ఎస్‌బీఐ డిజిటల్ బ్యాంకింగ్ ప్లాట్‌ఫామ్ అయిన ‘యోనో’ వచ్చే రెండేళ్లలో కస్టమర్ల సంఖ్యను 20 కోట్లకు పెంచుకోవాలన్న ప్రణాళికతో ఉంది. యోనో 2.0 (కొత్త వెర్షన్)ను విడుదల చేసిన సందర్భంగా ఎస్‌బీఐ చైర్మన్ సీఎస్ శెట్టి ఈ విషయాన్ని ప్రకటించారు. ఎస్‌బీఐ 2.0 మెరుగైన వెర్షన్ అని, కస్టమర్లకు మెరుగైన సేవల అనుభవాన్ని అందిస్తుందన్నారు. ఎస్‌బీఐకి వెన్నెముకగా నిలుస్తుందన్నారు. ఈ ప్లాట్‌ఫామ్‌పై పూర్తి స్థాయి సదుపాయాలను వచ్చే 6–8 నెలల్లో అందుబాటులోకి తీసుకొస్తామని తెలిపారు.
‘‘డిజిటలైజేషన్‌కు యోనో 2.0 మూలస్తంభంగా ఉంటుంది. ఇంటర్నెట్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్‌కు ఉమ్మడి కోడ్ ఉంటుంది. దీంతో వివిధ ఛానళ్ల మధ్య అనుసంధానత సాఫీగా సాగుతుంది. దీని కారణంగా కొత్త ఉత్పత్తులను, సేవలను ఎస్‌బీఐ వేగంగా కస్టమర్లకు అందించగలదు. యోనోకి ప్రస్తుతం 10 కోట్ల కస్టమర్లు ఉన్నారు. యోనో మొబైల్ బ్యాంకింగ్ లేదా ఇంటర్నెట్ బ్యాంకింగ్‌పై కస్టమర్ల సంఖ్య 20 కోట్లకు చేర్చాలన్నది మా ఉద్దేశ్యం. వచ్చే రెండేళ్లలో దీన్ని చేరుకుంటాం’’అని శెట్టి చెప్పారు.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో నికర వడ్డీ మార్జిన్ (నిమ్)ను 3 శాతం సాధిస్తామని మరోసారి ప్రకటించారు. ర్యామ్ విభాగంలో (రిటైల్, వ్యవసాయం, ఎంఎస్‌ఎంఈ) రుణాల పరంగా 14 శాతం వృద్ధి సాధిస్తామని, అలాగే రూ.25 లక్షల కోట్ల పోర్ట్‌ఫోలియో మైలురాయిని అధిగమిస్తామని చెప్పారు. బంగారం రుణాలు, ఎక్స్‌ప్రెస్ క్రెడిట్ (అన్‌సెక్యూర్డ్ వ్యక్తిగత రుణాలు)లో మంచి వృద్ధి సాధిస్తామన్నారు.


