నో బొమ్మ.. 65 పైరసీ వెబ్‌సైట్లు క్లోజ్‌ | 65 piracy websites shut down with IBomma Ravi Arrest | Sakshi
Sakshi News home page

నో బొమ్మ.. 65 పైరసీ వెబ్‌సైట్లు క్లోజ్‌

Nov 17 2025 5:38 AM | Updated on Nov 17 2025 8:45 AM

65 piracy websites shut down with IBomma Ravi Arrest

65 పైరసీ వెబ్‌సైట్లు ఐ బొమ్మ రవితోనే క్లోజ్‌

రవి వెనుక ఎలాంటి ముఠా లేదు.. అంతా వన్‌మ్యాన్‌  షోనే

ఓటీటీ, ఇతర వెబ్‌సైట్లలోని సినిమాలే తన వెబ్‌సైట్లలో.. 

ప్రకటనలు లేకపోవడంతో వీటికి ఎక్కువ క్రేజ్‌

కోర్టు అనుమతితో రవిని కస్టడీలోకి తీసుకోవాలని పోలీసుల నిర్ణయం

సాక్షి, హైదరాబాద్‌: సినిమాలను పైరసీ చేస్తూ చిత్ర పరిశ్రమతోపాటు పోలీసులకు సవాల్‌ విసిరి, ముప్పుతిప్పలు పెట్టిన ‘ఐబొమ్మ’ ఇమ్మడి రవికి సంబంధించి కీలక సమాచారం వెలుగులోకి వచ్చింది. ఇప్పటివరకు అంతా భావిస్తున్నట్లు అతడి వెనుక ఎలాంటి ముఠా లేదని బయటపడింది. తన గుట్టు బయటపడకుండా ఒక్కడిగానే పనిచేస్తూ పైరసీ సైట్ల నుంచి కాపీ చేస్తూ కథ నడిపాడని హైదరాబాద్‌ సైబర్‌ క్రైమ్‌ పోలీసులు గుర్తించారు. నాంపల్లి న్యాయస్థానం ఇతడికి 14 రోజులు జ్యుడీషియల్‌ రిమాండ్‌ విధించడంతో చంచల్‌గూడ జైలుకు తరలించారు. తదుపరి విచారణ నిమిత్తం తమ కస్టడీకి అప్పగించాలని కోరుతూ కోర్టులో పిటిషన్‌ దాఖలు చేయాలని నిర్ణయించారు. ఐబొమ్మ సహా 65 వెబ్‌సైట్లను పోలీసులు మూసేయించారు.  

ఎంబీఏ చదివి... కంపెనీ పెట్టి.. 
ఇమ్మడి రవి దేశవ్యాప్తంగా ఏజెంట్లను పెట్టుకుని థియేటర్లలో రికార్డింగ్‌ చేయించడం, డిజిటల్‌ మీడియా సంస్థలు, ఓటీటీల సర్వర్లను హ్యాక్‌ చేసి హెచ్‌డీ ప్రింట్స్‌ సంగ్రహిస్తాడని అందరూ అంచనా వేశారు. వీటినే ఐ బొమ్మ, బప్పం, ఇరాదే... ఇత్యాది 65 వెబ్‌సైట్లలో ఉంచుతున్నాడని అనుకున్నారు. రవి పట్టుబడిన తర్వాత అతడి విచారణలో వెలుగులోకి వచ్చిన అంశాలతో పోలీసులు అవాక్కయ్యారు. ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నానికి చెందిన రవి ముంబై యూనివర్సిటీలో ఎంబీఏ చదివాడు. ఆపై కొన్నాళ్లు ఉద్యోగం చేయడంతోపాటు ఈఆర్‌ ఇన్ఫోటెక్‌ పేరుతో ఓ సాఫ్ట్‌వేర్‌ కంపెనీ సైతం నిర్వహించాడు. సినీ పైరసీపై దృష్టి పెట్టి తన చేతికి మట్టి అంటకుండా పని చేసుకుపోయాడు. 

ఆ సైట్లలో ఉన్న సినిమాలను రికార్డు చేసి.. 
ఏళ్లుగా పైరసీ సినిమాలను తన వెబ్‌సైట్లలో ఉంచి సినీ రంగానికి భారీ నష్టం రావడానికి కారణమైన రవి ఇప్పటివరకు ఏనాడూ ఒక్క చిత్రాన్ని కూడా రికార్డు చేయలేదు.. చేయించలేదు.. సర్వర్లు హ్యాక్‌ చేయలేదు. మూవీరూల్జ్, తమిళ్‌వన్‌ సహా వివిధ పైరసీ వెబ్‌సైట్లను క్రమం తప్పకుండా వీక్షించే ఇతగాడు అందులో అప్‌లోడ్‌ అయిన సినిమాను కొన్ని సాఫ్ట్‌వేర్స్‌ వాడి రికార్డు చేసేవాడు. ఇలా రికార్డు చేసిన ప్రింట్‌ను తన వెబ్‌సైట్లలో పొందుపరిచే వాడు. 

ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌లోనూ అప్‌లోడ్‌ అయిన సినిమాలను ఇలానే రికార్డు చేసి తన సైట్‌లో పెట్టేవాడు. అయితే ఇతర పైరసీ వెబ్‌సైట్లలో యాడ్స్‌ ఎక్కువగా ఉండి వీక్షకుడిని డిస్ట్రబ్‌ చేస్తుంటాయి. రవికి సంబంధించిన వాటిలో మాత్రం ఓ సినిమా వీక్షించడానికి క్లిక్‌ చేసినప్పుడు మాత్రమే యాడ్‌ వస్తుంది. దాన్ని క్లోజ్‌ చేసి మరోసారి తెరిస్తే ఆద్యంతం ప్రకటన అనేది రాదు. ఈ కారణంగానే ఇతడి వెబ్‌సైట్లకు లక్షల్లో వీక్షకులు ఉంటున్నారు.  

ప్రాక్సీ సర్వర్లతో ఉనికి బయటపడకుండా... 
ప్రధానంగా కొన్ని గేమింగ్, బెట్టింగ్‌ యాప్స్‌కు సంబంధించిన యాడ్స్‌ ద్వారా రవికి భారీగా లాభాలు వచ్చేవి. ఐబొమ్మ వెబ్‌సైట్‌ ప్రాచుర్యం పొందిన నాటి నుంచి దాని నిర్వాహకుడి వివరాల కోసం సినీ, పోలీసు విభాగాలు ప్రయత్నించాయి. అయితే ప్రాక్సీ సర్వర్లను వాడుతూ, కరేబియన్‌ దీవులు, నెదర్లాండ్స్‌ సహా వివిధ ప్రాంత్లాల్లో ఉన్న సర్వర్లలో హోస్ట్‌ చేస్తూ కథ నడిపించడంతో నగరంలోనే ఉన్నా రవి ఆచూకీ ఎవరూ కనిపెట్టలేకపోయారు. 
 


పోలీసులకు, సినీ రంగానికి ఇతడు సవాల్‌ విసరడంతో వేట ముమ్మరమైంది. ఈ విషయం తెలిసి విదేశాలకు పారిపోయిన రవి ఫ్రాన్స్‌లో తలదాచుకున్నాడు. ఇటీవల ఓ బెట్టింగ్‌ యాప్‌ నుంచి ఐబొమ్మ నిర్వాహకుడికి జరిగిన చెల్లింపుల ఆధారంగా ముందుకెళ్లిన పోలీసులకు ఓ ఐపీ అడ్రస్‌ లభించింది. అది మూసాపేట్‌లోని రెయిన్‌బో విస్టా అపార్ట్‌మెంట్‌లోని ఎన్‌.బ్లాక్‌లో ఉన్న 1903 ఫ్లాట్‌కు దారి తీసింది. దానిపై నిఘా వేసి ఉంచిన సైబర్‌ క్రైమ్‌ పోలీసులు రెండు రోజుల క్రితం విదేశాల నుంచి తిరిగి వచ్చిన రవిని పట్టుకున్నారు.  

సోషల్‌మీడియాలో భారీ ఫాలోయింగ్‌ 
చట్టప్రకారం ఇమ్మడి రవి చేసింది నేరం. కానీ, సోషల్‌మీడియాలో మాత్రం అతడికి విపరీతమైన ఫాలోయింగ్‌ ఏర్పడింది. అతడి అరెస్టు విషయం తెలిసినప్పటి నుంచి పుంఖానుపంఖాలుగా గ్రూపులు ఏర్పాడుతున్నాయి. వివిధ వెబ్‌సైట్లలో రవి అరెస్టు వార్తను చూసిన అతడి అభిమానులు కామెంట్లలో తమ మద్దతు తెలుపుతున్నారు. ‘ఐ»ొమ్మ పోరాట సమితి’, ‘అమీర్‌పేట కుర్రాళ్లు’, ‘రవి ఫ్యాన్‌ క్లబ్‌’ పేర్లతో గ్రూపులు కనిపిస్తున్నాయి. 

‘సినిమా విడుదల సందర్భంలో రేట్లు పెంచేస్తూ ప్రభుత్వమే జీఓలు ఇస్తుంది. అలా పేద వాడికి దూరమైన సినిమాను విడుదలైన కొన్ని గంటల్లోనే రవి ఉచితంగా అందిస్తున్నాడు. అది తప్పెలా అవుతుంది?’ అని, ‘ఇప్పుడిక అమీర్‌పేట కుర్రాళ్లు, మిడిల్‌ క్లాస్‌ స్టూడెంట్ల పరిస్థితి ఏమిటో?’ అని కామెంట్లు కనిపిస్తున్నాయి.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement