ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2025–26)లో భారత వృద్ధి రేటు అంచనాను ఏడు శాతానికి పెంచుతున్నట్లు ప్రముఖ రేటింగ్ సంస్థ క్రిసిల్ తెలిపింది. అంతకుముందు 6.5% వృద్ధిని అంచనా వేసింది. 2025–26 ప్రథమార్ధంలో దేశీయ వృద్ధి రేటు అంచనాలకు మించి 8% వృద్ధి సాధించిన నేపథ్యంలో వృద్ధి అవుట్‌లుక్‌ను అప్‌గ్రేడ్ చేసింది. భారత వాస్తవ జీడీపీ వృద్ధి రెండో త్రైమాసికంలో 8.2 శాతంగా నమోదై, అంచనాలను మించిందని క్రిసిల్ ఆర్థికవేత్త ధర్మకృతి జోషి తెలిపారు.
ద్రవ్యోల్బణం దిగిరావడంతో నామినల్ జీడీపీ లేదా ప్రస్తుత ధరల వద్ద జీడీపీ వృద్ధి మోస్తారు స్థాయిలో 8.7%గా నమోదైంది. అమెరికా సుంకాల విధింపు ప్రభావంతో 2025–26 ద్వితీయార్ధంలో వృద్ధి 6.1 శాతానికి పరిమితం కావొచ్చని జోషి అంచనా వేశారు. ‘‘ప్రైవేటు వినియోగం వాస్తవ జీడీపీ వృద్ధికి ప్రధాన ఇంధనంగా నిలిచింది. సప్లై దృష్టి కోణంలో తయారీ, సేవల రంగాల్లో వృద్ధి గణనీయంగా పెరిగింది. దేశంలో ఆహార ద్రవ్యోల్బణం తగ్గడంతో స్వచ్ఛంద వినియోగ వ్యయం ఊపందుకుంది. మూడో క్వార్టర్‌లో ఈ అనుకూల పరిస్థితులు కలిసొస్తాయి. ప్రభుత్వ పెట్టుబడుల్లో స్థిరత్వం కొనసాగే వీలుంది. ప్రైవేటు పెట్టుబడులు ఆలస్యమైనప్పట్టకీ.., క్రమంగా పెరగొచ్చు’’ అని జోషి అభిప్రాయపడ్డారు.
ఇదీ చదవండి: తయారీపై ‘టారిఫ్‌ల’ ప్రభావం


