ఉద్యోగం చేసేవారికి కోటీశ్వరులు కావాలనే కల నెరవేర్చుకోవడానికి క్రమశిక్షణతో కూడిన పెట్టుబడి ప్రణాళిక చాలా ముఖ్యం. కేవలం పొదుపు చేయడం ద్వారా లక్ష్యాన్ని చేరుకోవడం కష్టం. అందుకే పెట్టుబడి పెట్టడం ద్వారా మీ డబ్బు మీ కోసం పనిచేసేలా చేయాలి. దీనికి తోడు చక్రవడ్డీ (Compounding) శక్తిని అర్థం చేసుకోవడం, వీలైనంత త్వరగా పెట్టుబడి పెట్టడం, రిస్క్‌ను తట్టుకునే సామర్థ్యాన్ని బట్టి వివిధ మార్గాల్లో పెట్టుబడులను విభజించడం చాలా అవసరం. పెట్టుబడి పెట్టడానికి ఉద్యోగులకు అందుబాటులో ఉన్న ప్రధాన మార్గాలు ఏమిటో చూద్దాం.
మ్యూచువల్ ఫండ్స్
ఉద్యోగులకు కోటీశ్వరులయ్యే లక్ష్యాన్ని చేరేందుకు మ్యూచువల్ ఫండ్స్ అత్యంత ప్రజాదరణ పొందిన మార్గాలలో ఒకటి. ప్రతి నెలా క్రమం తప్పకుండా ఒక నిర్ణీత మొత్తాన్ని పెట్టుబడి పెట్టడానికి సిప్ విధానం అనుకూలంగా ఉంటుంది. ఇది మార్కెట్ హెచ్చుతగ్గుల ప్రభావాన్ని తగ్గిస్తుంది. చిన్న మొత్తంతో మొదలుపెట్టి జీతం పెరిగే కొద్దీ సిప్ మొత్తాన్ని పెంచుకుంటూ పోవడం మంచి పద్ధతి.
ఈక్విటీ ఫండ్స్
దీర్ఘకాలంలో (10-15 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ) అధిక రాబడిని ఆశించేవారికి ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ (లార్జ్-క్యాప్, మిడ్-క్యాప్, స్మాల్-క్యాప్, ఫ్లెక్సీ-క్యాప్ ఫండ్స్) అనుకూలం. ఇవి అధిక రిస్క్‌తో కూడినప్పటికీ ద్రవ్యోల్బణాన్ని అధిగమించే శక్తిని కలిగి ఉంటాయి.
డెట్ ఫండ్స్
ఇవి బాండ్‌లు, గవర్నమెంట్ సెక్యూరిటీస్ వంటి స్థిర ఆదాయ సాధనాల్లో పెట్టుబడి పెడతాయి. తక్కువ రిస్క్, స్థిరమైన రాబడి కోరుకునే వారికి ఇవి ఉపయోగపడతాయి.
ఈఎల్‌ఎస్‌ఎస్ ఫండ్స్
ఇవి ఈక్విటీ లింక్డ్ సేవింగ్స్ స్కీమ్స్. పెట్టుబడిపై ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80సీ కింద పన్ను ప్రయోజనం లభిస్తుంది. అయితే వీటికి కనీసం మూడు సంవత్సరాల లాక్ ఇన్ పీరియడ్ ఉంటుంది.
ఈక్విటీ, స్టాక్ మార్కెట్
పెట్టుబడిపై అధిక నియంత్రణ, అధిక రాబడిని కోరుకునే వారికి స్టాక్ మార్కెట్‌లో నేరుగా పెట్టుబడి పెట్టడం ఒక మార్గం. స్టాక్ మార్కెట్‌లో నేరుగా పెట్టుబడి పెట్టాలంటే మార్కెట్‌పై, కంపెనీల ఫండమెంటల్స్‌పై మంచి అవగాహన ఉండాలి. ఇది మ్యూచువల్ ఫండ్స్ కంటే అధిక రిస్క్‌తో కూడుకున్నది. దీర్ఘకాలికంగా బలంగా ఉన్న మంచి వృద్ధి సామర్థ్యం కలిగిన నాణ్యమైన కంపెనీల షేర్లను ఎంచుకోవడం వల్ల అద్భుతమైన రాబడిని పొందే అవకాశం ఉంది. మీ పోర్ట్‌ఫోలియోలో కొంత భాగాన్ని మాత్రమే డైరెక్ట్ ఈక్విటీకి కేటాయించడం, ఒకే రంగంలో లేదా ఒకే షేరులో ఎక్కువ పెట్టుబడి పెట్టకుండా వైవిధ్యపరచడం చాలా ముఖ్యం.
