సెబీ తాజాగా గ్రీన్ సిగ్నల్
ఉమ్మడిగా రూ. 6 వేల కోట్లపై కన్ను
జాబితాలో ఆర్‌ఎస్‌బ్రదర్స్
న్యూఢిల్లీ: పబ్లిక్ ఇష్యూ చేపట్టడం ద్వారా నిధులు సమీకరించేందుకు తాజాగా సెబీ 7 కంపెనీలకు ఓకే చెప్పింది. జాబితాలో యశోదా హెల్త్‌కేర్ సర్విసెస్, ఫ్యూజన్ సీఎక్స్, ఓరియంట్ కేబుల్స్, టర్టిల్‌మింట్ ఫిన్‌టెక్ సొల్యూషన్స్, ఆర్‌ఎస్‌బీ రిటైల్ ఇండియా, ఎస్‌ఎఫ్‌సీ ఎన్విరాన్‌మెంటల్ టెక్నాలజీస్, లోహియా కార్ప్ చేరాయి. లిస్టింగ్‌కు అనుమతించమంటూ ఈ కంపెనీలన్నీ ఈ ఏడాది మే నుంచి సెపె్టంబర్ మధ్యకాలంలో సెబీకి దరఖాస్తు చేశాయి. వెరసి ఉమ్మడిగా రూ. 6,000 కోట్లు సమీకరించేందుకు సమాయత్తంకానున్నాయి. కంపెనీలన్నీ బీఎస్‌ఈ, ఎన్‌ఎస్‌ఈలలో లిస్ట్‌కానున్నాయి.
యశోదా హెల్త్‌కేర్
గోప్యతా విధానంలో యశోదా హెల్త్‌కేర్ సర్విసెస్ సెబీకి సెప్టెంబర్‌లో దరఖాస్తు చేసింది. సంబంధిత వర్గాల అంచనా ప్రకారం ఐపీవో ద్వారా రూ. 3,000–4,000 కోట్ల మధ్య సమీకరించే అవకాశముంది. రహస్య మార్గంలో దరఖాస్తు చేయడం ద్వారా కంపెనీలు ప్రాస్పెక్టస్ వివరాలు తొలిదశలో వెల్లడికాకుండా నిలువరించవచ్చు.
ఆర్‌ఎస్‌బీ రిటైల్
రిటైల్ రంగ ఫ్యాషన్ టెక్స్‌టైల్స్ హైదరాబాద్ కంపెనీ ఆర్‌ఎస్‌బీ రిటైల్ ఇండియా ఐపీవోలో భాగంగా రూ. 500 కోట్ల విలువైన ఈక్విటీని తాజాగా జారీ చేయనుంది. వీటికి అదనంగా 2.98 కోట్ల షేర్లను ప్రస్తుత వాటాదారులు విక్రయానికి ఉంచనున్నారు. ఈక్విటీ జారీ నిధులను రుణ చెల్లింపులుసహా.. ఆర్‌ఎస్ బ్రదర్స్, సౌత్ ఇండియా షాపింగ్ మాల్ తదితర కొత్త స్టోర్ల ఏర్పాటుకు, సాధారణ కార్పొరేట్ అవసరాలకు వెచ్చించనుంది.
టర్టీల్‌మింట్ ఫిన్‌టెక్
2015లో ఏర్పాటైన టర్టీల్‌మింట్ ఫిన్‌టెక్ సొల్యూషన్స్ గోప్యతా మార్గంలోనే సెపె్టంబర్‌లో సెబీకి ప్రాస్పెక్టస్ దాఖలు చేసింది. అమన్సా క్యాపిటల్, జంగిల్ వెంచర్ పార్ట్‌నర్స్‌కు పెట్టుబడులున్న కంపెనీ బీమా పాలసీల కొనుగోలు, నిర్వహణను సరళతరం చేసింది. తద్వారా సొంత నెట్‌వర్క్ ద్వారా 1.6 కోట్ల పాలసీలను విక్రయించింది.
ఫ్యూజన్ సీఎక్స్
కస్టమర్ ఎక్స్‌పీరియన్స్ సర్విసుల సంస్థ ఫ్యూజన్ సీఎక్స్ ఐపీవో ద్వారా రూ. 1,000 కోట్లు సమకూర్చుకునే ప్రణాళికల్లో ఉంది. ఇందుకు అనుగుణంగా రూ. 600 కోట్ల విలువైన ఈక్విటీని తాజాగా జారీ చేయనుంది. వీటికి జతగా మరో రూ. 400 కోట్ల విలువైన షేర్లను ప్రస్తుత వాటాదారులు విక్రయానికి ఉంచనున్నారు. ఈక్విటీ జారీ నిధులను రుణ చెల్లింపులుసహా.. అనుబంధ సంస్థల ఐటీ టూల్స్ అభివృద్ధి, ఇతర సంస్థల కొనుగోళ్లు, సాధారణ కార్పొరేట్ అవసరాలకు వెచి్చంచనుంది.
ఓరియంట్ కేబుల్స్
పబ్లిక్ ఇష్యూ ద్వారా ఓరియంట్ కేబుల్స్(ఇండియా) లిమిటెడ్ రూ. 700 కోట్లు సమీకరించాలని భావిస్తోంది. దీనిలో భాగంగా రూ. 320 కోట్ల విలువైన ఈక్విటీని కొత్తగా జారీ చేయనుంది. అంతేకాకుండా మరో రూ. 380 కోట్ల విలువైన షేర్లను కంపెనీ ప్రమోటర్లు ఆఫర్ చేయనున్నారు. ఈక్విటీ జారీ నిధులను మెషీనరీ, పరికరాల కొనుగోళ్లతోపాటు తయారీ ప్లాంటు సివిల్ పనులకు, రుణ చెల్లింపులకు, సాధారణ కార్పొరేట్ అవసరాలకు వినియోగించనుంది.
ఎస్‌ఎఫ్‌సీ ఎన్విరాన్‌మెంటల్
వేస్ట్‌వాటర్ ట్రీట్‌మెంట్ సొల్యూషన్లు సమకూర్చే ఎస్‌ఎఫ్‌సీ ఎన్విరాన్‌మెంటల్ టెక్నాలజీస్ ఐపీవోలో భాగంగా రూ. 150 కోట్ల విలువైన ఈక్విటీని తాజాగా జారీ చేయనుంది. వీటికి అదనంగా 1.23 కోట్ల షేర్లను కంపెనీ ప్రమోటర్లు, ప్రస్తుత వాటాదారులు విక్రయానికి ఉంచనున్నారు. ఈక్విటీ జారీ నిధులను రుణ చెల్లింపులు, వర్కింగ్ క్యాపిటల్ అవసరాలకు కేటాయించనుంది.
లోహియా కార్ప్
ఐపీవోలో భాగంగా టెక్నికల్ టెక్స్‌టైల్స్ తయారీ సంబంధిత మెషీనరీ, పరికరాల తయారీ కంపెనీ లోహియా కార్ప్ 4.22 కోట్ల ఈక్విటీ షేర్లను ఆఫర్ చేయనుంది. వీటిని కంపెనీ ప్రమోటర్లు విక్రయానికి ఉంచనున్నారు.


