‘చంద్రబాబు ఆంధ్రుల ద్రోహి అని మరోసారి రుజువు చేసుకున్నారు’ | Sidiri Appalaraju And Rajanna Dora Slam Chandrababu Comments | Sakshi
Sakshi News home page

‘చంద్రబాబు ఆంధ్రుల ద్రోహి అని మరోసారి రుజువు చేసుకున్నారు’

Nov 16 2025 5:11 PM | Updated on Nov 16 2025 5:23 PM

Sidiri Appalaraju And Rajanna Dora Slam Chandrababu Comments
  • విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణ తమ లక్ష్యమని చంద్రబాబు తేల్చేశారు
  • విశాఖ స్టీల్‌ ప్లాంట్‌పై సీఎం చంద్రబాబు వ్యాఖ్యలు ఖండిస్తున్నాం
  • మాజీ డిప్యూటీ సీఎం పి.రాజన్నదొర, మాజీ మంత్రి డాక్టర్‌ సీదిరి అప్పలరాజు స్పష్టీకరణ

విశాఖపట్నం:  చంద్రబాబు ఆంధ్రుల ద్రోహి అని మరోసారి రుజువు చేసుకున్నారని :మాజీ డిప్యూటీ సీఎం పి.రాజన్నదొర, మాజీ మంత్రి డాక్టర్‌ సీదిరి అప్పలరాజు ధ్వజమెత్తారు. విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణ తమ లక్ష్యమని చంద్రబాబు తేల్చేశారని,  సీఎం చంద్రబాబు వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు.  ఈ మేరకు రాజన్నదొర, సీదిరి అప్పలరాజులు సంయుక్త ప్రకటనలో ఏమన్నారంటే..

‘వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో ఐదేళ్లూ విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణ జరగకుండా, నాటి సీఎం వైఎస్‌ జగన్‌ అడ్డుకున్నారు. అప్పుడు విపక్షంలో ఉన్న సీఎం చంద్రబాబు, జనసేన అధినేత పవన్‌కళ్యాణ్‌.. నాటి ప్రభుత్వంపై ఇష్టానుసారం విమర్శలు చేశారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణను అడ్డుకోలేక పోతోందని దుమ్మెత్తి పోశారు. ఇప్పుడు అధికారంలోకి వచ్చాక, నిస్సిగ్గుగా, నిర్లజ్జగా యూటర్న్‌ తీసుకున్నారు. విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ను కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నామంటూ, ఒకవైపు ప్రజలను మభ్య పెడుతూ, మరోవైపు ఆ దిశలో కేంద్ర చర్యలను పూర్తిగా సమర్థిస్తున్నారు. అందుకు నిన్నటి (శనివారం) చంద్రబాబు మాటలే నిదర్శనం.

 ‘పని చేయకున్నా జీతాలివ్వాలా? తెల్ల ఏనుగులా మారితే ఎలా? ఎన్నాళ్లు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిధులిస్తాయి? ఊర్కే జీతాలు ఎందుకిస్తాయి?’ అనడం.. సీఎం చంద్రబాబు దిగజారిన వైఖరికి అద్దం పడుతున్నాయి. ఎన్నికల ముందు ఎన్నెన్నో మాటలు చెప్పి, పచ్చి అబద్ధాలు చెప్పి, ప్రజలను నమ్మించి ఓట్లు వేయించుకున్న చంద్రబాబు, అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని వర్గాలను మోసం చేసినట్లు విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ ఉద్యోగులను కూడా దారుణంగా వంచించారు. నిలువుగా దగా చేశారు.

అదే విశాఖ స్టీల్‌ ప్లాంట్‌కు కొన్నాళ్ల క్రితం కేంద్రం ప్యాకేజీ ఇస్తే, అది తమ ఘనత అన్నట్లు విపరీతంగా ప్రచారం చేసుకున్నారు. స్టీల్‌ ప్లాంట్‌ను కాపాడేందుకే కేంద్రం ఆ నిధులు ఇచ్చిందని, తమ చొరవ వల్లే కేంద్రం ఆ నిధులు ఇచ్చిందని డబ్బా కొట్టుకున్నారు. నిజానికి కేంద్రం ఆ నిధులు ఇచ్చింది స్టీల్‌ ప్లాంట్‌ను గట్టెక్కించడానికా? లేక ప్రైవేటీకరణ సజావుగా సాగేందుకా? అన్నది చూస్తే.. రెండోదే ఖాయంగా తేలుతోంది. కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వంలో కీలకంగా ఉన్నప్పటికీ, విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ను కాపాడడంలో సీఎం చంద్రబాబు ఇసుమంతైనా చొరవ చూపడం లేదు. పైగా తన సిద్ధాంతమైన ప్రైవేటీకరణకే మొగ్గు చూపుతున్నారు. అయినా నిస్సిగ్గుగా, నిర్లజ్జగా మళ్లీ రాష్ట్ర ప్రజలను నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు.

తమ మద్దతుపై ఆధారపడిన ప్రభుత్వం కేంద్రంలో ఉన్నా చంద్రబాబు కానీ, పవన్‌కళ్యాణ్‌ కానీ నోరు మెదపడం లేదు. కూటమి వైఖరితో ప్రత్యక్షంగా దాదాపు 20 వేల మంది ఉద్యోగులకు అన్యాయం చేస్తున్నారు. పరోక్షంగా లక్షలాదిపై ప్రభావం చూపుతున్నారు. ఎన్నికల ప్రచారంలో తీపి తీపి మాటలతో నమ్మించిన కూటమి నేతలు స్టీల్‌ ప్లాంట్‌ విషయంలో రాష్ట్రప్రజలను నిండా ముంచేశారు. కేంద్రంతో కలసి ఆంధ్రుల హక్కు అయిన విశాఖ ఉక్కును కళ్ల ఎదుటే ఉరి తీస్తున్నారు. 

32 మంది ప్రాణాలు అర్పించి సాధించుకున్న స్టీల్‌ ప్లాంట్‌ను ఏకపక్షంగా ప్రైవేటీకరిస్తున్నా కిక్కురుమనడం లేదు. కేంద్ర నిర్ణయాన్ని అపే సంఖ్యా బలం ఉన్నా చంద్రబాబు కూటమి ప్రభుత్వం ఎందుకు అడ్డుకోవడం లేదు? ఇందుకా ప్రజలు మీకు ఈ స్థాయిలో ఎంపీలను, ఎమ్మెల్యేలను గెలిపించింది.

గత ప్రభుత్వ హయాంలో సీఎం శ్రీవైఎస్‌ జగన్, స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణను బలంగా వ్యతిరేకించినందునే కేంద్ర ప్రభుత్వం ఐదేళ్లలో ఆ దిశగా ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేకపోయింది. కానీ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం రాగానే ఏడాదిలోపే కేంద్ర ప్రభుత్వం ప్రైవేటీకరణకు వేగంగా అడుగులు వేస్తూ వచ్చింది. ఉద్యోగుల తొలగింపు మొదలుకుని అనేక నిర్ణయాలను తీసుకున్నా చంద్రబాబు సర్కారు కిమ్మనలేదు.  ఇకనైనా టీడీపీ కూటమి ప్రభుత్వం తమ వైఖరి మార్చుకోవాలని, విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ను కాపాడాలి’ అని డిమాండ్‌ చేశారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement