ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), ఏఐ ఆధారిత సాంకేతికల వల్ల ప్రపంచ వ్యాప్తంగా ఉద్యోగులపై భారీ ప్రభావం పడుతుందని IMF చీఫ్ క్రిస్టాలినా జార్జివా (Kristalina Georgieva) హెచ్చరించారు. ప్రపంచ శ్రామిక శక్తిలో 40 శాతం, ముఖ్యంగా ఎంట్రీ-లెవల్ ఉద్యోగాలు ప్రమాదంలో పడిపోయాయని అంచనా వేశారు. ఈ మార్పు "కార్మిక మార్కెట్లకు సునామీ" లాంటిదని ఆమె అభివర్ణించారు.
అంతర్జాతీయ ద్రవ్య నిధి మద్దతుగల అధ్యయనాలను ప్రస్తావిస్తూ, అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థలలో ఈ సంఖ్య 60 శాతం వరకు పెరగవచ్చు కానీ భారతదేశానికి 26 శాతం వద్ద స్థిరపడే అవకాశం ఉందని ఆమె అన్నారు. సులభంగా ఆటోమేట్ చేయగల (యంత్రాల ద్వారా చేయగలిగే) పనులు, అంటే కొత్తగా గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన వారు చేసే ప్రారంభ స్థాయి ఉద్యోగాల విషయంలో ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. ఒకవేళ భారత్ AI ని సరిగ్గా వినియోగించుకుంటే, దేశ GDP ఏటా 0.7 శాతం పెరిగే అవకాశం ఉందని, ఇది దీర్ఘకాలిక వృద్ధి లక్ష్యాలకు తోడ్పడుతుందని పేర్కొన్నారు.అలాగే ప్రజలను AI ఆర్థిక వ్యవస్థకు సిద్ధం చేయడానికి ప్రభుత్వం సరైన విధానాలను (Policymaking) రూపొందించాలని, కేవలం నైపుణ్యాలు నేర్చుకోవడమే కాకుండా వాటిని మార్చుకునే సౌలభ్యం (Flexibility) ఉండాలని ఆమె సూచించారు.
ఇదీ చదవండి: జెఫ్రీ ఎప్‌స్టీన్ బాధితురాలి నోట సంచలన విషయాలు
ఇండియాపై ప్రశంసలు
పన్నులు, కార్మిక మార్కెట్లలో భారత్ చేపట్టిన సంస్కరణలు నిర్మాణాత్మక దేశాన్ని మరింత పోటీతత్వంతో మార్చాయని ఆమె ప్రశంసించారు. భారత బ్యాంకింగ్ , కార్పొరేట్ రంగాలు బలంగా ఉన్నాయని, ఇది పెట్టుబడులకు అనుకూలమైన వాతావరణాన్ని సృష్టించిందన్నారు. అమెరికా నేతృత్వంలోని 'పాక్స్ సిలికా' (Pax Silica) వంటి వ్యూహాత్మక కూటముల్లో భారత్ చేరడం వల్ల, గ్లోబల్ సప్లై చైన్‌లో భారత్ కీలక పాత్ర పోషిస్తోందని, ఇది AI వల్ల కలిగే నష్టాల నుండి రక్షణ కల్పిస్తుందని ఆమె వివరించారు. AI ని అందరికీ అందుబాటులోకి తెచ్చేందుకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చేస్తున్న కృషిని ఆమె అభినందించారు.
ఇదీ చదవండి: పురుషుల్లో క్షీణిస్తున్న‘Y’ క్రోమోజోమ్: షాకింగ్ విషయాలు వెల్లడి


