26ఏళ్ల వయసు.. ఫోర్బ్స్ జాబితాలో చోటు: ఎవరీ కళ్యాణి రామదుర్గం? | Meet Kalyani Ramadurgam Indian Origin Techie Who Went From Apple to the Forbes 30 Under 30 List | Sakshi
Sakshi News home page

26ఏళ్ల వయసు.. ఫోర్బ్స్ జాబితాలో చోటు: ఎవరీ కళ్యాణి రామదుర్గం?

Dec 20 2025 6:56 PM | Updated on Dec 20 2025 7:51 PM

Meet Kalyani Ramadurgam Indian Origin Techie Who Went From Apple to the Forbes 30 Under 30 List

కోబాల్ట్ ల్యాబ్స్ కో-ఫౌండర్.. భారత సంతతికి చెందిన కళ్యాణి రామదుర్గం(Kalyani Ramadurgam).. మాజీ అఫర్మ్ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ 'ఆషి అగర్వాల్‌'తో కలిసి, ఫైనాన్స్ విభాగంలో 2026కి ఫోర్బ్స్ 30-అండర్-30 యునైటెడ్ స్టేట్స్ జాబితాలో చోటు సంపాదించారు. ఇంతకీ ఎవరీ కళ్యాణి రామదుర్గం?, ఫోర్బ్స్ జాబితాలో చేరేలా ఏమి సాధించారనే.. విషయాలను ఇక్కడ వివరంగా తెలుసుకుందాం.

కోబాల్ట్ ల్యాబ్స్ ప్రారంభించడానికి ముందు.. కళ్యాణి రామదుర్గం యాపిల్‌ సంస్థలో ఉగ్రవాదం, ఆర్థిక నేరాలు, సెక్యూరిటీ సమస్యలు వంటివి గుర్తించడంలో సహాయపడే టెక్నాలజీపై పని చేశారు.

అలా కోబాల్ట్ ల్యాబ్స్ ప్రారంభం
యాపిల్ కంపెనీలో పని చేస్తూ.. బ్యాంకులు, ఇతర పెద్ద కంపెనీలు తమ నియమాలను పాటిస్తున్నాయా.. లేదా? అని తెలుసుకోవడానికి వేల పేజీల డాక్యుమెంట్లను మనుషులు మాన్యువల్‌గా చెక్ చేయాల్సి వస్తోంది. ఈ ప్రక్రియ చాలా సమయం తీసుకోవడమే కాకుండా, తప్పులు జరిగే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది. ఈ సమస్యకు టెక్నాలజీ ద్వారా పరిష్కారం తీసుకురావాలనే సంకల్పంతో కళ్యాణి కోబాల్ట్ ల్యాబ్స్ ప్రారంభించారు.

కోబాల్ట్ ల్యాబ్స్ స్టార్టప్.. ఏఐ అండ్ మెషీన్ లెర్నింగ్ సహాయంతో పెద్ద పెద్ద డాక్యుమెంట్లను వేగంగా చదివి, బ్యాంకులు, ఫిన్‌టెక్ కంపెనీలు తమ వ్యాపారాలను.. చట్టాలు, నియమాల ప్రకారం చేస్తున్నాయా లేదా అనే విషయాన్ని ఖచ్చితంగా వెల్లడిస్తుంది. దీని వల్ల సమయం ఆదా అవుతుంది, ఖర్చు తగ్గుతుంది. భద్రత కూడా మెరుగవుతుంది.

అతి తక్కువ కాలంలో అంతర్జాతీయ గుర్తింపు
కోబాల్ట్ ల్యాబ్స్ కంపెనీ అతి తక్కువ సమయంలోనే అంతర్జాతీయ గుర్తింపు పొంది.. మిలియన్ల డాలర్ల ఫండింగ్‌ను కూడా సాధించగలిగింది. టెక్నాలజీని ఉపయోగించి, అద్భుతం చేసిన.. కల్యాణి రామదుర్గం కృషికి గుర్తింపుగా 26ఏళ్ల వయసులో ఫోర్బ్స్ 30-అండర్-30 జాబితాలో చోటు దక్కింది.

కోబాల్ట్ ల్యాబ్స్ ఒక మంచి ఆలోచన, కష్టపడే మనస్తత్వం.. ఆధునిక టెక్నాలజీ కలిస్తే ఎంత పెద్ద విజయాన్ని సాధించవచ్చో చూపించే ఒక ఉత్తమ ఉదాహరణ. ఈ రంగంలో ఇలాంటి ఆలోచనలు చేసే ఎంతోమందికి ఇదొక ప్రేరణ.

కళ్యాణి రామదుర్గం యాపిల్ కంపెనీలో ఉద్యోగం ఉంది కదా అని అక్కడే ఆగిపోయి ఉంటే.. నేడు ఫోర్బ్స్ 30-అండర్-30 జాబితాలో చోటు సంపాదించగలిగేవారా?, కాబట్టి యువత ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే.. ఉన్న ఉద్యోగంతో సంతృప్తి చెందకూడదు. కొత్తగా ఆలోచించాలి, కొత్త మార్గాలను అన్వేషించాలి. పెద్ద సంస్థలో ఉద్యోగం తెచ్చుకోవడం గొప్ప విజయమే. ఆ విజయాన్ని అక్కడితో ఆపేయకూడదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement