నేపాల్‌లోని భద్రాపూర్ విమానాశ్రయంలో ఓ విమానానికి త్రుటిలో ప్రమాదం తప్పింది. ఈ ఘటన శుక్రవారం రాత్రి 9.08 గంటల సమయంలో చోటుచేసుకుంది. బుద్ధ ఎయిర్‌వేస్‌కు చెందిన విమానం 51 మంది ప్రయాణికులు, మరో నలుగురు విమాన సిబ్బందితో నేపాల్ రాజధాని కఠ్మాండూలోని త్రిభువన్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి రాత్రి 8.23కు బయలుదేరిన విమానం.. 9.08 గంటలకు భద్రాపూర్ చేరుకుంది. ల్యాండింగ్ సమయంలో విమానం అదుపుతప్పింది. రన్‌వేను దాటుకుని 200 మీటర్ల దూరం వెళ్లి.. గడ్డిలోకి కూరుకుపోయింది. ఇంకాస్త ముందుకెళ్లి ఉంటే.. విమానం నదిలోకి పడిపోయి ఉండేది.

విమానం రన్‌వేపై నుంచి ముందుకు దూసుకుపోవడంతో భారీ కుదుపులు వచ్చాయి. దీంతో.. పలువురు ప్రయాణికులకు స్వల్ప గాయాలైనట్లు విమానాశ్రయ సిబ్బంది తెలిపారు. క్షతగాత్రులను సురక్షితంగా ఆసుపత్రికి తరలిస్తున్నట్లు విమానాశ్రయ ప్రతినిధి రింజీ షెర్పా వెల్లడించారు. ఈ ఘటనపై దర్యాప్తు జరుపుతున్నట్లు బుద్ధ ఎయిర్‌వేస్ ఓ ప్రకటనలో తెలిపింది. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరుపుతున్నామని సివిల్ ఏవియేషన్ అథారిటీ ఆఫ్ నేపాల్ (సీఏఏఎన్) అధికార ప్రతినిధి జ్ఞానేంద్ర భుల్ వెల్లడించారు.


