సాక్షి, హైదరాబాద్: మాజీ మంత్రి, వైఎస్సార్‌సీపీ నాయకులు జోగి రమేష్ ఇంటిపై టీడీపీ గూండాల దాడి నేపథ్యంలో ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. జోగి రమేష్ ఇంటికి భద్రత కల్పించాలని హైకోర్టు ఆదేశించింది. జోగి రమేష్ ఇంటి వద్ద ఎలాంటి దాడులు జరిగినా పోలీసులలే బాధ్యత అని తెలిపింది.
కాగా, తమకు భద్రత కల్పించాలని జోగి రమేష్ కుమారుడు.. ఏపీలో హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఆయన పిటిషన్‌పై విచారణ చేపట్టిన ధర్మాసనం.. జోగి రమేష్ ఇంటి వద్ద భద్రత కల్పించాలని పోలీసులను ఆదేశించింది. అవాంఛనీయ ఘటనలు జరగకుండా చర్యలు చేపట్టాలని పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. ఒకవేళ దాడులు జరిగితే పోలీసులదే బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించింది.
జోగి రమేష్ ఇంటిపై దాడి ఘటనలో ఇబ్రహీంపట్నం పోలీసుల హై డ్రామాకు తెరలేపారు. దాడికి పాల్పడిన వారిపై డమ్మీ కేసులు నమోదు చేసి 11 మందిని అరెస్ట్ చేశారు. అనంతరం, వెంటనే స్టేషన్ బెయిల్ ఇచ్చి వారిని ఇబ్రహీంపట్నం పోలీసులు వదిలేశారు. 11 మంది టీడీపీ నాయకులు, కార్యకర్తలను విడుదల చేశారు. టీడీపీ నేతలు ఫతావుల్లా, మాధవ్, ఆశ సహా పలువురిని అరెస్ట్ చేసి వదిలిపెట్టారు. వీరంతా విజయవాడ నుండి దాడికి వెళ్లిన టీడీపీ నేతలు కావడం గమనార్హం.


