రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ పేరు విన్నారా...? వినే ఉంటారు...? చూశారా అంటే అతికొద్ది మంది మాత్రమే చూసి ఉంటారు. ఇక కలిశారా? అని ప్రశ్నిస్తే వేళ్ల మీద లెక్క పెట్టొచ్చు..... అదేంటీ... ఓ దేశ అధ్యక్షుడు కొంతమందినే కలిశాడనడమేంటీ అని ఆశ్చర్య పోతున్నారా...? అవును మీరు విన్నది నిజమే. అతని చుట్టూ వలయంలా ఉండే భద్రతా సిబ్బందిని దాటి పుతిన్‌ను కలవాలంటే... మామూలు విషయం కాదు. అసలు అతనికున్న సెక్యూరిటీని ఛేదించి ముందుకు వెళ్లాలంటే... ఈగలు- దోమలకు కూడా ఆస్కారం లేదు. అంతటి రక్షణ వ్యవస్థతో కూడిన పుతిన్ సెక్యూరిటీతో పోలిస్తే ప్రపంచంలో మరే అధ్యక్షుడికి అంతటి సెక్యూరిటీ లేదనే చెప్పవచ్చు. అమెరికా అధ్యక్షుడికి మించి ఉన్న అతని భద్రతా వలయం... అతని రక్షణ కోసం నిత్యం జరిగే కసరత్తుపై ఓ సారి ఫోకస్ చేద్దాం.
వ్లాదిమిర్ పుతిన్ ప్రపంచంలో ప్రముఖుల్లో ఒకరు. ఆయనకు విదేశాల నుంచి ముప్పు పొంచి ఉందని గ్రహించిన భద్రతా బలగాలు... కంటికి రెప్పలా కాపాడుతుంటాయి. పటిష్ఠమైన భద్రతా వలయంలో ఉంటూ... అతనిపై ఈగ కూడా వాలనీయకుండా సిబ్బంది జాగ్రత్త పడుతుంటారు. దానికోసం నమ్మకస్తులైన అతని భద్రతా సిబ్బంది చేసే కసరత్తు... ఓ యంత్రంలా సాగుతుంటుంది. పుతిన్ విదేశాలకు వెళ్లినప్పుడు అతని వ్యక్తిగత భద్రతా సిబ్బంది 5 వలయాల్లో ఉంటుంది. చీమ చిటుక్కుమన్నా... గుర్తించే యంత్రాంగం ఉంటుంది. చివరకు పుతిన్ మల మూత్రాలను కూడా రష్యా తిరిగి తీసుకెళ్తారు.
విదేశాల్లో అక్కడి టాయిలెట్ వాడితే... వాటిని సేకరించి... అతని డీఎన్‌ఏను గుర్తించడం లేదా... పుతిన్‌కు ఉన్న రోగాల గురించి తెలుసుకునే ప్రమాదం ఉందని గ్రహించిన సెక్యూరిటీ సిబ్బంది... అతని మల మూత్రాలను కూడా ఓ సూట్‌కేస్‌లో భద్రపరిచి రష్యాకు తీసుకొస్తారంటే... ఇక అతని సెక్యూరిటీ స్థాయిని గుర్తించవచ్చు. పుతిన్ సెక్యూరిటీ స్థాయి అమెరికా అధ్యక్షుడి సీక్రెట్ సర్వీస్ కన్నా మించి ఉంటుందని విశ్లేషకులు చెబుతున్నారు. జనంతో అతి తక్కువగా కలిసే పుతిన్ దగ్గరికి కేవలం అతని కుటుంబీకులు, సెక్యూరిటీ మాత్రమే ఉంటుంది. మిగత వారు అతని వద్దకు రావడం అసాధ్యమే అని చెప్పవచ్చు. ప్రజలతో కాంటాక్ట్ చాలా పరిమితంగా ఉంటుంది. అతనికి దగ్గరగా రావడం దాదాపు అసాధ్యం.
పుతిన్ భద్రతా వ్యవస్థను ఫెడరల్ ప్రొటెక్టివ్ సర్వీస్ అనే ప్రత్యేక భద్రతా సంస్థ పర్యవేక్షిస్తుంది. భద్రతా సిబ్బందితో పాటు ఎలైట్ బాడీగార్డులు, ఇంటెలిజెన్స్ యూనిట్లు పుతిన్ భద్రతలో ఉంటాయి.
పుతిన్ మస్కటీర్స్ పేరిట ఉన్న అతని బాడీగార్డులు ఎప్పుడూ అతని చుట్టూ ఓ కంచెలా ఉంటారు. శిక్షణ పొందిన అతని బాడీగార్డులు... అధునాతన ఆయుధాలు ధరించి ఉంటారు. పుతిన్ ఆరస్ సెనేట్ పేరుతో ఉన్న కారులో తిరుగుతారు. సెనేట్ కారు ప్రత్యేకంగా పుతిన్ అధికారిక వినియోగం కోసం తయారైంది. ట్విన్ టర్బో ఇంజిన్‌తో తయారైన కారు ఎంతో అధునాతనమైంది.
లగ్జరీతో పాటు సెక్యూరిటీ... రష్యా తయారీ బ్రాండ్ కారునే పుతిన్ వాడుతారు. ఈ కారు ఆర్మర్-పియర్సింగ్ బుల్లెట్లతో...., గ్రనేడ్ దాడులను కూడా తట్టుకునేలా తయారైంది. భోజన విషయంలోనూ ఎంతో సెక్యూరిటీ ఉంటుంది. పుతిన్ కోసం తయారైన భోజనాన్ని తొలుత అతని బాడీగార్డులు రుచి చూస్తారు. ఆ తర్వాతనే పుతిన్‌కు వడ్డిస్తారు. ఫుడ్ తయారు చేసే షెఫ్‌లను కూడా తనిఖీలతో పాటు హైజీన్ చెక్‌లు ఉంటాయి.
పుతిన్ అంతర్జాతీయ పర్యటనల సమయంలో భద్రత పటిష్ఠంగా ఉంటుంది. పుతిన్ ఏ దేశం వెళ్లినా... స్థానిక భద్రతా బలగాలతో కలిపి ఐదు- అంచెల సెక్యూరిటీ గ్రిడ్ ఉంటుంది. వాటిలో స్నిపర్ టీమ్స్, ఏఐ ఆధారిత సర్వైలెన్స్ కూడా ఉంటుంది. విదేశీ ప్రయాణం చేసినప్పుడు ఫ్లయింగ్ క్రెమ్లిన్ అనే ప్రత్యేక విమానం ద్వారా వెళ్తారు. అందులోనూ బాడీగార్డులు, ఎలైట్ సెక్యూరిటీ, అధికారులు, NSG కమాండోలు, టెక్నాలజీ AI ఆధారిత సర్వైలెన్స్, స్నిపర్ టీమ్స్ ఉంటాయి. అతని పర్యటన, షెడ్యూల్ వివరాలన్నీ గోప్యంగా ఉంటాయి. విమానం కూడా యాంటీ మిసైల్ డిఫెన్స్ సిస్టమ్‌తో ఉంటుంది.
దాంతో శత్రు క్షిపణులను గుర్తించి తప్పించుకునే టెక్నాలజీ ఆ విమానానికి ఉంది. రాడార్ - జామింగ్ టెక్నాలజీ ద్వారా శత్రువుల రాడార్‌లను తప్పుదోవ పట్టించే సాంకేతికత కూడా ఉంది. అందులో ఉన్న కమ్యూనికేషన్ సిస్టంతో.... యుద్ధ పరిస్థితుల్లో కూడా రష్యా సైన్యం... ప్రభుత్వంతో నిరంతర సంబంధాలు కలిగి ఉండేలా చర్యలున్నాయి. విమానం ద్వారానే ఎయిర్‌బోర్న్ కమాండ్ సెంటర్ – ఏర్పాటు చేసి అణు యుద్ధం జరిగినా అధ్యక్షుడు ఆకాశంలో నుంచే ఆదేశాలు ఇవ్వగల సాంకేతికత జోడించి ఉంది.
పుతిన్ భద్రతా వ్యవస్థలో అతని వ్యక్తిగత ఆరోగ్య రహస్యాలు ఎక్కడా లీక్ కాకుండా ఉండే విధంగా జాగ్రత్త పడతారు. విదేశీ ప్రయాణాల్లో ప్రత్యేక ప్రోటోకాల్స్ కూడా ఉంటాయి. విచిత్రమేమిటంటే... విదేశీ పర్యటనలో అతని బాడీగార్డుల వద్ద పూప్ సూట్‌కేస్ ఉంటుంది. ఆ సూట్‌కేస్ కూడా... పుతిన్.. విదేశీ పర్యటనల్లో ఉపయోగించే ఒక విచిత్రమైన భద్రతా ప్రోటోకాల్. అతని బాడీగార్డులు అతని శరీర వ్యర్థాలను మూత్రం, మలము సేకరించి వాటిని ప్రత్యేక సూట్‌కేస్‌లో రష్యాకు తీసుకెళ్తారు.
దీని ఉద్దేశ్యం అతని ఆరోగ్య స్థితి, DNA వంటి గోప్యమైన సమాచారం విదేశీ గూఢచార సంస్థలకు చేరకుండా కాపాడటం. పుతిన్ ఎప్పుడూ విదేశాల్లో పబ్లిక్ టాయిలెట్ ఉపయోగించరు. అతని బాడీగార్డులు ప్రత్యేకంగా పూప్ సూట్‌కేస్‌లో సేకరించి రష్యాకు తీసుకెళ్తారు. ఈ ప్రోటోకాల్ అసాధారణంగా వినిపించినా, ఇది అత్యంత గట్టి భద్రతా వ్యూహంలో భాగమని రష్యా సైన్యాధికారులు చెబుతున్నారు. ఇంతటి రక్షణ వ్యవస్థలో ఉన్న పుతిన్ సెక్యూరిటీని ఛేదించడం దాదాపు అసాధ్యమే.


