84,680 వద్దకు సెన్సెక్స్
నిఫ్టీ నష్టం 167 పాయింట్లు
విదేశీ ఇన్వెస్టర్ల విక్రయాల ప్రభావం
ముంబై: వాణిజ్య లోటు పెరుగుతుండటం, భారత్–అమెరికా వాణిజ్య ఒప్పందంపై సందిగ్ధత తదితర అంశాల కారణంగా రూపాయి మారకం విలువ రోజురోజుకీ పడిపోతోంది. తాజాగా ఇంట్రాడేలో 91 మార్కును దాటేసింది. చివరికి డాలరుతో పోలిస్తే మరో 15 పైసలు క్షీణించి 90.93 వద్ద క్లోజయ్యింది. ఒక దశలో క్రితం ముగింపుతో పోలిస్తే ఇంట్రాడేలో 36 పైసల క్షీణతతో 91.14 స్థాయిని కూడా తాకింది. కేవలం 10 ట్రేడింగ్ సెషన్లలోనే రూపాయి మారకం విలువ 90 నుంచి 91కి పడిపోయింది. గత అయిదు సెషన్లలో ఏకంగా 1 శాతం పతనమైంది. ఈ నెలలోనే 92 మార్కును కూడా దాటేయొచ్చని ఫిన్‌రెక్స్ ట్రెజరీ అడ్వైజర్స్ ఈడీ అనిల్ కుమార్ భన్సాలీ తెలిపారు.
ఈ ఏడాది 5.1 శాతం డౌన్..
రాజ్యసభలోనూ ఈ అంశం చర్చకు రాగా, డేటా ప్రకారం ఈ ఏడాది డిసెంబర్ 3 వరకు రూపాయి విలువ 5.1 శాతం క్షీణించిందని కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి తెలిపారు. వాణిజ్య లోటు, అమెరికా–భారత్ ఒప్పందానికి సంబంధించిన పరిణామాలు రూపాయిపై తీవ్ర ప్రభావం చూపిస్తున్నాయని చెప్పారు. అయితే, రూపాయి పతనంతో ఎగుమతులపరంగా పోటీతత్వం మెరుగుపడొచ్చని, ఇది ఆర్థిక వ్యవస్థపై సానుకూల ప్రభావం చూపవచ్చని పేర్కొన్నారు. డేటా ప్రకారం డాలరుతో పోలిస్తే రూపాయి 2015లో 4.5 శాతం, 2016లో 2.6 శాతం క్షీణించగా, 2017లో 6.4 శాతం పెరిగింది. ఆ తర్వాత నుంచి ప్రతి సంవత్సరం క్షీణత కొనసాగింది.
91కి జారిన రూపాయి
ముంబై: విదేశీ ఇన్వెస్టర్ల విక్రయాలు, అంతర్జాతీయ ఈక్విటీ మార్కెట్లలోని ప్రతికూల సంకేతాల ప్రభావంతో దేశీయ స్టాక్ మార్కెట్ రెండో రోజూ డీలాపడింది. అమెరికాతో వాణిజ్య ఒప్పందంపై స్పష్టత లేమి, ఫారెక్స్ మార్కెట్లో రూపాయి 91 స్థాయిని బ్రేక్ చేయడం ఇన్వెస్టర్లను కలవరపరిచింది. ఫలితంగా మంగళవారం సెన్సెక్స్ 534 పాయింట్లు నష్టపోయి 84,680 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 167 పాయింట్లు కోల్పోయి 25,860 వద్ద నిలిచింది. ఉదయం బలహీనంగా మొదలైన సూచీలు, అమ్మకాల ఒత్తిడి నెలకొనడంతో రోజంతా నష్టాల్లోనే ట్రేడయ్యాయి. ఒక దశలో సెన్సెక్స్ 592 పాయింట్లు క్షీణించి 84,621 వద్ద, నిఫ్టీ 193 పాయింట్లు పతనమై 25,834 వద్ద ఇంట్రాడే కనిష్టాన్ని తాకాయి.
బీఎస్‌ఈలో టెలికమ్యూనికేషన్, కన్జూమర్ డ్యూరబుల్స్ షేర్లు మాత్రమే రాణించాయి. రియల్టీ 1.36%, బ్యాంకెక్స్ 1.03%, కమోడిటీస్ 0.91%, ఐటీ 0.90%, ఐటీ 0.86%, ఫైనాన్షియల్ సర్వీసెస్ 0.83%, మెటల్ 0.82 శాతం నష్టపోయాయి. మిడ్‌క్యాప్ ఇండెక్సు 0.78%, స్మాల్‌క్యాప్ సూచీ 0.69% పతనమయ్యాయి.
∙యాక్సిస్ బ్యాంకు షేరు 5% పతనమై రూ.1,220 వద్ద స్థిరపడింది. డిసెంబర్ క్వార్టర్ వరకూ నికర వడ్డీ మార్జిన్లపై ఒత్తిడి కొనసాగొచ్చని అంతర్జాతీయ బ్రోకరేజ్ సంస్థ సిటి ఆందోళన వ్యక్తం చేయడంతో ఈ షేరు పడింది.


