మళ్లీ కేసీఆర్‌ మార్కు రాజకీయం! | KSR Comment on KCR Reentry Mark Politics | Sakshi
Sakshi News home page

మళ్లీ కేసీఆర్‌ మార్కు రాజకీయం!

Dec 26 2025 10:07 AM | Updated on Dec 26 2025 10:07 AM

KSR Comment on KCR Reentry Mark Politics

చాలాకాలం తరువాత తెలంగాణ రాజకీయ యవనికపై మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు తనదైన రీతిలో మెరిశారు. భాష, భావ వ్యక్తికరణ, హాహాభావాల ప్రదర్శనలో ఆయనకు ఆయనే సాటి. తెలంగాణ యాసను తనదైన శైలిలో ప్రయోగిస్తూ పంచ్ డైలాగులతో ఆకట్టుకుంటారు. ఆసక్తికరంగా... ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఈ విషయంలో తక్కువేమీ తినలేదు అని చెప్పాలి.. 

కేసీఆర్‌ ప్రభుత్వాన్ని ఓడించడంతో వచ్చిన ఆత్మవిశ్వాసమో ఏమో కానీ... అవకాశం వచ్చినప్పుడల్లా కేసీఆర్‌పై విరుచుకు పడుతుంటారు. గత ఆదివారం వీరిద్దరు పరస్పర విమర్శల బాణాలు ప్రయోగించారు. పంచాయతీ ఎన్నికలలో బీఆర్‌ఎస్‌కు ఆశాజనకమైన ఫలితాలు రావడం కేసీఆర్‌లో ఉత్సాహం నింపి ఉండవచ్చు. పార్టీ ఎమ్మెల్యేల,ఎమ్మెల్సీలతో సుదీర్ఘ సమావేశాన్ని నిర్వహించి ఆ తరువాత మీడియాతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన ద్విముఖ వ్యూహం అమలు చేసినట్లు కనిపిస్తుంది. ఒకటి నీళ్ల సెంటిమెంట్ రాజకీయం, మరొకటి కాంగ్రెస్ ప్రభుత్వ తీరును ఎండగట్టడం. 

రేవంత్ మాత్రం కేసీఆర్‌ అసెంబ్లీకి వచ్చి నీటి కేటాయింపులపై చర్చించాలని సవాల్ చేయడమే కాక, మొత్తం సమస్యలకు కేసీఆర్‌ కారణమని వాదించారు. అయితే కాంగ్రెస్ ఎన్నికల హామీల అమలు జోలికి పోకుండా కేసీఆర్‌పై వ్యక్తిగత విమర్శలకు ప్రాధాన్యం ఇచ్చారు. కేసీఆర్‌ కుటుంబ పరిణామాలను వాడుకోవడం ద్వారా రాజకీయం చేయడానికి యత్నించినట్లు కనబడుతోంది.  

కేసీఆర్‌ వాదనలోని బలాబలాలు చూద్దాం.. కృష్ణా జలాల విషయంలో తెలంగాణకు అన్యాయం జరుగుతోందని, రెండేళ్లలో పాలమూరు-రంగారెడ్డి నీటి పారుదల ప్రాజెక్టుకు సంబంధించి తట్టెడు మట్టి తీయలేదని, దీనిపై ప్రజా యుద్ధం చేస్తామని కేసీఆర్‌ ప్రకటించారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఒత్తిడితోనే కేంద్రం డీపీఆర్‌ను వెనక్కి పంపిందని ఆరోపించారు. అంతేకాకుండా... 45 టీఎంసీల నీరు కేటాయిస్తే చాలని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి కేంద్రానికి లేఖ రాశారని విమర్శించారు. ఏపీ ప్రభుత్వం గోదావరి జలాలను అక్రమంగా వాడుకుంటున్నా ప్రభుత్వం పెద్దగా స్పందించడం లేదని ధ్వజమెత్తారు. ఇదే క్రమంలో బీజేపీపై కూడా విరుచుకుపడుతూ తెలంగాణకు పట్టిన శని అని వ్యాఖ్యానించారు.  బీజేపీ లోక్ సభ ఎన్నికలలో ఎనిమిది సీట్లు గెలుచుకున్నా పంచాయతీ ఎన్నికలలో బీఆర్‌ఎస్‌ పార్టీనే  బాగా ముందంజలో ఉంది. దాంతో బీజేపీ ప్రభావాన్ని మరింత తగ్గించడానికి ఆయన ఈ వ్యాఖ్యలు చేసినట్లు కనిపిస్తోంది. 

తెలంగాణ ఉద్యమం ప్రధానంగా నీళ్లు, నిధులు, నియామకాల నినాదాలతో సాగింది. ఈ మూడింటిలో నీళ్ల సెంటిమెంట్ ప్రజలను బాగా కదిలించింది. తెలంగాణకు రావల్సిన నీటి వాటా రావడం లేదని, ఏపీకి నీళ్లు తరలిపోతున్నాయని ఆరోపించేవారు. కేసీఆర్‌ చేస్తానన్న ప్రజా ఉద్యమం ఎంతమేరకు ప్రజలను ప్రభావితం చేస్తుందన్నది అప్పుడే చెప్పలేం. ఇప్పుడు ఇలాంటి సెంటిమెంట్లు ఎంతవరకు ఉపయోగపడతాయన్నది సందేహమే. కాకపోతే ఆ పేరుతో రాజకీయంగా సభలు నిర్వహించడానికి కేసీఆర్‌ దీనిని ఒక అవకాశంగా వాడుకునే యోచన చేసినట్లుగా ఉంది. నీటి  సమస్యను సెంటిమెంట్ కోసం ఆయన మాట్లాడినా.. అసలు లక్ష్యం రేవంత్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు చేయడమే. 

తెలంగాణ, ఏపీ నేతలు నీటిని ఎంత సమర్థంగా వాడుతున్నారన్నది పక్కబెడితే, అవసరమైనప్పుడల్లా రాజకీయ ప్రయోజనాల కోసం ప్రయత్నిస్తుంటారు. ఇప్పుడు కూడా ఆ ధోరణినే అనుసరించినట్లు అనిపిస్తోంది. ఏపీలో చంద్రబాబు ప్రభుత్వం ప్రతిపాదించిన పోలవరం-నల్లమల సాగర్ ప్రాజెక్టు అక్కడి ప్రజలను మభ్యపెట్టడానికే అన్నది ఎక్కువ మంది భావన. అయినా తెలంగాణ నేతలు అలాంటి వాటిని బూచిగా చూపించే యత్నం చేస్తుంటారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని సర్వభ్రష్ట సర్కార్ గా కేసీఆర్‌ అభివర్ణించారు. తన ప్రభుత్వాన్ని ఓడించడానికి కాంగ్రెస్ అబద్దపు వాగ్దానాలు ఇచ్చిందని చెబుతూ ఆ జాబితాను చదివారు. 

ఆరు గ్యారంటీల పేరుతో కాంగ్రెస్ ప్రజలకు హామీ ఇవ్వడమే కాకుండా, బాండ్ పత్రాలను సైతం ప్రజలకు అంద చేసింది. కాని అధికారంలోకి వచ్చాక వాటిలో కొన్నిటిని మాత్రమే చేయగలిగారు. వృద్ధాప్య ఫించన్‌ రూ.నాలుగు వేలు, కళ్యాణలక్ష్మి కింద రూ.లక్షతో పాటు తులం బంగారం, దళిత బంధు కింద రూ.12 లక్షలు మొదలైన హామీలను ప్రస్తావించి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని  ప్రశ్నించారు. అదే టైమ్ లో ఫ్యూచర్ సిటీని రియల్ ఎస్టేట్ దందా తప్ప మరొకటి కాదని,  తాము తెచ్చిన ఫార్మాసిటీని వంతారా, జూ పార్కులకు కేటాయించాలన్న ఆలోచనను ఆయన తప్పుపట్టారు. అయితే.. 

ఈ ప్రెస్‌మీట్లో తోలు తీస్తా..అంటూ తన స్టైల్ లో  కొన్ని పరుష పదాలను ఆయన వాడారు. గ్లోబల్ సమ్మిట్ జరిగిన తీరును ఆక్షేపించి అచ్చం గురువు చంద్రబాబు బాటలోనే రేవంత్ వెళుతున్నారని, విశాఖలో గత టర్మ్‌లో చంద్రబాబు సర్కార్ సమ్మిట్ నిర్వహించి రూ.20 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని ప్రచారం చేసిందని, ఆచరణలో పదివేల కోట్లు కూడా రాలేదని ఆయన అన్నారు. విశాఖలో హోటల్‌ ఉద్యోగులకు సూట్లు తొడిగి తీసుకు వచ్చారని ఎద్దేవా చేశారు. నదీ జలాల ఇష్యూపైనే కేంద్రీకరించినట్లు కనిపించినా, మొత్తం రేవంత్ ప్రభుత్వాన్ని  దాదాపు అన్ని అంశాలలో కడిగిపారేశారు. అయితే.. తనకు  ఇబ్బంది కలిగించే కాళేశ్వరం, ఫోన్ టాపింగ్  తదితర కొన్ని అంశాలను కేసీఆర్‌ ప్రస్తావించలేదు. అసెంబ్లీకి వెళ్లేది, లేనిది చెప్పలేదు.  

కేసీఆర్‌ విమర్శలకు రేవంత్ బదులు ఇస్తూ తొలుత శాసనసభకు వచ్చి నదీ జలాలపై చర్చించాలని సవాల్ చేశారు. సభలో కేసీఆర్‌ గౌరవానికి భంగం కలగకుండా చూస్తానని భరోసా ఇచ్చారు. ఇది కొంత అనుమానాలకు తావిస్తుంది. గతంలో కేసీఆర్‌ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రేవంత్ తదితరులు అసెంబ్లీ బహిష్కారం వంటి కొన్ని ప్రత్యేక సమస్యలు ఎదుర్కున్నారు. ఆ నేపథ్యంలో కేసీఆర్‌పై కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఒంటికాలి మీద లేచే అవకాశం లేకపోలేదు. అందువల్లే కేసీఆర్‌ అసెంబ్లీకి వెళ్లడానికి కాస్త జంకుతున్నట్లు అనిపిస్తుంది. తాజాగా నీటి సెంటిమెంట్‌ను వాడుకోవడానికి  శాసనసభకు వెళ్లవచ్చన్న సంకేతాలు వస్తున్నాయి. నదీ జలాల సమస్యకు, తెలంగాణ ఎదుర్కుంటున్న ఆర్థిక సమస్యలకు కేసీఆర్‌ కారణమన్న ప్రచారాన్ని ప్రజల ముందు పెట్టడానికి రేవంత్  బృందం ప్రయత్నిస్తోంది. 

కంటోన్మెంట్, జూబ్లిహిల్స్ ఉప ఎన్నికలు, పంచాయతీ ఎన్నికలలో కాంగ్రెస్ గెలుపు ఆధారంగా కేసీఆర్‌ వాదనను రేవంత్ తప్పుపడుతున్నారు. ఈ క్రమంలో కేసీఆర్‌ను ఆర్థిక ఉగ్రవాదిగా పోల్చడం కచ్చితంగా అభ్యంతరకరకమైన అంశమే. తన చావు కోరతారా అని కేసీఆర్‌ చేసిన వ్యాఖ్యకు బదులుగా ఆయన ఆరోగ్యంగా ఉండాలని, ఆయన కుటుంబ సభ్యులతోనే ప్రమాదం ఉందని, కేటీఆర్‌, హరీశ్‌ రావుల మధ్య విబేధాలు ఉన్నట్లు చిత్రీకరించడానికి రేవంత్ యత్నించారు. అలాగే కేసీఆర్‌ కుమార్తె కవిత బీఆర్‌ఎస్‌కు దూరమైన వైనాన్ని రేవంత్ తనకు అనుకూలంగా మలచుకోవడానికి కృషి చేస్తున్నారు. అయితే.. 

కేసీఆర్‌ వ్యాఖ్యలు వయసు తగ్గట్లు లేవని, ఆయన తమలపాకుతో కొడితే, తాను తలుపు చెక్కతో కొట్టగలనని రేవంత్ తన వ్యూహాన్ని చెప్పకనే చెప్పారు. కేసీఆర్‌ నిజంగానే వచ్చే రోజుల్లో బాగా యాక్టివ్ అయితే వీరిద్దరి మద్య హోరాహోరీ మాటల యుద్దం జరిగే అవకాశం ఉంటుంది. కేసీఆర్‌ తెలంగాణ సెంటిమెంట్‌ను, ప్రభుత్వ వైఫల్యాల అంశాల ఆధారంగా భవిష్యత్తు రాజకీయం చేయడానికి సిద్దపడుతున్నట్లు అనిపిస్తోంది. కేసీఆర్‌ కుటుంబంలో ఏర్పడిన పరిణామాలు, కేసీఆర్‌ ప్రభుత్వంలో జరిగిన తప్పులు తదితర అంశాలను అస్త్రాలుగా వాడుకుని రాజకీయం చేయడానికి రేవంత్ రెడీగా ఉన్నట్లు కనిపిస్తుంది. కేసీఆర్‌ సెంటిమెంట్ రాజకీయాలు, కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలు బీఆర్‌ఎస్‌కు ప్రయోనం కలిగిస్తాయా?లేక  గత ప్రభుత్వంలో జరిగినట్లు చెబుతున్న అక్రమాలపై రేవంత్ ప్రభుత్వం చేసే ప్రచారం ఫలిస్తుందా?అన్నది తెరపై చూడాలి.

::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్‌ జర్నలిస్ట్‌, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement