కొత్త కారు కొనుగోలు చేయాలని అందరికి ఉంటుంది. అయితే ఇది కొందరికి సాధ్యమవుతుంది. మరికొందరికి కొంత కష్టమే. ఒకవేళా ఎవరైనా కొత్త కారు కొనాలని చూస్తున్నట్లయితే.. తప్పకుండా కొన్ని విషయాలను గమనించాల్సి ఉంటుంది. ఆ విషయాలు, వివరంగా ఇక్కడ తెలుసుకుందాం.
బడ్జెట్
కారు కొనడానికి ముందు.. ఆలోచించాల్సిందే బడ్జెట్. ఎంత డబ్బు వెచ్చించి కారు కొనాలి. తక్కువ బడ్జెట్లో కావాలా?, ఎక్కువ బడ్జెట్ పెట్టాలా? అనే విషయంపై స్పష్టత ఉండాలి. ఇక్కడ కారు ధర మాత్రమే కాకుండా.. రిజిస్ట్రేషన్, ఇన్సూరెన్స్, రోడ్ ట్యాక్స్, మెయింటెనెన్స్ ఖర్చులు ఎంత ఉంటాయనే విషయాన్ని కూడా ముందుగానే అంచనా వేసుకోవాలి.
అవసరాలు
కారును ఏ అవసరం కోసం కొంటున్నారనే విషయంపై స్పష్టత ఉండాలి. నగరంలో ప్రయాణించడానికా?, లేక లాంగ్ డ్రైవ్ చేయడానికా? అనే విషయంతో పాటు.. ఫ్యామిలీ కోసమా?, వ్యక్తిగత వినియోగం కోసమా? అనే విషయాలను పరిగణలోకి తీసుకోవాలి. పెట్రోల్ / డీజిల్ / ఎలక్ట్రిక్ / హైబ్రిడ్ ఏది కావాలో ముందుగానే ఆలోచించండి.
సేఫ్టీ ఫీచర్స్
కారు బడ్జెట్, అవసరాలు వంటి విషయాలతో పాటు.. ఆ కారులో ఉన్న ముఖ్యమైన సేఫ్టీ ఫీచర్స్ ఏమిటనేది తెలుసుకోవాలి. మల్టిపుల్ ఎయిర్‌బ్యాగ్స్, ఈబీఎస్ విత్ ఈబీడీ, రియర్ పార్కింగ్ సెన్సర్లు / కెమెరా, ఐసోఫిక్స్ చైల్డ్ సీట్, సేఫ్టీ రేటింగ్ వంటివన్నీ మీరు కొనే కారులో ఉండేలా చూసుకోవాలి.
మైలేజ్ & పర్ఫామెన్స్
దాదాపు అందరూ ఎక్కువ మైలేజ్ ఇచ్చే కారు కొనాలని ఆలోచిస్తారు. కాబట్టి మంచి మైలేజ్ ఇచ్చే కారు ఏది? దాని పర్ఫామెన్స్ ఎలా ఉందనే విషయాలను ముందుగానే గమనించాలి. ఈ విషయాలను తెలుసుకోవడానికి రియల్-వరల్డ్ మైలేజ్ రివ్యూలు చూడటం మంచిది. ఇంజిన్ పవర్, డ్రైవింగ్ స్మూత్‌నెస్ కూడా పరిశీలించాలి.
మెయింటెనెన్స్ & సర్వీస్
కారు కొనేస్తారు. కానీ దానిని ఎప్పటికప్పుడు సర్వీస్ చేస్తుండాలి. కాబట్టి మీ ప్రాంతంలో సర్వీస్ సెంటర్లు ఉన్నాయా?, లేదా? గమనించాలి. అవసరమైన పార్ట్స్ లభిస్తాయి. సర్వీస్ ఖర్చులు ఎలా ఉంటాయనే విషయాలను ముందుగానే బేరీజు వేసుకోవాలి.
పైన చెప్పినవి మాత్రమే కాకుండా.. వారంటీ (స్టాండర్డ్ + ఎక్స్‌టెండెడ్ వారంటీ) & ఆఫర్లు (ఫెస్టివ్ డిస్కౌంట్స్, ఎక్స్చేంజ్ బోనస్), టెస్ట్ డ్రైవ్, రీసేల్ వాల్యూ, ఇన్సూరెన్స్, డెలివరీకి ముందు తనిఖీ వంటివి కూడా చేయాల్సి ఉంటుంది. మీకు నచ్చిన డిజైన్, అవసరమైన అప్డేటెడ్ ఫీచర్స్ కూడా ఉండేలా చూసుకోవడం మంచిది.


