గతేడాది (2025) బంగారం ధరలు చరిత్రలో ఎన్నడూ లేని స్థాయికి చేరాయి. 2025–26 ఆర్థిక సర్వే ప్రకారం, అమెరికా ప్రభుత్వం ప్రకటించిన సుంకాలు, ప్రపంచ విధాన అనిశ్చితి, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, బలహీనపడుతున్న అమెరికన్ డాలర్ కారణంగా బంగారం వంటి సురక్షిత పెట్టుబడులపై డిమాండ్ పెరిగింది. ఫలితంగా బంగారం ధరలు ఔన్స్‌కు 2,607 డాలర్ల నుంచి 4,315 డాలర్ల వరకు పెరిగాయి.
భారత మార్కెట్‌లో భారీ రాబడులు
మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ ఆఫ్ ఇండియా (MCX)లో బంగారం ధర 2025 జనవరిలో రూ.81,028గా ఉండగా, 2026 జనవరి నాటికి రూ.1,75,231కు చేరింది. దీంతో ఒక ఏడాది కాలంలోనే పెట్టుబడిదారులకు సుమారు 116 శాతం రాబడి లభించింది.
2026లో ధరల్లో ఒడిదుడుకులు
అయితే, ఇటీవలి కాలంలో బంగారం ధరల్లో స్వల్ప కరెక్షన్ కనిపించింది. 2026 జనవరి 30న ఎంసీఎక్స్ (MCX)లో స్పాట్ గోల్డ్ ధర రూ.1,75,231 నుంచి రూ.1,67,095కు తగ్గింది. దీని ప్రభావంతో పలు గోల్డ్ ఈటీఎఫ్‌ల విలువలు కూడా సుమారు 10 శాతం వరకు పడిపోయాయి.
కేంద్ర బ్యాంకుల బంగారం నిల్వలు పెంపు
ఆర్థిక సర్వే ప్రకారం, ప్రపంచవ్యాప్తంగా కేంద్ర బ్యాంకులు బంగారం నిల్వలను పెంచుతున్నాయి. భారత్‌లో బంగారం నిల్వల విలువ 2025 మార్చి చివరిలో 78.2 బిలియన్ డాలర్లుగా ఉండగా, 2026 జనవరి నాటికి 117.5 బిలియన్ డాలర్లకు పెరిగింది. ఇది బంగారంపై కొనసాగుతున్న విశ్వాసాన్ని సూచిస్తోంది.
2026పై ఆర్థిక సర్వే అంచనాలు
ప్రపంచ అనిశ్చితులు కొనసాగితే, వాణిజ్య యుద్ధాలు పరిష్కారం కాకపోతే బంగారం, వెండి వంటి విలువైన లోహాలకు డిమాండ్ కొనసాగుతుందని ఆర్థిక సర్వే పేర్కొంది. అయితే, 2025లో కనిపించినంత భారీ ర్యాలీ 2026లో ఉండకపోవచ్చని, ధరల్లో ఒడిదుడుకులు సహజమని కూడా హెచ్చరించింది.
సేఫ్ హేవన్‌గా బంగారం
మొత్తానికి, తాత్కాలికంగా ధరల్లో మార్పులు వచ్చినప్పటికీ, దీర్ఘకాలంలో బంగారం సురక్షిత పెట్టుబడిగానే కొనసాగుతుందని ఆర్థిక సర్వే స్పష్టం చేసింది.


