సాక్షి, రాజోలు: పొట్టకూటి కోసం ఉత్సవాల్లో వేషధారణలు వేసి భక్తులను ఆనందింపజేసే కళాకారిణి ప్రమాదవశాత్తు భవనం మెట్లపై నుంచి జారిపడి మృతి చెందింది. ఈ ప్రమాదంలో రాజమహేంద్రవరానికి చెందిన పాలపర్తి భవ్యశ్రీ (17) ప్రాణాలు కోల్పోయింది. రాజోలు మండలం శివకోటి ముసలమ్మతల్లి ఉత్సవాల ప్రారంభంలో ఈ అపశ్రుతి చోటుచేసుకుంది. గురువారం శివకోటి ముసలమ్మతల్లి అమ్మవారి ఉత్సవాల ప్రారంభాన్ని పురస్కరించుకుని రాజమహేంద్రవరం నుంచి పలువురు కళాకారులు శివకోటి చేరుకున్నారు.
వీరంతా వేషధారణల కోసం ఆలయానికి ఎదురుగా ఉన్న మూడు అంతస్తుల కల్యాణ మండప భవనంలోనికి వెళ్లారు. ఈ క్రమంలో తెల్లవారుజామున భవ్యశ్రీ ప్రమాదవశాత్తు కల్యాణ మండపం మెట్లపై నుంచి జారిపడి తలకు బలమైన గాయమైంది. ఆమెను హుటాహుటీన రాజోలు ప్రభుత్వాస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్టు వైద్యులు ధ్రువీకరించారు. సహ కళాకారిణి మృతిపై సహచరులు, మృతురాలి తల్లి చినపాప ఆస్పత్రి వద్ద రోదించిన తీరు కంటతడి పెట్టించింది. యువతి బంధువులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై రాజేష్‌కుమార్ తెలిపారు. యువతి మృతదేహానికి రాజోలు ప్రభుత్వాస్పత్రిలో పోస్టుమార్టమ్ నిర్వహించారు.
అసంపూర్తి భవనంలో బసపై అగ్రహం
అసంపూర్తిగా నిర్మించిన కల్యాణమండపంలో కళాకారులకు బస ఏర్పాటు చేయడంపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేశారు. భవనం మెట్లకు రెయిలింగ్ లేకపోవడంతో ఈ ప్రమాదం జరిగిందన్నారు. ఉత్సవ కమిటీ నిర్లక్ష్యం వల్లే కళాకారిణి మృతి చెందిందని వారు వాపోయారు.


