సాక్షి, విశాఖపట్నం: విశాఖ స్టీల్ ప్లాంట్ వద్ద కార్మికులు నిరసనలకు దిగారు. కార్మికులపై చంద్రబాబు చేసిన వ్యాఖ్యలను వెంటనే ఉప సంహరించుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఎన్నికలకు ముందు ఒక మాట.. ఎన్నికల తర్వాత ఒక మాట మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
వివరాల ప్రకారం.. కార్మికులపై చంద్రబాబు చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ స్టీల్ ప్లాంట్ అడ్మిన్ భవన్ వద్ద కార్మికులు నిరసనలకు దిగారు. ఈ సందర్భంగా కార్మికులు మాట్లాడుతూ..‘చంద్రబాబు తన వ్యాఖ్యలను వెంటనే ఉపసంహరించుకోవాలి. కార్మికులకు వెంటనే క్షమాపణ చెప్పాలి. ఓట్లు కోసం స్టీల్ ప్లాంట్ కాపాడుతామని చంద్రబాబు, పవన్ కళ్యాణ్ హామీ ఇచ్చారు. ఎన్నికల తర్వాత మాట మార్చారు. ఉద్యోగుల జీతాలకు ప్రొడక్షన్‌కు ఎటువంటి సంబంధం లేదు. ప్రొడక్షన్‌ను బట్టి జీతాలు ఇస్తామనే సర్క్యులర్ వెంటనే ఉపసంహరించుకోవాలి.
కార్మికుల వలన స్టీల్ ప్లాంట్‌కు నష్టాలు రాలేదు. స్టీల ప్లాంట్‌కు సొంతంగా గనులు కేటాయించకపోవడం వలన నష్టాలు వస్తున్నాయి. దేశంలో అన్ని స్టీల్ ప్లాంట్‌కు సొంతంగా గనులు ఉన్నాయి. విశాఖ స్టీల్ ప్లాంట్‌కు సొంతంగా గనులు లేవు. చంద్రబాబు పీపీపీ అంటే ప్రజలు ఛీ.. ఛీ.. ఛీ. అంటున్నారు. చంద్రబాబు దృష్టి అంతా ప్రైవేటీకరణ మీదే ఉంది. విద్యా వైద్య రంగాన్ని కూడా ప్రైవేటీకరణ చేస్తున్నారు. ప్యాకేజీ వలన కార్మికులకు స్టీల్ ప్లాంట్‌కు ఎలాంటి ప్రయోజనం లేదు. రానున్న రోజుల్లో ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేస్తాం’ అని హెచ్చరించారు.


