పండుగ సీజన్ రిటైల్ అమ్మకాల్లో రికార్డు
డీలర్ల సమాఖ్య ఫాడా గణాంకాలు వెల్లడి
న్యూఢిల్లీ: పండుగ సీజన్ 42 రోజుల్లో 52,38,401 వాహనాలు అమ్ముడైనట్లు డీలర్ల సమాఖ్య ఫాడా వెల్లడించింది. గతేడాది ఇదే సీజన్‌లో 43,25,632 యూనిట్ల విక్రయాలతో పోలిస్తే ఇవి 21% అధికమని పేర్కొంది. ప్యాసింజర్ వాహనాలు, టూ వీలర్స్ రికార్డు స్థాయి రిజిస్ట్రేషన్లు, జీఎస్టీ క్రమబద్దీకరణతో వివిధ విభాగాల్లో వాహన ధరలు దిగిరావడంతో ఈ వృద్ధి సాధ్యమైందని ఫాడా వివరించింది. నవరాత్రి తొలిరోజు మొదలై ధనత్రయోదశి తర్వాత 15 రోజుల వరకు కొనసాగిన 42 రోజుల ఈ పండుగ సీజన్ భారత ఆటో రిటైల్ రంగంలో చిరస్మరణీయంగా నిలిచిపోయింది. అన్ని విభాగాల్లో అత్యధిక విక్రయాలు, అత్యుత్తమ వృద్ధి నమోదైందని ఫాడా అధికారులు
తెలిపారు.
→ ప్రయాణికుల వాహన విక్రయాలు 6,21,539 యూనిట్ల నుంచి 23% పెరిగి 7,66,918 యూనిట్లకు చేరాయి. ‘‘సామాన్యులకు వాహన ధరలు అందుబాటులో ఉండేలా చేయడం, మధ్య తరగతి వినియోగ సామర్థ్య పెంపు లక్ష్యంగా అమల్లోకి వచి్చన జీఎస్‌టీ 2.0 విజన్ డీలర్‌షిప్ స్థాయి వద్ద విజయవంతమైంది. పన్ను రేట్లు తగ్గడంతో కాంపాక్ట్, చిన్న కార్ల విక్రయాలు గణనీయంగా పెరిగాయి. కొన్ని మోడళ్ల డిమాండ్ సరఫరాను మించింది’’ అని ఫాడా చైర్మన్ సీఎస్ విఘ్నేశ్వర్ తెలిపారు.
→ ద్వి చక్ర వాహన విక్రయాల్లో 22% వృద్ధి నమోదైంది. గతేడాది 33,27,198 యూనిట్లు అమ్ముడుకాగా., ఈసారి 40,52,503 యూనిట్లకు చేరుకున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో గిరాకీ పుంజుకోవడం, మెరుగైన ద్రవ్యలభ్యత, జీఎస్‌టీ సంస్కరణలతో ధరలు దిగిరావడంతో ఈ విభాగంలో అమ్మకాలు పెరిగినట్లు విఘ్నేశ్వర్ తెలిపారు. మోటార్‌సైకిళ్లు, స్కూటర్లతో పాటు ఈవీలకూ డిమాండ్ గణనీయంగా పెరిగిందన్నారు.
→ వాణిజ్య విక్రయాలు వరుసగా 15% పెరిగి 1,39,586 యూనిట్లకు చేరుకున్నాయి. త్రీ వీలర్ల రిజిస్ట్రేషన్లు 1,59,959 యూనిట్ల నుంచి 9% పెరిగి 1,74,189 యూనిట్లకు చేరాయి. ట్రాక్టర్ల అమ్మకాలు 85,199 యూనిట్ల నుంచి 97,314 యూనిట్లకు పెరిగాయి. అయితే కన్‌స్ట్రక్షన్ ఎక్విప్‌మెంట్స్ 10,387 యూనిట్ల నుంచి 7,891 యూనిట్లకు తగ్గాయి. ఈ ఒక్క విభాగపు అమ్మకాల్లోనే క్షీణత నమోదైంది.
→ ఇక ఒక్క అక్టోబర్‌లోనే 40,23,923 వాహనాలు అమ్ముడయ్యాయి. గతేడాది ఇదే నెలలో అమ్ముడైన 28,63,354 యూనిట్లతో పోలిస్తే ఇవి 41% అధికం. తద్వారా దేశీయ ఆటో చరిత్రలో అత్యధిక రిటైల్ వాహనాలు అమ్ముడైన నెలగా అక్టోబర్ నిలిచిపోయింది.
‘‘జీఎస్‌టీ 2.0 ప్రభావం కొనసాగింపు, స్థిరమైన గ్రామీణ ఆదాయం, పెళ్లిళ్లు, పంట సీజన్ల డిమాండ్ కారణంగా మరో 3 నెలల పాటు వాహన విక్రయాల్లో వృద్ధి నమోదు కావచ్చు. పండుగ స్పిల్‌ఓవర్ బుకింగ్స్, డీలర్ల వద్ద తగినంత నిల్వలు, ఆటో కంపెనీల కొత్త మోడళ్ల ఆవిష్కరణలు రిటైల్ విక్రయాల్లో కొనసాగుతున్న మూమెంటమ్‌ను కొనసాగిస్తాయి. ఇయర్‌ఎండ్ ఆఫర్లు, కొత్త ఏడాది రిజిస్ట్రేషన్లు కూడా మద్దతుగా నిలుస్తాయి’’ ఫాడా అంచనా వేసింది.


