
బాలీవుడ్ హీరో అమీర్ ఖాన్ తనదైన నటన, వ్యక్తిత్వంతో మిస్టర్ పర్ఫెక్షనిస్ట్‌గా పేరు తెచ్చుకున్నారు. కరీయర్‌లో అనేక బ్లాక్ బస్టర్ మూవీలను అందించడమాత్రమే కాదు, హీరోగా, డైరెక్టర్‌గా, నిర్మాతగా కూడా తన ప్రత్యేకతను చాటుకున్నారు. తాను పోషించే పాత్ర కోసం ఎలాంటి ప్రయోగానికైనా వెనుకాడని నటుడు. ఫిట్‌నెస్ విషయంలో కూడా ఎక్కడా తగ్గకుండా ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్నారు.
బాలీవుడ్ సూపర్ స్టార్ తన ఫిట్నెస్ ప్రయాణంతో ప్రేక్షకులను మెస్మరైజ్ చేస్తారు. గజని మూవీనుంచి దంగల్ దాకా ఆయన చేసిన ప్రతీ ప్రయోగమూ సక్సెస్‌ను అందుకుంది. 5 నెలల్లో 25 కిలోలకు పైగా బరువు తగ్గినా, కొన్ని నెలల్లో బరువు పెరిగినా అది ఆయనకే చెల్లు.
ముఖ్యంగా అమీర్ ఖాన్ 60 ఏళ్ళ వయసులో ఫిట్ అండ్ ఫ్యాబ్‌గా ఉండటంలో ఆయనకు ఆయనే సాటి. 2016లో వచ్చిన తన బ్లాక్ బస్టర్ సినిమా దంగల్ కోసం అనూహ్యంగా బరువు పెరిగి, పాత్ర పట్ల తన నిబద్ధతను చాటుకున్నారు. భారతీయ రెజ్లింగ్ ఛాంపియన్ మహావీర్ సింగ్ ఫోగట్‌లా కనిపించేందుకు పెద్ద సాహసమే చేశారు. ఒక ప్రధాన రెజ్లర్ నుండి మధ్య వయస్కుడైన తండ్రిలా కనిపించేందుకు బాడీసూట్ ధరించడం కంటే, ఆ పాత్రకు న్యాయం చేసేందుకు సహజంగానే బరువు పెరిగి, మళ్లీ బరువు తగ్గి అభిమానులను ఆశ్చర్యపరిచారు.. అమీర్ ఖాన్ దంగల్ సినిమా కోసం సుమారు 28 కిలోల బరువు తగ్గారు. కేవలం ఐదు నెలల్లో 97 కిలోల నుండి 68 కిలోలకు చేరుకున్నారు. ఈ సమయంలో తన శరీర కొవ్వు శాతాన్ని 37శాతం నుండి 9.67శాతానికి తగ్గించుకోవడం విశేషం. ఈ మూవీ దర్శకుడు నితేష్ తివారీ అమీర్ అంకితభావాన్ని ప్రశంసించకుండా ఉండలేకపోయాడు.
"బరువు పెరగడం సరదాగానే ఉంటుంది. కోరుకున్నది తినవచ్చు. కానీ చురుగ్గా కదలలేం. శ్వాస కూడా కష్టంగా మారుతుంది. బాడీ లాంగ్వేజ్, నడక , కూర్చునే విధానం... ప్రతిదీ మారుతుంది. కానీ ఆ తరువాత బరువు తగ్గడం చాలా కష్టం అనిపించింది’’ అంటారు అమీర్. కానీ కఠినమైన ఫిట్‌నెస్ విధానాన్ని అనుసరించి అనుకున్నది సాధించారు. శరీర బరువులో "ఆహారం నంబర్ వన్" అంటారాయన. మీరెంత వ్యాయామం చేసినా ఫుడ్ సరిగ్గా తీసుకోకపోతే ఫలితం ఉండదు. మొదట్లో నిరాశ అనిపించినా, క్రమశిక్షణతో సాగితే ఫలితం ఉంటుంది అనే ఫిట్‌నెస్ సీక్రెట్‌ను అమీర్ వెయిట్ లాస్ జర్నీ ద్వారా తెలుసుకోవచ్చు.
యాభై శాతం ఆహారం. 25 శాతం వ్యాయామం, 25 శాతం విశ్రాంతి కావాలంటూ తన అనుభవాన్ని గతంలోనే వివరించారు అమీర్ ఖాన్. ఎనిమిది గంటలు నిద్ర లేనిదే వెయిట్‌లాస్ జర్నీలేదు అంటారాయన.
రాత్రిపూట అన్నం మానేయడం, తక్కువ తినడం లేదా ఆకలితో అలమటించడం లేదా అధిక ప్రోటీన్ భోజనం తీసుకోవడం వంటివి చిట్కాలను చాలామంది పాటిస్తున్నప్పటికీ తాను మాత్రం బరువు తగ్గడానికి పాతకాలపు పద్ధతిని అనుసరించానని చెప్పారు. ‘‘2,000 యూనిట్ల శక్తిని ఖర్చు చేస్తే, అదే మోతాదులో కేలరీలు తింటే, బరువు అలాగే ఉంటుంది. అలా కాకుండా 2,000 యూనిట్ల శక్తిని ఖర్చు చేసి 1,500 కేలరీలు తింటే, ప్రతిరోజు 500 కేలరీలు తగ్గుతాయి. ప్రతిరోజూ 7 కిలోమీటర్లు నడిస్తే వారానికి 7వేల కేలరీలు ఖర్చవుతాయి. ఇది శాస్త్రం. దీంతోపాటు కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్, కొవ్వులు, ఫైబర్, సోడియంతో మన ఆహారాన్ని సమతులం చేసుకోవాలి అని అమీర్‌తెలిపారు.