నవంబర్ 2016లో మన దేశంలో రూ.500, రూ.1000 నోట్లను రద్దు చేశారు. ఆ సమయంలో వీటిని బ్యాంకుల్లో డిపాజిట్ చేసుకోవడానికి లేదా.. మార్చుకోవడానికి సమయం ఇచ్చారు. ఆ తరువాత వీటి వాడకం పూర్తిగా నిషేధించారు. అయినప్పటికీ.. ఇప్పటికి కూడా కొంతమంది దగ్గర ఈ నోట్లు ఉన్నట్లు అప్పుడప్పుడు సంబంధిత అధికారులు గుర్తిస్తూ ఉంటారు.
పాత రూ. 500, రూ. 1000 నోట్లు ఉపయోగించడం నేరమా?, ఒక వ్యక్తి దగ్గర ఎన్ని నోట్లు ఉండొచ్చు?, చట్టం ఏం చెబుతోంది? అనే విషయాలను ఈ కథనంలో తెలుసుకుందాం.
చట్టం ఏం చెబుతోందంటే?
స్పెసిఫైడ్ బ్యాంక్ నోట్స్ చట్టం 2017 ప్రకారం.. రద్దు అయిన రూ. 500, రూ. 1000 నోట్లు తక్కువ సంఖ్యలో ఉండటం నేరమేమీ కాదు. ఎక్కువ సంఖ్యలో ఉన్నప్పుడే నేరమవుతుంది. ఒక వ్యక్తి దగ్గర 10 నోట్ల వరకు ఉండవచ్చు. దీనివల్ల ఎలాంటి సమస్య రాదు.
10 కంటే ఎక్కువ రూ. 500 లేదా రూ. 1000 నోట్లు ఉంటే.. మాత్రం సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. అయితే అభిరుచి కలిగిన నాణేలను సేకరించేవారు గరిష్టంగా 25 నోట్ల వరకు ఉంచుకోవచ్చు. అయితే వీటిని ఆర్ధిక లావాదేవీల కోసం ఎట్టిపరిస్థితుల్లో ఉపయోగించుకోకూడదు.
ఐదు రెట్లు జరిమానా!
ఒక వ్యక్తి పరిమితి కంటే ఎక్కువ సంఖ్యలో రద్దు చేసిన నోట్లను కలిగి ఉన్నట్లు అధికారులు గుర్తిస్తే.. కనీసం రూ. 10వేలు జరిమానా లేదా ఆ వ్యక్తి దగ్గర ఉన్న నోట్ల విలువకు ఐదు రేట్లు చెల్లించాల్సి ఉంటుంది. ఉదాహరణకు మీదగ్గర రూ. 20వేలు విలువైన రద్దు చేసిన నోట్లు ఉన్నాయనుకుంటే.. రూ. లక్ష (ఐదు రెట్లు) జరిగిమానా చెల్లించాలన్నమాట. అయితే జైలు శిక్ష ఉండదు.
రద్దు చేసిన నోట్లను ఎక్కువగా ఉంచుకున్నప్పటికీ.. దానిని ఆర్ధిక నేరంగా పరిగణించరు. అయితే జరిమానాలు చెల్లించాల్సి ఉంటుంది. ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే.. రద్దు చేసిన నోట్లు చట్టబద్దమైనవి కాదు. కాబట్టి వీటిని ఎక్కడా ఉపయోగించలేరు. ఉపయోగించకూడదు కూడా.
ఇదీ చదవండి: వారంలో నాలుగు రోజులే వర్క్!: కొత్త పని విధానం..


