‘సింగారమనే దారంతో చేసింది చీర
ఆనందమనే రంగులనే అద్దింది చీర
మమకారమనే మగ్గంపై నేసింది చీర
చీరలోని గొప్పతనం తెలుసుకో..’ అంటూ చీరకున్న ప్రత్యేకతను వరి్ణంచారు కవులు. అలాంటి చీర సాధికారతను అమెరికాలో ప్రదర్శించారు మహిళలు. న్యూయార్క్‌లోని టైమ్స్ స్క్వేర్‌లో ప్రత్యేక ‘చీర’కార్యక్రమాన్ని నిర్వహించారు. న్యూయార్క్‌కు చెందిన ఓ దాతృత్వ సంస్థ ఉమా గ్లోబల్, స్థానిక కాన్సులేట్ జనరల్ ఆప్ ఇండియా భాగస్వామ్యంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించింది. ‘చీర గోస్ గ్లోబల్’పేరుతో జరిగిన ఈ కార్యక్రమం రెండో ఎడిషన్.
ఈ వేడుకలో భారత్, బంగ్లాదేశ్, వెస్టిండీస్, మలేసియా, సింగపూర్, శ్రీలంక, అమెరికాలోని పలు నగరాల నుంచే కాకుండా న్యూయార్క్ మహిళలు కూడా పాల్గొన్నారు. విభిన్నమైన రంగులు, వివిధ రకాల చీరలతో టైమ్స్‌స్క్వేర్ కళకళలాడింది. కార్యక్రమంలో బిహు నృత్యం వంటి సాంస్కృతిక ప్రదర్శనలు, చీర వాకథాన్ నిర్వహించారు. టైమ్స్ స్క్వేర్ చుట్టూ ఒక సింబాలిక్ మార్చ్ నిర్వహించారు. ‘వేల సంవత్సరాల చరిత్ర కలిగిన, ప్రపంచంలోని అత్యంత పురాతనమైన మహిళలు నిరంతరం ధరించే వ్రస్తాల్లో చీర ఒకటి.
చీరకట్టే విధానం, రకరకాల శైలులు భారత్ వైవిధ్యాన్ని, కళాత్మక వారసత్వాన్ని ప్రతిబింబిస్తాయి’న్యూయార్క్‌లోని కాన్సులేట్ జనరల్ ఆఫ్ ఇండియాలోని కాన్సుల్ ప్రజ్ఞాసింగ్ అన్నారు. చీర సాంస్కృతిక చరిత్ర, వైవిధ్యాన్ని ఆమె గుర్తు చేశారు. ఇది కేవలం సాంస్కృతిక వేడుక మాత్రమే కాదని, ఇండియాలోని చేతి వృత్తుల చరిత్రకు ప్రతీకని, మహిళలు నాయకత్వం వహిస్తే సమాజాలు అభివృద్ధి చెందుతాయని చీర మనకు గుర్తు చేస్తుందని న్యూయార్క్ నగర మేయర్ కార్యాలయంలో అంతర్జాతీయ వ్యవహారాల డిప్యూటీ కమిషనర్ దిలీప్ చౌహాన్ అన్నారు.
న్యూయార్క్


