భారతీయ కార్పొరేట్ రంగంలో ఉద్యోగుల జీతాల పెరుగుదల నిలకడగా కొనసాగుతోంది. కనీసం వచ్చే ఏడాదైనా వేతనాల పెంపు ఆశించినమేర ఉంటుందని కొందరు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రముఖ కన్సల్టింగ్ సంస్థ మెర్సర్ నిర్వహించిన ‘టోటల్ రెమ్యునరేషన్ సర్వే’ ప్రకారం, 2026 సంవత్సరంలో భారతదేశంలోని కంపెనీలు సగటున 9 శాతం వేతన పెంపును అమలు చేసే అవకాశం ఉంది. దాదాపు 1,500 కంటే ఎక్కువ సంస్థల నుంచి సేకరించిన సమాచారం ఆధారంగా ఈ నివేదికను రూపొందించారు.
రంగాల వారీగా అంచనాలు
ఈ పెంపులో కొన్ని రంగాలు ఇతర విభాగాల కంటే మెరుగైన ప్రదర్శన కనబరుస్తున్నాయి. ఆటోమోటివ్, మ్యానుఫ్యాక్చరింగ్, ఇంజినీరింగ్ రంగాల్లో పనిచేసే ఉద్యోగుల వేతనాలు 9.5 శాతం పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు. గ్లోబల్ కెపాసిటీ సెంటర్ల(జీసీసీ)లో పని చేసే ఉద్యోగులకు సుమారు 9 శాతం మేర పెంపు ఉంటుందని అంచనా.
ఈ సందర్భంగా మెర్సర్ ఇండియా రివార్డ్స్ కన్సల్టింగ్ లీడర్ మాలతి కేఎస్ మాట్లాడుతూ..‘భారతదేశంలో మెరిట్ ఆధారిత వేతన పెంపు స్థిరంగా ఉండటం అనేది ఆర్థిక వాతావరణం పట్ల సంస్థల నమ్మకాన్ని సూచిస్తుంది. వ్యయ నియంత్రణ పాటిస్తూనే అగ్రశ్రేణి ప్రతిభావంతులను ఆకర్షించేందుకు సంస్థలు ఆసక్తి చూపుతున్నాయి’ అని చెప్పారు.
ఇన్సెంటివ్‌లపై ఫోకస్
ప్రస్తుత మార్కెట్ పరిస్థితుల్లో కంపెనీలు తమ రివార్డ్ విధానాల్లో మార్పులు చేస్తున్నాయి. కేవలం వార్షిక పెంపుపైనే కాకుండా స్వల్పకాలిక ప్రోత్సాహకాలపై కంపెనీలు మొగ్గు చూపుతున్నాయి. ఖర్చులను అదుపులో ఉంచుతూనే అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన ఉద్యోగులను నిలుపుకోవడానికి ఇది ఒక వ్యూహాత్మక చర్యగా నిపుణులు విశ్లేషిస్తున్నారు.
నియామకాల్లో తగ్గుదల..
వేతనాల పెంపు ఆశాజనకంగా ఉన్నప్పటికీ కొత్త నియామకాల విషయంలో కంపెనీలు కొంత అప్రమత్తత పాటిస్తున్నాయి. 2024లో 43 శాతంగా ఉన్న నియామక విస్తరణ ప్రణాళికలు 2026 నాటికి 32 శాతానికి తగ్గే అవకాశం ఉంది. సుమారు 31 శాతం కంపెనీలు నియామకాలపై ఇంకా ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. అయితే ఈ ఏడాదిలో అట్రిషన్ రేటు(ఉద్యోగులు సంస్థలను వదిలి వెళ్లే రేటు) గణనీయంగా తగ్గింది. 2023లో 13.1 శాతంగా ఉన్న అట్రిషన్ 2025 మొదటి అర్ధభాగం నాటికి 6.4 శాతానికి పడిపోయింది.
ఇదీ చదవండి: సామాన్యుడికి ఆర్‌బీఐ ఈ ఏడాది గిఫ్ట్!


