టాప్‌ గేర్‌లో వాహన విక్రయాలు | Indian car sales hit a record high in October | Sakshi
Sakshi News home page

టాప్‌ గేర్‌లో వాహన విక్రయాలు

Nov 2 2025 6:06 AM | Updated on Nov 2 2025 6:06 AM

Indian car sales hit a record high in October

కలిసొచ్చిన పండుగ సీజన్‌ 

జీఎస్‌టీ 2.0 సంస్కరణల అమలు దన్ను  

అక్టోబర్‌లో మారుతీ, హ్యుందాయ్, ఎంఅండ్‌ఎం అమ్మకాల జోరు 

న్యూఢిల్లీ: పండుగ సీజన్‌కు తోడు జీఎస్‌టీ 2.0 సంస్కరణలు కలిసిరావడంతో అక్టోబర్‌లో రిటైల్‌ వాహన విక్రయాలు రికార్డు స్థాయిలో నమోదయ్యాయి. మారుతీ సుజుకీ, మహీంద్రా అండ్‌ మహీంద్రా, టాటా మోటార్స్, కియా మోటార్స్‌ ఆటో కంపెనీల విక్రయాల్లో రెండంకెల వృద్ధి నమోదైంది. స్కోడా ఆటో, టయోటా కిర్లోస్కర్‌ మోటార్‌లు సైతం చెప్పుదగ్గ స్థాయిలో వాహనాలను విక్రయించాయి. దేశీయ అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతీ సుజుకీ అక్టోబర్‌లో 1,80,675 వాహనాలు విక్రయించింది.

 గత ఏడాదిలో అమ్ముడైన 1,63,130 వాహనాలతో పోలిస్తే ఇది 11% అధికం. విదేశాలకు చేసిన ఎగుమతులు(31,304), ఇతర సంస్థలకు అమ్మకాలు(8,915) కలిపి మొత్తం విక్రయాలు 2,20,894 యూనిట్లుగా నమోదయ్యాయి. ‘‘మునుపెన్నడూ లేనంతగా ఒక్క అక్టోబర్‌లోనే 2,42,096 యూనిట్లు రిటైల్‌ అమ్మకాలు జరిపాయి. గతేడాదితో పోలిస్తే ఇవి 20% అధికం. నవరాత్రుల ప్రారంభం నుంచి పండగ సీజన్‌ 40 రోజుల్లో 5 లక్షల బుకింగ్స్, 4.1 లక్షల రిటైల్‌ వాహనాలు విక్రయించాము. గతేడాది మొత్తం అమ్మకాలతో పోలిస్తే ఇవి రెట్టింపు. 

జీఎస్‌టీ సంస్కరణలకు ముందు తొలిసారిగా కార్లు కొనే కస్టమర్లకు కొన్ని సవాళ్లు ఉండేవి. సంస్కరణల అమలు తర్వాత అధిక సంఖ్యలో వినియోగదారలు షోరూంలను సందర్శిస్తున్నారు’’ అని మారుతీ సుజుకీ ఇండియా సీనియర్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌ పార్థో బెనర్జీ తెలిపారు. 

→ మహీంద్రా అండ్‌ మహీంద్రా దేశీయంగా రికార్డు స్థాయిలో 71,624 ఎస్‌యూవీలను విక్రయించింది. గతేడాది అక్టోబర్‌లో అమ్మకాలు 54,504 యూనిట్లతో పోలిస్తే ఇవి 31% అధికం. ఎస్‌యూవీలు ఒక నెలలో ఈ స్థాయిలో అమ్ముడుపోవడం ఇదే తొలిసారి అని కంపెనీ నళినికాంత్‌ గొల్లగుంట తెలిపారు. 

→ టాటా ప్యాసింజర్‌ వెహికల్స్‌ లిమిటెడ్‌ మొత్తం 61,295 యూనిట్లను విక్రయించింది. గతేడాది ఇదే నెలలో 48,423 యూనిట్లతో పోలిస్తే విక్రయాల్లో 26.6% వృద్ధి నమోదైంది. ఇందులో 47 వేల యూనిట్లు ఎస్‌యూవీలున్నాయి. 

→ హ్యుందాయ్‌ మోటార్‌ ఇండియా మొత్తం 69,894 వాహనాలను విక్రయించింది. గతేడాది అక్టోబర్‌లో అమ్మిన 53,792 యూనిట్లతో పోలిస్తే ఇవి 30% అధికం. దేశీయ విక్రయాలు మాత్రం 3% క్షీణించి 55,568 నుంచి 53,792 యూనిట్లకు దిగివచ్చాయి. అయితే మార్కెట్లోని డిమాండ్‌కు తగ్గట్లు క్రెటా, వెన్యూ విభాగంలో 30,119 ఎస్‌యూవీలను విక్రయించింది. ‘‘దసరా, ధన్‌తేరాస్, దీపావళి పండుగలతో డిమాండ్‌ నెలకొంది. జీఎస్‌టీ 2.0 సంస్కరణలు అమలు కూడా వీటికి తోడు కావడంతో అక్టోబర్‌లో భారతీయ ఆటోమోటివ్‌ పరిశ్రమ మరింత కాంతులీనింది’’ అని హెచ్‌ఎంఐఎల్‌ సీఓఓ తరుణ్‌ గార్గ్‌ తెలిపారు. 

→ కియా ఇండియా కూడా మెరుగైన అమ్మకాలను నమోదు చేసింది. గతేడాదితో పోలిస్తే 30 శాతం వృద్ధితో 29,556 పాసింజర్‌ వాహనాలను విక్రయించింది. సోనెట్, కారెన్స్‌ క్లావిస్, కారెన్స్‌ క్లావిస్‌ ఈవీ, సెల్టోస్‌ మెరుగైన విక్రయాలకు దోహదపడ్డాయి. ‘‘కియా ఇండియా ప్రయాణంలో 2025 అక్టోబర్‌ ఒక చారిత్రాత్మక మైలురాయి. కస్టమర్ల అభిరుచులకు అనుగుణంగా మా ఉత్పత్తుల పోర్ట్‌ఫోలియో ఉంటుంది’’ అని కంపెనీ వైస్‌ ప్రెసిడెంట్‌ అతుల్‌ సోద్‌ తెలిపారు.  

→ స్కోడా ఆటో ఇండియా  8,252 యానిట్ల కార్లను విక్రయించింది. ఈ ఏడాది తొలి పదినెలల్లో (జనవరి–అక్టోబర్‌) 61,607 యూనిట్లను అమ్మింది. కంపెనీ ఒక ఏడాదిలో అత్యధిక అమ్మకాలు (2022లో) 53,721 యూనిట్లను అధిగమించడం విశేషం. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement