సాక్షి, విజయవాడ: డిప్యూటీ సీఎం పవన్ అభ్యంతరాలను కూడా చంద్రబాబు లెక్క చేయడం లేదు. లూలూ మాల్‌తో ప్రభుత్వం ఎంవోయూ కుదుర్చుకుంది. మల్లవెల్లి ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్‌పై ఎంవోయూ జరిగింది. ఇటీవల కేబినెట్‌లో లులూపై పవన్ కల్యాణ్ అభ్యంతరం తెలిపారు. లులూ అతిగా షరతులు పెడుతుందంటూ పవన్ అభ్యంతరం చెప్పారు. కేబినెట్‌లో లూలూపై సీఎం సీరియస్ అయినట్టు డ్రామాకు తెరతీశారు. పవన్ అభ్యంతరాలు లెక్క చేయకుండా లులుతో ఎంవోయూ చేసుకుంది. వందల కోట్ల భూములు కారు చౌకగా విశాఖలో అప్పగించనుంది.
మరో వైపు జనసేన పార్టీలో భూమి గోల సాగుతోంది. తనదాకా వస్తే కానీ విషయం అర్థం కాలేదన్నట్లు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కు జనసేన ఎమ్మెల్యేల దౌర్జన్యాలు స్పష్టంగా తెలిసొచ్చాయి. తన సన్నిహితుడు తలదూర్చిన భూ వ్యవహారంలోనూ స్థానిక ఎమ్మెల్యే దౌర్జన్యం చేయడంతో ఏకంగా స్థానిక తహసీల్దారు, సీఐలపై వేటు వేయడంతో పాటు ఎమ్మెల్యేకు వార్నింగ్ ఇచ్చే వరకు వ్యవహారం వెళ్లింది. అంతేకాకుండా కేబినెట్ సమావేశంలోనూ సదరు ఎమ్మెల్యే వ్యవహారాన్ని నేరుగా డిప్యూటీ సీఎం పవన్ ప్రస్తావించాల్సి వచ్చింది.
రూ.350 కోట్ల విలువచేసే 35 ఎకరాల భూ వివాదంలో పవన్ సన్నిహితుడు వర్సెస్ ఎమ్మెల్యేగా మారిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. వివరాల్లోకి వెళితే.. అచ్యుతాపురం మండలం దుప్పితూరు గ్రామం బోగాపురం రెవెన్యూ పరిధిలోని సర్వే నెంబర్లు 40/2, 30,31,39, 461/2,5,7, 477, 488, 490/1, 490/2, 52,54,56,60/2, 103, 112, 113, 114/3లోని 35 ఎకరాలకుపైగా ఉన్న భూ వ్యవహారంలో 1993 నుంచి పీఆర్‌ఎస్ నాయుడు, పైలా వెంకటస్వామి మధ్య వివాదం నడుస్తోంది.


