అది ప్రపంచంలోనే పేరుమోసిన ఒక బహుళజాతి కన్సల్టింగ్ సంస్థ. అక్కడ ఉద్యోగం అంటే ఎంతో ప్రతిష్టాత్మకం. కానీ, అనారోగ్యంతో బాధపడుతున్న ఒక భారతీయ మహిళను ‘నీ వల్ల కావట్లేదు’.. అంటూ ఆ సంస్థ బయటకు పంపేసింది. అవమానాన్ని భరించి మౌనంగా ఉండిపోలేదు ఆ మహిళ. ఆరేళ్లపాటు అలుపెరగని న్యాయపోరాటం చేసింది. చివరకు బ్రిటన్ హైకోర్టు మెట్లెక్కి.. కార్పొరేట్ దిగ్గజాన్ని తలవంచేలా చేసింది. ఆమే పశ్చిమ బెంగాల్ కు చెందిన ఎన్నారై ప్రొఫెషనల్ సంజు పాల్.
ఏమిటా కథ?
సంజు పాల్ ప్రముఖ సంస్థ ’యాక్సెంచర్’ లో మేనేజర్‌గా పనిచేసేవారు. ఆమె ఎండోమెట్రియోసిస్ అనే దీర్ఘకాలిక గర్భాశయ సంబంధిత సమస్యతో బాధపడుతున్నారు. దీనివల్ల తీవ్రమైన నొప్పి ఉంటుంది. అయితే, ఆమె పనితీరు బాలేదంటూ, సీనియర్ మేనేజర్‌గా పదోన్నతి పొందే సామర్థ్యం లేదంటూ 2019లో సంస్థ ఆమెను తొలగించింది.
‘అప్ ఆర్ ఔట్’పై సవాల్!
దీనిపై ఆమె ఎంప్లాయిమెంట్ అప్పీల్ ట్రిబ్యునల్ (ఈఏటీ)ను ఆశ్రయించారు. బ్రిటన్ ఈక్వాలిటీ యాక్ట్ 2010 ప్రకారం, దీర్ఘకాలిక అనారోగ్యాన్ని వైకల్యంగా పరిగణించాలని, దాని ఆధారంగా వివక్ష చూపడం చట్టవిరుద్ధమని ఆమె వాదించారు. కార్పొరేట్ సంస్థల్లో ఒక వివాదాస్పద నిబంధన ఉంది. అదే ‘అప్ ఆర్ అవుట్’.. అంటే నిర్ణీత సమయంలో పదోన్నతి సాధించకపోతే ఉద్యోగం వదిలి వెళ్లాలి. దీన్ని సంజు పాల్ సవాలు చేశారు. అనారోగ్య సమస్య ఉన్నప్పుడు దాన్ని సాకుగా చూపి ఎలా తొలగిస్తారని ఆమె ప్రశ్నించారు.
వెనక్కి తగ్గని సంజు
మొదట కింది కోర్టు ఆమెకు కేవలం 4,275 పౌండ్ల నామమాత్రపు పరిహారం ఇచ్చి కేసు ముగించాలని చూసింది. కానీ సంజు పాల్ వెనక్కి తగ్గలేదు. దీంతో హైకోర్టు సోమవారం సంచలన తీర్పు ఇచి్చంది. ఎండోమెట్రియోసిస్ వ్యాధిని విస్మరించడం తప్పని కోర్టు తేల్చి చెప్పింది. గతంలో ఆమెకు వ్యతిరేకంగా వచి్చన తీర్పును ‘అసంబద్ధం’అని కొట్టివేసింది. కేసును సరికొత్త కోణంలో విచారించాలని ఆదేశించింది.
న్యాయం గెలిచింది
‘నా లాంటి దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడే ఉద్యోగుల హక్కుల కోసం, పని ప్రదేశాల్లో వివక్ష పోవాలనే నేను పోరాడాను. ఈ విజయం నా ఒక్కదానిదే కాదు’.. అంటూ సంజు పాల్ భావోద్వేగానికి లోనయ్యారు. ఆమె సేవలను గుర్తించిన బ్రిటన్ ప్రధాని ఇప్పటికే ఈమెను ‘పాయింట్స్ ఆఫ్ లైట్’పురస్కారంతో సత్కరించడం విశేషం. అనారోగ్యం బలహీనత కాదు.. పోరాడితే అది చట్టబద్ధమైన బలం అవుతుందని సంజు పాల్ నిరూపించారు.


