
విక్రయాల్లో డబుల్ డిజిట్ వృద్ధి
జీఎస్‌టీ తగ్గింపుతో అమ్మకాలు పెరుగుతాయి
కంపెనీ ఎండీ సునీల్ నయ్యర్
కన్జ్యూమర్ ఎల్రక్టానిక్స్ సంస్థ సోనీ ఇండియా ప్రస్తుత పండుగల సీజన్ పట్ల ఆశావహంగా ఉన్నట్టు ప్రకటించింది. ముఖ్యంగా జీఎస్‌టీ రేట్ల తగ్గింపుతో పెద్ద తెరల టీవీల ధరలు తగ్గుతాయని.. దీంతో విక్రయాలు రెండంకెల మేర వృద్ధి చెందుతాయని (గతేడాది ఇదే సీజన్‌తో పోల్చి చూస్తే) అంచనా వేస్తున్నట్టు సంస్థ ఎండీ సునీల్ నయ్యర్ ప్రకటించారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ నుంచి టీవీల అమ్మకాలు ఫ్లాట్‌గా, ఎలాంటి వృద్ధి లేకుండా ఉన్నట్టు చెప్పారు.
జీఎస్‌టీ శ్లాబుల్లో మార్పుల వల్ల వీటి ధరలు 7.5–8 శాతం మేర తగ్గుతాయని అభిప్రాయపడ్డారు. దీంతో కొనుగోళ్ల సెంటిమెంట్ మెరుగుపడుతుందన్నారు. పెద్ద సైజు తెరల టీవీల మార్కెట్లో (ప్రీమియం మార్కెట్) సోనీ ప్రముఖ సంస్థగా ఉండడం తెలిసిందే. ఈ విభాగంలో టీవీల ధరలు మోడల్ ఆధారంగా రూ.8,000 నుంచి రూ.70,000 మధ్య తగ్గుతాయని నయ్యర్ ప్రకటించారు. ధరలు తగ్గడంతో కస్టమర్లు పెద్ద సైజు టీవీలు, మెరుగైన టెక్నాలజీ ఫీచర్లతో ఉన్న వాటికి మారతారన్న (అప్‌గ్రేడ్) ఆశాభావం వ్యక్తం చేశారు. విక్రయాలు 10–15 శాతం వరకు పెరగొచ్చన్నారు.
మాకు ప్రయోజనం..
జీఎస్‌టీలో 32 అంగుళాలకు మించిన టీవీలపై జీఎస్‌టీని 28 శాతం నుంచి 18 శాతానికి తగ్గించడం గమనార్హం. కొత్త రేట్లు ఈ నెల 22 నుంచి అమల్లోకి రానున్నాయి. 55 అంగుళాలు, అంతకుమించిన సైజు టీవీల మార్కెట్లో కీలకంగా ఉన్న సోనీ ఈ రేటు తగ్గింపుతో ప్రయోజనం పొందుతుందని నయ్యర్ చెప్పారు. ‘‘55, 65, 75, 85, 98 అంగుళాల టీవీలను పెద్ద సంఖ్యలో విక్రయిస్తుంటాం. ఈ టీవీలన్నీ ప్రీమియం, పెద్ద సైజు విభాగం కిందకు వస్తాయి’’అని తెలిపారు. 55 అంగుళాల టీవీ ధర రూ.8,000 వరకు తగ్గుతుందని.. 75 అంగుళాలు అంతకుమించిన సైజు టీవీలపై రూ.19,000–51,000 వరకు, 85 అంగుళాల టీవీలపై రూ.47,000–70,000 వరకు రేట్లు తగ్గుతాయని చెప్పారు. బడ్జెట్‌లో ప్రకటించిన ఆదాయపన్ను ప్రయోజనాలతో ఖర్చు చేసే ఆదాయం పెరుగుతుందని.. దీని ఫలితంగా కెమెరాలు, సౌండ్‌బార్లు, పార్టీ స్పీకర్లు, హెడ్‌ఫోన్లు, ప్లే స్టేషన్ ఉత్పత్తుల అమ్మకాలు సైతం పెరుగుతాయని నయ్యర్ అంచనా వేశారు. విక్రయాల్లో సగం వాటా కలిగిన చిన్న పట్టణాలు, గ్రామీణ మార్కెట్లలో సోనీ స్థానం మరింత బలపడుతుందన్నారు.
నిలిచిన కొనుగోళ్లు
ప్రభుత్వం జీఎస్‌టీపై నిర్ణయాలు ప్రకటించిన తర్వాత వినియోగదారులు టీవీల కొనుగోళ్లను నిలిపివేసినట్టు నయ్యర్ తెలిపారు. ప్రస్తుతం డిమాండ్ తక్కువగా ఉన్నట్టు చెప్పారు. అందరూ సెప్టెంబర్ 22 కోసం వేచి చూస్తున్నట్టు పేర్కొన్నారు. ఆ తర్వాత కొనుగోళ్లు ఒక్కసారిగా పెరుగుతాయని అంచనా వేశారు.
ఇదీ చదవండి: 5 ఏళ్లలో రూ.70 లక్షల కోట్లు