బోయింగ్‌ విమానంలో కుదుపులు : ప్రయాణికులు హడల్‌, కడసారి సందేశాలు | Japan Airlines Boeing 737 drops 26000 feet passengers farewell notes | Sakshi
Sakshi News home page

బోయింగ్‌ విమానంలో కుదుపులు : ప్రయాణికులు హడల్‌, కడసారి సందేశాలు

Jul 2 2025 5:36 PM | Updated on Jul 2 2025 5:40 PM

Japan Airlines Boeing 737 drops 26000 feet passengers farewell notes

గుజరాత్‌లోని అ‍హ్మదాబాద్‌లో  జరిగిన  ఘోర ఎయిరిండియా  విమాన ప్రమాదం ప్రపంచ వ్యాప్తంగా  విమాన ప్రయాణీకులను పీడకలలా వెంటాడుతోంది. దీంతో విమానంలో చీమ చిటుక్కుమంటే చాలు  ప్రాణభయంతో ఉలిక్కి పడుతున్నారు. తాజాగా జపాన్ ఎయిర్‌లైన్స్ బోయింగ్ 737 విమానంలో ఏర్పడిన సాంకేతిక లోపంతో ప్రయాణీకులంతా ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ఆ తరువాత ఏం చేశారో తెలుసా? జూన్ 30న షాంఘై పుడాంగ్ విమానాశ్రయం - టోక్యో నరిటా విమానాశ్రయానికి బయలుదేరిన విమానంలో ఏం జరిగిందో పదండి తెలుసుకుందాం.

సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ ప్రకారం జపాన్ ఎయిర్‌లైన్స్ బోయింగ్ 737 విమానం 36వేల అడుగుల ఎత్తులో శరవేగంగా దూసుకుపోతోంది.  191 మంది ప్రయాణికులతో ఈ విమానం చైనాలోని షాంఘై నుండి జపాన్‌ రాజధాని నగరం టోక్యోకు వెళుతోంది. సీట్లలో  అలా కూర్చుని, సీట్‌ బెల్ట్‌ తీసి  అలా రిలాక్స్‌  అవుతున్నారో లేదో ఒక్కసారిగా  కలకలం రేగింది. విమానం యాంత్రిక సమస్యను ఎదుర్కొంది. ఫలితంగా 10 నిమిషాల్లోపు దాదాపు 36,000 అడుగుల నుండి 10,500 అడుగుల కంటే తక్కువ ఎత్తుకు దిగిపోయింది విమానం. క్యాబిన్‌లో ఒత్తిడి తగ్గడంతో, ఫ్లైట్ అటెండెంట్స్‌ మాస్క్‌లు ధరించాలనే సూచనలు అందించారు. ఆక్సిజన్ మాస్క్‌లు ధరించిన ప్రయాణికుల వణికిపోయారు. విమానం కూలిపోతోందనే భయంతో హడలిపోయారు. నిద్రలో ఉన్న  ఒక్క కుదుపుతో మేల్కొన్నారు. మరికొందరు ప్రయాణికులు వీడ్కోలు  సందేశాలు రాయడం మొదలు పెట్టారు. బ్యాంక్ పిన్‌లు ,బీమా సమాచారం వంటి వ్యక్తిగత వివరాలతో ప్రియమైనవారికి సందేశాలు పంపడం ప్రారంభించారు.

"> మరోవైపు ఈ పరిణామంతో పైలట్ అత్యవసర పరిస్థితిని ప్రకటించి విమానాన్ని ఒసాకాలోని కాన్సాయ్ అంతర్జాతీయ విమానాశ్రయానికి మళ్లించారు. ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు.  పైలట్‌ చాకచక్యంగా విమానాన్ని సురక్షితంగా ల్యాండ్‌ చేయడంతో ప్రయాణీకులంతా ఊపిరి పీల్చుకున్నారు. 

కాగా గత నెలలో, అహ్మదాబాద్-లండన్ మార్గంలో బోయింగ్ విమానం జరిగిన వినాశకరమైన ప్రమాదంలో 275 మంది మరణించారు. అప్పటి నుండి, బోయింగ్ విమానాలతో సంబంధం ఉన్న అనేక ప్రమాదాలు, తయారీదారు భద్రతా  వ్యవస్థపై అనేక అనుమానాలు తలెత్తుతున్న సంగతి తెలిసిందే.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement