విశాఖ కూటమి ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకతను కప్పిపుచ్చుకోవడానికే తమ నేతలను టార్గెట్ చేస్తున్నారని మాజీ మంత్రి, వైఎస్సార్‌సీపీ నేత గుడివాడ అమర్నాథ్ ధ్వజమెత్తారు. ఏపీలో అసలు కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నించడానికి వీల్లేదు అనేలా ఉందని మండిపడ్డారు.
‘రాష్ట్రంలో హత్యలు, దాడులు, అత్యాచారాలు పెరిగిపోయాయి. ఈ విషయంపై ప్రభుత్వ పెద్దలను అడిగితే మా చేతుల్లో లాటీ ఏమైనా ఉందా అని అడిగారు. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న వైఎస్సార్‌సీపీ నేతలను ప్రభుత్వం టార్గెట్ చేస్తుంది.. కల్తీ మద్యం అంశంలో నకిలీ ఎవిడెన్స్‌తో అరెస్ట్ చేశారు. కక్ష సాధింపు ఈ ప్రభుత్వానికి అలవాటుగా మారిపోయింది. ప్రభుత్వం మీద ఉన్న వ్యతిరేకతను డైవర్ట్ చెయ్యడానికి మా నేతలను ప్రభుత్వం టార్గెట్ చేస్తుంది. వైఎస్సార్‌సీపీ విద్యార్ధి సంఘం నాయకుడు కొండారెడ్డి ఏ తప్పు చెయ్యలేదని వారి తల్లితండ్రులు చెప్తున్నారు..
తప్పు చేస్తే ఏ శిక్షకైనా కొండారెడ్డి సిద్దమని.. ఏ టెస్టుకైనా సిద్దమని వారు చెప్తున్నారు.. కొండారెడ్డిని అదుపులోకి తీసుకున్న సమయంలో కొండారెడ్డిపై చెయ్యి చేసుకున్నారు. 2వ తేదీ ఉదయం 7:10 నిమిషాలకు కొండారెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. కొండా రెడ్డి అరెస్ట్ సమయంలో ఎందుకు వీడియో రికార్డ్ చేసి బయటకు ఇచ్చారు..?, రైల్వే స్టేషన్ వద్ద అరెస్ట్ చేసామని పోలీసులు ఎందుకు చెప్పారు..?, 2న సాయంత్రం పట్టుబడితే. ఉదయం 11 : 30 గంటలకు టీడీపీ ఆఫీషియల్ పేజ్ లో ఎలా పెట్టారు. టీడీపీ వాళ్ళ దగ్గర టైమ్ మిషన్ ఏమైనా ఉందా..?, టాస్క్ ఫోర్స్ పోలీసులు కొండారెడ్డిని అదుపులోకి తీసుకున్నది ఎంవీపీ పిఎస్ పరిధి.కొండారెడ్డి బైక్ 14 కిమీ అధికంగా తిరిగింది.. ఎందుకు తిప్పారు..?, పోలీసులు ప్లాన్ ప్రకారమే కొండారెడ్డిని అరెస్ట్ చేశారు.
గడిచిన ఏడాది కాలంగా ఎపిలో ఎక్కువ మిస్సింగ్ కేసులు నమోదు అయ్యాయి. ఎన్సీఆర్బీ రికార్డ్స్ ఈ లెక్కలు చెప్తున్నాయి. గుడికి దర్శనం కోసం వెళ్లిన వారి ప్రాణాలకు కూడా పాయకరావుపేట శాసన సభ్యురాలు రక్షణ కల్పించలేకపోతున్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు ఉన్నాయా లేదా అనే అనుమానం కలుగుతుంది.
రాష్ట్రంలో గుడికి, బడికి వెళ్లిన వారు బ్రతుకుతారనే భరోసా లేదు. సొంత పొలానికి వెళ్లిన వారిని కూడా చంపేస్తున్నారు.ఊరు వెళదామని బస్సు ఎక్కినా ప్రాణానికి కూడా రక్షణ లేదు. చివరకు ఫ్లైట్ ఎక్కుదామన్నా భయమే. డ్రగ్స్ కేసులో తప్పుడు ఆరోపణలు సృష్టించి మా పార్టీకి అంటగట్టారు. గతంలో పట్టుబడిన డ్రగ్స్ కేసు మాట ఏమిటి?, కూటమి పెద్దలు వైజాగ్ బ్రాండ్ ఇమేజ్‌ను దెబ్బతీయాలని చూస్తున్నారు’ అని విమర్శించారు.


