయి. కాలక్రమేణా ఈ కంపెనీలు తమ తొలి ఉత్పత్తులను వదిలివేసి మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా తమ మార్గాన్ని మార్చుకున్నాయి. ఈ కంపెనీలు తమ రంగాల్లో ప్రముఖంగా నిలవడానికి దోహదపడిన ఈ పరిణామం (Evolution) వెనుక గల కారణాలను విశ్లేషిద్దాం.
మార్పునకు ప్రధాన కారణాలు
మార్కెట్ ఎప్పుడూ స్థిరంగా ఉండదు. ఇది నిరంతరం మారుతూ ఉంటుంది. కొత్త సాంకేతికతలు, ఆర్థిక పరిస్థితులు, వినియోగదారుల అభిరుచులు ఉత్పత్తుల అవసరాన్ని మారుస్తాయి. ఫెర్రుచియో లాంబొర్ఘిని (Ferruccio Lamborghini) ట్రాక్టర్ల నుంచి స్పోర్ట్స్ కార్లకు మారడానికి వ్యక్తిగతమైన ప్రేరణ ఉన్నప్పటికీ యూరప్‌లో పెరుగుతున్న సంపద, లగ్జరీ కార్లకు డిమాండ్ పెరుగుతుండడం వంటి మార్కెట్ పరిస్థితులు ఈ మార్పుకు దోహదపడ్డాయి. నోకియా.. కాగితం, రబ్బరు వస్తువులను ఉత్పత్తి చేయడం నుంచి మొబైల్ ఫోన్‌ల వైపు మారడానికి కారణం.. 20వ శతాబ్దం చివర్లో టెలికమ్యూనికేషన్స్ రంగంలో విప్లవాత్మక మార్పు సంభవించడం.
సాంకేతిక పురోగతి, ఆవిష్కరణ
సాంకేతికతలో వచ్చే మార్పులు కంపెనీలకు కొత్త మార్గాలను అందిస్తాయి. ఈ క్రమంలో తమను తాము అప్‌డేట్ చేసుకోలేని కంపెనీలు మనుగడ సాగించలేవు. సోనీ కంపెనీ రైస్ కుక్కర్లు, టేప్ రికార్డర్ల తయారీ నుంచి ఎలక్ట్రానిక్స్ వైపు మారడానికి కారణం.. ట్రాన్సిస్టర్ల ఆవిష్కరణ. ఆడియో, వీడియో టెక్నాలజీలో ప్రపంచ నాయకత్వం వహించాలనే లక్ష్యంతో కంపెనీ ముందుకెళ్లింది. సాంకేతికతో సరికొత్త మార్కెట్లను సృష్టించింది. ఎల్‌జీ సంస్థ ముందుగా దక్షిణ కొరియాలో ఫేషియల్ క్రీమ్‌లు తయారు చేస్తుండేది. కొత్త టెక్నాలజీని అందిపుచ్చుకోవాలనే ఉద్దేశంతో ఆధునిక హోమ్ అప్లయెన్సెస్, ఎలక్ట్రానిక్స్ వైపు దృష్టి సారించింది.
First product of renowned brands:
🇮🇹 Lamborghini → Tractor
🇯🇵 Toyota → Automatic Loom
🇺🇸 Coca-Cola → Syrup
🇰🇷 Samsung → Grocery store
🇰🇷 LG → Facial Cream
🇯🇵 Sony → Rice Cooker
🇫🇮 Nokia → Toilet Paper
🇩🇰 Lego → Wooden Toys
🇯🇵 Nintendo → Playing Cards
🇺🇸 Nike → Track…— World of Statistics (@stats_feed) October 27, 2025
కొత్త తరాలకు సర్వీసు
కంపెనీలు మార్కెట్‌లో నిలకడగా ఉండాలంటే కేవలం ప్రస్తుత తరాలకు మాత్రమే కాకుండా భవిష్యత్తు తరాల అవసరాలను కూడా తీర్చగలగాలి. దీనినే సుస్థిరత అంటారు. భవిష్యత్తు తరాలు మరింత డిజిటల్ ఆధారిత సౌకర్యాలు కోరుకుంటారు. ఈ డిమాండ్‌ను అర్థం చేసుకోవడం ద్వారా పైన పేర్కొన్న కంపెనీలన్నీ తమ దృష్టిని నిత్యావసర వస్తువుల ఉత్పత్తి నుంచి హై-టెక్ లేదా లగ్జరీ వస్తువుల తయారీ వైపు దృష్టి సారిస్తున్నట్లు తెలుస్తుంది.
వనరుల వినియోగం
కొన్నిసార్లు కంపెనీలు తమ వద్ద ఉన్న నైపుణ్యాలు, వనరులను ఒక నిర్దిష్ట ఉత్పత్తి కంటే మెరుగ్గా వేరే రంగంలో ఉపయోగించుకోవచ్చని గుర్తిస్తాయి. కోకాకోలా కంపెనీ మొదటగా సిరప్‌లను తయారు చేసినప్పటికీ దాని బ్రాండింగ్, పంపిణీ నైపుణ్యం పానీయాల మార్కెట్‌లో అధిక లాభాలను పొందడానికి సహాయపడుతుందని గ్రహించింది. ఐకియా సంస్థ పెన్నుల తయారీ నుంచి ఫర్నిచర్ దిగ్గజంగా మారడానికి కారణం కూడా ఇదే. వస్తువుల సరళమైన డిజైన్, సమర్థవంతమైన పంపిణీలో ఉన్న ప్రత్యేక నైపుణ్యాలను గృహోపకరణాల మార్కెట్‌లో ఉపయోగించుకోవాలని భావించింది.
ఇదీ చదవండి: మౌలిక సదుపాయాల కల్పనకు సిద్ధమవుతున్న కంపెనీ


