మారుతి సుజుకీ ఎలక్ట్రిక్ కార్ల దిశగా బలమైన ప్రణాళికలతో ఉంది. ఎలక్ట్రిక్ కార్ల కోసం కీలకమైన విడిభాగాలను రానున్న సంవత్సరాల్లో ఇక్కడే తయారు చేసే ప్రణాళికతో ఉన్నట్టు కంపెనీ సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (మార్కెటింగ్, విక్రయాలు) పార్థో బెనర్జీ తెలిపారు. భారత్‌లో ఈవీ ఎకోసిస్టమ్‌ను బలోపేతం చేసుకోవడమే తమ లక్ష్యమన్నారు.
ప్రస్తుతం బ్యాటరీలను దిగుమతి చేసుకుంటుండగా, వీటిని సైతం ఇక్కడే తయారు చేయాలన్న ప్రణాళికతో ఉన్నట్టు తెలిపారు. వచ్చే ఏడాది భారత్ మార్కెట్లో తొలి ఎలక్ట్రిక్ వాహనం ఇ–విటారాను విడుదల చేయనున్న మారుతి సుజుకీ.. కొనుగోలుదారుల్లో విశ్వాసాన్ని పెంచే దిశగా స్థానికంగానే ఈవీ తయారీ ఎకోసిస్టమ్‌పై దృష్టి సారించినట్టు చెప్పారు. ఇంటి కోసం ప్రాథమిక వాహనంగా ఎలక్ట్రిక్ కారును వినియోగదారులు నమ్మకంగా కొనుగోలు చేసినప్పుడే దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల విస్తరణ వేగాన్ని అందుకుంటుందన్న అభిప్రాయాన్ని బెనర్జీ వ్యక్తం చేశారు.
‘‘ఈవీల విషయంలో కస్టమర్లు నమ్మకంగా లేరు. ఆరంభంలో వచ్చిన ఉత్పత్తులకు సంబంధించిన అనుభవంతో, ప్రయాణ దూరం పరంగా వారి మనసుల్లో ప్రతికూల ధోరణి ఏర్పడింది. తగిన ప్రజా మౌలిక సదుపాయాలు లేవు. విక్రయానంతర సేవలు, రీసేల్ (తిరిగి విక్రయించే) విలువ ఈవీల వినియోగానికి ఉన్న పెద్ద సవాళ్లు. ఇప్పటి వరకు ఎలక్ట్రిక్ కార్లను కొనుగోలు చేసిన వారు, వాటిని సెకండరీ వాహనంగానే వినియోగిస్తున్నారు’’అని వివరించారు. కనుక వినియోగదారుల్లో ఎలక్ట్రిక్ వాహనాలపై నమ్మకం కల్పించకపోతే వారు కొనుగోళ్లకు ముందుకురారని అభిప్రాయపడ్డారు.
ఐదు మోడళ్లు: 2030 మార్చి నాటికి ఐదు ఈవీ మోడళ్లను కలిగి ఉండాలన్నది మారుతి సుజుకీ ప్రణాళికగా బెనర్జీ పేర్కొన్నారు. అప్పటికి ఎలక్ట్రిక్ కార్ల పరిమాణం 55–60 లక్షలుగా ఉండొచ్చని, ఈవీ విస్తరణ 13–15 శాతానికి చేరుకోవచ్చని చెప్పారు. మారుతి సుజుకీకి దేశవ్యాప్తంగా 1,100 పట్టణాల్లోని 1,500 వర్క్‌షాపులు ఎలక్ట్రిక్ వాహన సర్వీసులకు అనుకూలంగా ఉన్నట్టు, ఇప్పటికే 2,000 చార్జింగ్ పాయింట్లు ఏర్పాటు చేసినట్టు తెలిపారు.


