
తండ్రి కల.. తనయుడి తపన
తొలి ప్రయత్నంలోనే ఐఆర్‌ఎస్ సాధించిన తెనాలి వాసి
నాలుగో ప్రయత్నంలో ఐపీఎస్
ఐఏఎస్ లక్ష్యంగా విజయ్‌బాబు ప్రయాణం
తెనాలి: నాన్న కల నిజం చేయాలని కుమారుడు పట్టుదలతో కృషి చేశారు. తొలి ప్రయత్నంలోనే 22 ఏళ్ల వయసులో ఐఆర్‌ఎస్ సాధించారు. తండ్రి కల అయిన ఐఏఎస్ కోసం మళ్లీ ప్రయత్నించారు. ఈసారి ఐపీఎస్ సాధించారు. మరోమారు ఐఏఎస్‌కు ప్రయత్నం చేస్తానని చెప్పారు.
తెనాలికి చెందిన దోనేపూడి విజయ్‌బాబు 2024 సివిల్స్ పరీక్షల్లో 681వ ర్యాంక్ సాధించారు. తుది ఫలితాల్లో ఐపీఎస్‌కు ఎంపికయ్యారు. 2021లో ఐఆర్‌ఎస్‌కు ఎంపికై ప్రస్తుతం ఆదాయ పన్నుశాఖలో అసిస్టెంట్ కమిషనర్ (ఇన్వెస్టిగేషన్స్)గా విజయవాడలో బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. నాలుగో ప్రయత్నంలో ఇప్పుడు ఐపీఎస్‌కు ఎంపికయ్యారు. విజయ్‌బాబు తండ్రి మధుబాబు, తల్లి రాజ్యలక్ష్మి. తల్లి గ్రాడ్యుయేట్ కాగా, తండ్రి ఎనిమిది పీజీలు చేశారు. జిల్లా కలెక్టర్‌గా చేయాలని ఆయన ఆశపడ్డారు.
దిగువ మధ్యతరగతి కుటుంబం, ఆర్థిక సమస్యల నడుమ అవకాశం రాలేదు. జీఎస్టీ సూపరింటెండెంట్‌గా పనిచేస్తున్న సమయంలో కన్ఫర్మ్‌డ్ ఐఆర్‌ఎస్ హోదా లభించింది. ఆ హోదాలోనే ఆయన రిటైరయ్యారు. తన కవల పిల్లలు అజయ్‌బాబు, విజయ్‌బాబులు ఐఏఎస్ సాధిస్తే చూడాలనేది మధుబాబు కల. చిన్ననాటి నుంచే మంచి విద్యాసంస్థల్లో చదివించారు. పోటీపరీక్షలకు ప్రోత్సహించారు.
చదవండి: Sravana Sukravaram: ‘శ్రావణ లక్ష్మీ రావే మా ఇంటికి’... సెల్ఫీ షేర్ చేయండి!
చిన్ననాటి నుంచే...
2007లో నాలుగో తరగతి చదువుతుండగా విజయ్‌బాబు జిల్లాస్థాయి భగవద్గీత పోటీల్లో డిగ్రీ విద్యార్థులతో పోటీపడి బహుమతి సాధించారు. సంతోషించిన తాతయ్య ప్రభాకరరావు ఆశీర్వదిస్తూ ‘భవిష్యత్‌లో కలెక్టరు కావాలి నాన్నా’ అంటూ ఉత్తరం రాశారు. అప్పుడే విజయ్‌బాబు మనసులో ఆ పదం నాటుకుపోయింది. ఎదుగుతున్న క్రమంలో తండ్రి ఆశయం తెలిసింది. ఇక లక్ష్యం ఐఏఎస్‌గా ఫిక్సయ్యారు.
టెన్త్‌లో 10 జీపీఏ సాధించారు. ఇంటర్‌లో స్నేహితులకు భిన్నంగా ఎంఈసీలో చేరారు. ‘సివిల్స్ కొట్టాలంటే ఇంజినీరింగ్ చేయాలనే రూలేం లేదు... ఆర్ట్స్‌తోనూ సాధించొచ్చు’ అని తండ్రి ఇచ్చిన సలహాను ఆచరణలో పెట్టారు. ఇంటర్‌లో 975 మార్కులతో రాష్ట్రస్థాయి ర్యాంకు సాధించారు.
ఇదీ చదవండి: 5 నెలల్లో 28 కిలోలు : అమీర్ ఖాన్ అద్భుత చిట్కాలు
ఇంటి వద్దే సిద్ధమై...
డిగ్రీ కోసం ఢిల్లీలోని సెయింట్ స్టీఫెన్స్ కాలేజీని ఎంచుకున్నారు. 400 సీట్ల కోసం పోటీ పడిన 30 వేల మంది నుంచి ఆయన ఎంపికయ్యారు. 2019లో బీఏ ఆనర్స్‌ను ఫస్ట్ డివిజనులో ఉత్తీర్ణులయ్యారు. అదే ఏడాది జులైలో తెనాలికి వచ్చారు. అప్పటి నుంచి సివిల్స్‌పై గురిపెట్టారు. అవిశ్రాంత కృషితో 2021 సివిల్స్ పరీక్షలలో 682వ ర్యాంకుతో ఐఆర్‌ఎస్‌ను ఖాయం చేసుకున్నారు. అప్పటికి విజయ్‌బాబు వయసు 22 ఏళ్లు మాత్రమే. 2022 రెండోసారి రాసినా మళ్లీ ఐఆర్‌ఎస్ వచ్చింది. మూడో ప్రయత్నంలో తగిన ర్యాంకు రాలేదు. నిరుత్సాహం పడకుండా నాలుగో ప్రయత్నంలో ఐపీఎస్‌ను దక్కించుకున్నారు. నాన్న కలను నెరవేర్చాలని మరోమారు పరీక్షలకు హాజరుకానున్నారు.