భారత్‌తో పెట్టుకుంటే ఇంతే.. పాకిస్తాన్‌కు చావు దెబ్బ! | Pakistan Lost 1240 cr For Banning Airspace To Indian Flights, More Details Inside | Sakshi
Sakshi News home page

భారత్‌తో పెట్టుకుంటే ఇంతే.. పాకిస్తాన్‌కు చావు దెబ్బ!

Aug 10 2025 12:47 PM | Updated on Aug 10 2025 2:52 PM

Pakistan lost 1240 cr closing airspace to Indian flights

ఇస్లామాబాద్‌: దాయాది దేశం పాకిస్తాన్‌కు భారత్‌ కారణంగా గట్టి ఎదురుదెబ్బ తగిలింది. పహల్గాం ఉగ్రదాడి తర్వాత పాకిస్తాన్‌  తీసుకున్న చర్యలు, నిర్ణయాలు వల్ల   ఆ దేశానికే ఊహించని షాక్‌ తగిలింది ఈ కారణంగా కేవలం రెండు నెలల కాలంలో పాక్‌కు ఏకంగా రూ.1,240 కోట్ల నష్టం వాటిల్లినట్టు డాన్ పత్రిక ఆ దేశ రక్షణ మంత్రిత్వ శాఖ అధికారిక ప్రకటనను ఉటంకిస్తూ నివేదించింది. ఇంతకీ ఏం జరిగిందంటే..

పహల్గాం ఉగ్రదాడి తర్వాత భారత్-పాకిస్తాన్ మధ్య చోటుచేసుకున్న దౌత్యపరమైన ఉద్రిక్తతల్లో.. భారత్‌ పలు ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే. సింధు జలాల ఒప్పందాన్ని రద్దు చేయడంతో భారత్‌పై కక్షగట్టిన పాక్‌.. తన గగనతలాన్ని మూసివేసింది.  భారత విమానాలు తమ గగనతలం మీదుగా వెళ్లకుండా పాక్‌ ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే. అయితే, ఈ నిర్ణయంతో దాయాదికే భారీ నష్టం ఎదురైంది. ఏప్రిల్‌ 24 నుంచి జూన్‌ 20 వరకు పాక్‌ తమ గగనతలాన్ని మూసివేయడంతో దాదాపు రూ.1240కోట్లు(భారత కరెన్సీ) నష్టం వాటిల్లిందని పాక్‌ ఎయిర్‌పోర్ట్స్‌ అథారిటీ పేర్కొన్నట్లు తెలుస్తోంది. భారతపై ఆంక్షల నేపథ్యంలో రోజుకు 100-150 విమానాలపై ప్రభావం పడిందని తెలిపింది.

దీని కారణంగా విమానాల రాకపోకలు 20శాతం తగ్గిపోయాయని వెల్లడించింది. ఫలితంగా పాక్‌ గగనతలాన్ని వినియోగించుకున్నందుకు భారత విమానాలపై విధించే ఛార్జీలపై వచ్చే ఆదాయంపై తీవ్ర ప్రభావం పడినట్లు వివరించింది. మరోవైపు.. ఈ ఆంక్షలను ఆగస్టు 24 వరకు పొడిగించారు. దీనికి ప్రతిగా భారత్‌ కూడా పాక్‌ విమానాలకు తమ గగనతలాన్ని మూసివేసింది.

పహల్గాంలో ఉగ్రదాడి ఘటనపై దేశమంతా ఆందోళన వ్యక్తమైన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో 26 మంది పర్యాటకులు ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఉగ్రవాదులను పోషిస్తున్న పాక్‌పై భారత్‌ కఠిన చర్యలు తీసుకుంది. అందులోభాగంగా సింధుజలాల ఒప్పందాన్ని నిలిపివేయడంతోపాటు పాక్‌ పౌరులు తక్షణమే భారత్‌ను విడిచివెళ్లాలని ఆదేశించింది. అనంతరం భారత్‌ ‘ఆపరేషన్‌ సిందూర్‌’ చేపట్టి.. పాక్‌, పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌లో ఉగ్రస్థావరాలను నేలమట్టం చేసింది. దాదాపు 100 మంది ఉగ్రవాదులను హతమార్చింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement