సాక్షి, ఢిల్లీ: సుప్రీంకోర్టులో నేడు తెలంగాణ ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసు విచారణ జరగనుంది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయి ధర్మాసనం విచారణ చేపట్టనుంది. ఎమ్మెల్యేల విచారణకు మరింత గడువు కావాలని స్పీకర్ కార్యాలయం ఇటీవల సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. అన్ని కేసులను నేడు సుప్రీంకోర్టు ధర్మాసనం విచారణ జరపనుంది. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు విచారణపై సర్వత్ర ఉత్కంఠ నెలకొంది.
జూలై 31న సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలను స్పీకర్ పాటించట్లేదంటూ బీఆర్ఎస్ నాయకులు కేటీఆర్, పాడి కౌశిక్ రెడ్డి తదితరులు ఆయనపై అనర్హత పిటిషన్ దాఖలు చేశారు. ఎమ్మెల్యేల అనర్హతపై స్పీకర్ మూడు నెలల్లో నిర్ణయం తీసుకోవాలని సుప్రీంకోర్టు తీర్పు వెల్లడించిన విషయం తెలిసిందే. అయితే, విచారణకు మరింత సమయం కావాలని స్పీకర్.. సుప్రీంకోర్టులో మరో పిటిషన్ వేశారు. ఈ సందర్బంగా ఇప్పటికే ఎమ్మెల్యేల విచారణ ప్రారంభించినట్టు తెలిపారు. కోర్టు ఆదేశాల ప్రకారం.. ఎమ్మెల్యేల విచారణ కొనసాగుతుందని పిటిషన్‌లో పేర్కొన్నారు.
ఇదిలా ఉండగా.. తమ పార్టీలో గెలిచిన 10 మంది ఎమ్మెల్యేలు పార్టీ మారారని బీఆర్ఎస్ ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. 2023 అసెంబ్లీ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ అధికారంలోకి రాగా బీఆర్ఎస్ నుంచి 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో చేరారు. వారిలో దానం నాగేందర్, కడియం శ్రీహరి, తెళ్ళం వెంకటరావు, అరెకపూడి గాంధీ, పోచారం శ్రీనివాస్ రెడ్డి, సంజయ్ కుమార్, ప్రకాశ్ గౌడ్, కాలే యదయ్య, గూడెం మహిపాల్ రెడ్డి, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ఉన్నారు. బీఆర్ఎస్ ఆ పది మందిపై అనర్హత పిటిషన్‌ను జనవరి 16న సుప్రీంకోర్టులో దాఖలు చేసింది. ఇప్పటివరకూ స్పీకర్ ఏ చర్యలూ తీసుకోలేదనీ, హైకోర్టు ఆదేశాలను కూడా పాటించలేదని బీఆర్‌ఎస్ ఆరోపించింది. అయితే, ఇప్పటికే 8 మంది ఎమ్మెల్యేలను అసెంబ్లీ స్పీకర్ విచారించారు. విచారణకు మరింత సమయం కావాలని కోర్టును కోరుతున్నారు.


