కొత్త కారు కొనడానికి కావలసినంత డబ్బు లేనప్పుడు, చాలామంది సెకండ్ హ్యాండ్ కారు లేదా యూస్డ్ కార్లను కొంటుంటారు. అయితే ఇలా కొనుగోలు చేసేటప్పుడు తప్పకుండా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ఈ కథనంలో ఆ వివరాలను తెలుసుకుందాం.
డాక్యుమెంట్లు చెక్ చేయాలి
మీరు కొంటున్న కారుకు సరైన డాక్యుమెంట్స్ ఉన్నాయా?, లేదా?.. అని చెక్ చేసుకోవాలి. ఇన్సూరెన్స్ చెల్లుబాటు అవుతోందా?, క్లెయిమ్స్ ఉన్నాయా కూడా చెక్ చేసుకోవాలి. పొల్యూషన్ సర్టిఫికెట్ తనిఖీ చేయాలి. ఒకవేల లోన్ ఉంటే.. బ్యాంక్ నో అబ్జక్షన్ సర్టిఫికెట్ (NOC) తీసుకోవాలి. డాక్యుమెంట్స్ సరిగ్గా లేకుంటే.. అనుకోని సమస్యల్లో చిక్కుకోవాల్సి ఉంటుంది.
మీరు కొంటున్న కారు సెకండ్ హ్యాండ్ కారా? లేక ఎంతమంది చేతులు మారిందనే విషయం కూడా తెలుసుకోవాలి. ఒక ఓనర్ మాత్రమే కారును ఉపయోగించి ఉంటే.. అది మంచి కండిషన్లో ఉంటుంది. ఎక్కువమంది చేతులు మారి ఉంటే.. కారులో లెక్కలేనన్ని సమస్యలు తలెత్తుతాయి. దీనికోసం మీరు ఎక్కువ డబ్బు ఖర్చు చేయాల్సి ఉంటుంది.
కారు కండీషన్
మీరు కొంటున్న కారు ఎలాంటి స్థితిలో ఉందనే విషయం గమనించాలి. స్క్రాచులు, డెంట్స్ ఏమైనా ఉన్నాయా?, పెయింట్ ఒకేలా ఉందా? అనేది పరిగణలోకి తీసుకోవాలి. టైర్లు ఎలాంటి కండిషన్లో ఉన్నాయనేది చూడాలి. ప్రమాదాలకు గురైన కార్లకు చిన్న చిన్న మరమ్మత్తులు చేసి.. మార్కెట్లో అమ్మే అవకాశం ఉంటుంది. కాబట్టి దీనిని తప్పకుండా గమనించాలి.
ఇంజిన్ స్థితి
కారుకు గుండె వంటి ఇంజిన్ పరిస్థితి ఎలా ఉందనేది చూడాల్సి ఉంటుంది. ఇంజిన్ శబ్దం స్మూత్‌గా ఉందా?, స్టార్ట్ చేయగానే ఎక్కువ శబ్దం లేదా పొగ వస్తుందా?, గేర్ షిఫ్టింగ్ సరిగ్గా ఉందా? అని పరిశీలించాలి. మీకు ఈ విషయాలను చెక్ చేయడంలో అనుభవం లేకపోతే.. నమ్మకమైన మెకానిక్‌తో చెక్ చేయించడం మంచిది.
టెస్ట్ డ్రైవ్ & ఓడోమీటర్ రీడింగ్
కారు కొనడానికి ముందు టెస్ట్ డ్రైవ్ తప్పనిసరి. టెస్ట్ డ్రైవ్ చేస్తున్న సమయంలో.. బ్రేకులు బాగా పని చేస్తున్నాయా?, స్టీరింగ్ వీల్ షేక్ అవుతోందా?, సస్పెన్షన్ శబ్దం ఉందా? అనేవి గమనించాలి. పరిశీలించాల్సిన మరో విషయం ఏమిటంటే.. ఓడోమీటర్ చెక్ చేసుకోవాలి. తక్కువ కిలోమీటర్లు ప్రయాణించినట్లు చూపిస్తుంటే.. తప్పకుండా అనుమానించాల్సిందే. అలాంటప్పుడు సర్వీస్ రికార్డ్స్‌తో పోల్చుకోవాలి.
ధర & ట్రాన్స్‌ఫర్ ప్రక్రియ
సెకండ్ హ్యాండ్ కారు ధర మార్కెట్లో ఎలా ఉందో తెలుసుకోవాలి. ఒకవేల చాలా తక్కువ ధరకు విక్రయిస్తుంటే.. కారణం కనుక్కోవాల్సిందే. ట్రాన్స్‌ఫర్ ప్రక్రియ కూడా పూర్తి చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ (RC) తప్పకుండా మీ పేరు మీదకు చేయించుకోవాలి. ఫారమ్ 29, 30 సరిగ్గా సబ్మిట్ చేయాలి.
ఛలాన్స్
మీరు కొంటున్న కారుపై ఏమైనా పెండింగ్ ఛలాన్స్ ఉన్నాయా?, దొంగతనం కేసులు వంటివి ఉన్నాయా? కూడా చెక్ చేసుకోవాలి. ఇలాంటి చెక్ చేసుకోకపోతే.. ఆ భారం మీ మీద పడుతుంది. అనుకోని సమస్యలను ఎదుర్కోవాలి ఉంటుంది.
డీలర్ vs డైరెక్ట్ ఓనర్
కొత్త కారును డీలర్ దగ్గర నుంచి కొనుగోలు చేస్తారు. అయితే యూస్డ్ కారును నేరుగా ఓనర్ దగ్గర నుంచి కొనుగోలు చేయడం మంచిది. మధ్యవర్తులను ఆశ్రయించకపోవడం మంచిది. ఒకవేల డీలర్ దగ్గర నుంచి కొనుగోలు చేయాలనుకుంటే.. నమ్మకమైన డీలర్ నుంచి కొనుగోలోను చేయడం మంచిది.


