అభివృద్ధి ముసుగులో కూటమి సర్కారు భూ పందేరం
టెండర్లు, బిడ్లు లేకుండా డీపీఆర్‌ల ఆధారంగా సంతర్పణ
ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి విలువైన ప్రభుత్వ ఆస్తులు..
డీపీఆర్ ప్రకారం నిర్మాణాలు చేయకున్నా భూములు వెనక్కి తీసుకోవడం కష్టమే!
కేవలం రూ.50 లక్షల పెట్టుబడి చూపిస్తే ఖరీదైన ప్రాంతాల్లో మూడెకరాలు ఇచ్చేస్తారట
పర్యాటక ఆస్తులను అప్పనంగా అనుయాయులకు దోచిపెట్టే కుట్ర
ఇప్పటికే 3,913.96 ఎకరాల పర్యాటక భూముల వివరాలతో నోటిఫికేషన్
సాక్షి, అమరావతి: టూరిజం అభివృద్ధి ముసుగులో విలువైన పర్యాటక భూములను పప్పుబెల్లాల మాదిరిగా టీడీపీ పెద్దల సన్నిహితులకు కట్టబెట్టేందుకు రంగం సిద్ధమైంది! అత్యంత ఖరీదైన పర్యాటక భూములతో పాటు ఇతర శాఖలకు చెందిన భూములను కూటమి సర్కారు టెండర్లు లేకుండా ప్రైవేట్ వ్యక్తులకు ధారాదత్తం చేస్తోంది. విశాఖ, విజయవాడ, తిరుపతి లాంటి ఆధ్యాత్మిక క్షేత్రాలతో పాటు రాష్ట్రం నలుమూలల జాతీయ రహదారులకు ఆనుకుని ఉన్న భూములను అప్పనంగా దోచిపెడుతోంది.
కొండలు, కోనలు, సముద్ర తీరం, ఘాట్ ప్రాంతాల్లోని భూములను పెట్టుబడుల పేరుతో సంతర్పణ చేసేందుకు రోడ్ మ్యాప్ రూపొందించింది. హోటళ్లు, రిసార్టులు, వెల్‌నెస్ సెంటర్లు, వినోద పార్కుల ఏర్పాటుకు, టెండర్లు, బిడ్లతో పని లేకుండా డీపీఆర్ ఆధారంగా భూములు కట్టబెట్టి ప్రోత్సాహకాలు విడుదలకు ఏకంగా జీవో 41 విడుదల చేయడం చర్చనీయాంశమైంది. భూ కేటాయింపులపై తాజాగా యూనిఫాం ఫ్రేమ్‌వర్క్ విడుదలైంది.
రూ.50 లక్షలకే ఖరీదైన చోట మూడు ఎకరాలా?
టీడీపీ కూటమి సర్కారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ పర్యాటకాభివృద్ధి సంస్థ (ఏపీటీడీసీ) దివాళా అంచున నిలిచింది. ఏపీటీడీసీకి చెందిన ఒక్క ఆస్తిని (హోటళ్లు) కూడా మిగల్చకుండా లీజు పేరుతో ప్రైవేటు వ్యక్తులకు అప్పగిస్తోంది. ఈ క్రమంలోపర్యాటక సంస్థకు చెందిన 3,913.96 ఎకరాల భూమిని నోటిఫై చేసిన చంద్రబాబు సర్కారు.. డీపీఆర్‌లతో వస్తే చకచకా కేటాయింపులు చేస్తామని ఉత్తర్వులు జారీ చేసింది.
ప్రాజెక్టు విలువను బట్టి భూములు కేటాయింపులపై మార్గదర్శకాలు విడుదల చేసి భూ పందేరానికి సిద్ధమైంది. విచిత్రం ఏమిటంటే.. 3 స్టార్ హోటల్ కడతామంటూ రూ.50 లక్షలతో ముందుకొస్తే ఏకంగా మూడు ఎకరాల వరకు భూములు కేటాయించే వెసులుబాటు కల్పించడం, అంటే ఎకరం రూ.16.60 లక్షలకే దొరుకుతోంది. నగరాల్లో ఖరీదైన చోట్ల భూములను కారుచౌకగా కట్టబెడుతుండటం అనుమానాలకు తావిస్తోంది. అ్రల్టామెగా/మార్క్యూ ప్రాజెక్టులకు అయితే ప్రత్యేక వెసులుబాటు కల్పించి ఒక్కోదానికి ఒక్కో విధంగా భూ కేటాయింపులు, ప్రోత్సాహకాలు ఇవ్వనుంది.
టెండర్లు లేకుండా..
నీతి ఆయోగ్, కేంద్ర ప్రభుత్వ టెండర్ విధానాలను తోసిపుచ్చి పీపీపీ పేరుతో పర్యాటక భూములను కూటమి సర్కారు పందేరం చేస్తోంది. ఖరీదైన భూములను దక్కించుకున్న అనంతరం ప్రాజెక్టు ముందుకు సాగకున్నా సంబంధిత సంస్థపై చర్యలు తీసుకోలేని నిస్సహాయ పరిస్థితుల్లోకి అధికార యంత్రాంగాన్ని నెట్టేసింది. భూమిని తిరిగి స్వాదీనం చేసుకోవాలంటే మధ్యవర్తిత్వం, న్యాయ పోరాటమే శరణ్యం!
అదే టెండర్ల వ్యవస్థ ఉంటే పారదర్శకతకు పెద్దపీట, తప్పులు చేస్తే జరిమానా విధించే అవకాశం ఉంటుంది. పైగా భూమి ప్రభుత్వ నియంత్రణలో ఉంటుంది. లాటరీ పద్ధతిలో విలువైన భూములు పంచిపెట్టేందుకు సన్నాహాలు చేస్తోంది. ఆ భూములపై పెట్టుబడిదారులు రుణాలు తీసుకుంటే బ్యాంకులకు అనుకూలంగా నిబంధనలు రూపొందించడం గమనార్హం.
నచ్చినవారికి పందేరం..
టెండర్లు లేకుండా కేవలం డీపీఆర్ ఆధారంగా పర్యాటక ప్రాజెక్టులకు భూములు కేటాయిస్తామని ప్రభుత్వం పేర్కొంది. ఒక ప్రాంతంలో హోటల్/రిసార్టుల నిర్మాణానికి ఎక్కువ మంది ముందుకొస్తే సంస్థ బ్రాండింగ్, పెట్టుబడి, ఉపాధి కల్పన ఆధారంగా కేటాయిస్తామని చెబుతోంది. కాగితాలపై అధిక పెట్టుబడులు చూపిస్తూ మాయాజాలానికి తెర తీశారని, ఇదంతా టీడీపీ పెద్దల సన్నిహితులకు లబ్ధి చేకూర్చే ఎత్తుగడగా నిర్మాణ రంగ నిపుణులు అభివర్ణిస్తున్నారు.
దేశంలో సిమెంట్, ఇనుము, ఇటుక లాంటి వాటి రేట్లు దాదాపు ఒకేలా ఉన్నప్పటికీ నిర్మాణ ఖర్చులు ఎక్కువగా చూపించి భారీ ప్రాజెక్టు చేపట్టినట్లు మభ్యపుచ్చే యత్నమని పేర్కొంటున్నారు. ఆతిథ్య రంగంలో ఎలాంటి అనుభవం లేని సంస్థలకు కన్సార్షియం ముసుగులో చంద్రబాబు సర్కారు భూముల పందేరానికి తెర తీసిందని స్పష్టం చేస్తున్నారు.