రియల్ ఎస్టేట్
భౌతిక ఆస్తులు
ఇళ్లు, అపార్ట్‌మెంట్‌లు లేదా వాణిజ్య ఆస్తులను కొనుగోలు చేయడానికి పెద్ద మొత్తంలో మూలధనం అవసరం. అద్దెల ద్వారా క్రమం తప్పకుండా ఆదాయం, ఆస్తి విలువ పెరగడం ద్వారా దీర్ఘకాలికంగా మూలధన వృద్ధి లభిస్తుంది. అయితే నిర్వహణ ఖర్చులు, లిక్విడిటీ లేకపోవడం (అంటే అవసరమైనప్పుడు త్వరగా నగదుగా మార్చలేకపోవడం) వంటి సవాళ్లు ఉంటాయి.
రీట్స్(Real Estate Investment Trusts)
రియల్ ఎస్టేట్‌లో పెట్టుబడి పెట్టడానికి ఇదొక సులభమైన మార్గం. రీట్స్ అనేవి స్టాక్ మార్కెట్‌లో ట్రేడ్ అవుతున్న మ్యూచువల్ ఫండ్స్ లాంటివి. వీటి ద్వారా చిన్న మొత్తంలో పెట్టుబడి పెట్టి, భారీ వాణిజ్య ఆస్తుల యజమాన్యంలో భాగస్వామి కావచ్చు. అద్దెల ఆదాయంలో వాటాను పొందవచ్చు. ఇది తక్కువ రిస్క్‌తో రియల్ ఎస్టేట్ ప్రయోజనాలను అందిస్తుంది.
చిన్న వ్యాపారాలు
పెట్టుబడి పెట్టడం ద్వారా కాకుండా మీ ఆదాయాన్ని పెంచుకోవడం ద్వారా కూడా లక్ష్యాన్ని చేరుకోవచ్చు. ఉద్యోగానికి భంగం కలగకుండా మీ నైపుణ్యాలు లేదా అభిరుచులకు అనుగుణంగా ఫ్రీలాన్సింగ్, ఆన్‌లైన్ సేవలు, కన్సల్టింగ్, లేదా చిన్న ఆన్‌లైన్ వ్యాపారాన్ని ప్రారంభించడం ద్వారా అదనపు ఆదాయాన్ని సృష్టించవచ్చు.
ఈ సైడ్ బిజినెస్ ద్వారా వచ్చిన అదనపు ఆదాయాన్ని పైన పేర్కొన్న పెట్టుబడి మార్గాల్లోకి మళ్లించడం ద్వారా అనుకున్న ఆర్థిక లక్ష్యాన్ని మరింత వేగంగా చేరుకోవచ్చు. కొంతమంది విజయవంతమైన చిరు వ్యాపారాల్లో చిన్న మొత్తంలో మూలధనాన్ని పెట్టుబడి పెట్టడం ద్వారా కూడా లాభాలు పొందవచ్చు. కానీ దీనికి ఆ వ్యాపారంపై పూర్తి అవగాహన ఉండాలి. ఇది కొంత రిస్క్‌తో కూడుకుంది.
ఇతర ముఖ్యమైన పెట్టుబడి మార్గాలు
పీపీఎఫ్: పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ అనేది ప్రభుత్వం మద్దతుతో నడిచే సురక్షితమైన, దీర్ఘకాలిక పెట్టుబడి పథకం. దీనికి 15 సంవత్సరాల లాక్-ఇన్ పీరియడ్ ఉంటుంది. రాబడి స్థిరంగా, పన్ను రహితంగా ఉంటుంది. ఇది తక్కువ రిస్క్ కోరుకునే వారికి అనుకూలం.
ఎన్‌పీఎస్: జాతీయ పింఛను పథకం అనేది ఉద్యోగులకు దీర్ఘకాలిక పదవీ విరమణ పొదుపు కోసం ఉద్దేశించింది. ఇది ఈక్విటీ, డెట్ సాధనాల్లో పెట్టుబడి పెడుతుంది. సెక్షన్ 80సీ, 80సీసీడీ(1బీ) కింద అదనపు పన్ను ప్రయోజనం లభిస్తుంది.
బంగారం: భౌతిక బంగారం లేదా సావరీన్ గోల్డ్ బాండ్‌లు (SGBs), గోల్డ్ ఈటీఎఫ్‌ల ద్వారా పెట్టుబడి పెట్టవచ్చు. బంగారం తరచుగా ద్రవ్యోల్బణానికి వ్యతిరేకంగా హెడ్జింగ్‌గా(ద్రవ్యోల్బణాన్ని తట్టుకుని మార్కెట్ పడుతున్నప్పడు బంగారం పెరుగుతుంది. ఈక్రమంలో మార్కెట్ పడినప్పుడు బంగారంలోని పెట్టుబడి తీసి ఈక్విటీలో ఇన్వెస్ట్ చేస్తుంటారు) పనిచేస్తుంది. పోర్ట్‌ఫోలియో వైవిధ్యీకరణకు సహాయపడుతుంది.
ఇదీ చదవండి: బంగారం ధరలపై భారీ ఊరట.. తులం ఎంతంటే..


