కొందరు తారలు ఫస్ట్ సినిమాకే క్లిక్ అవుతుంటారు.. మరికొందరు పెద్ద బ్లాక్‌బస్టర్ హిట్ కొడితే కానీ క్లిక్ అవరు. కానీ, మరాఠి నటి గిరిజ ఓక్ (Girija Oak Godbole) సోషల్ మీడియా వల్ల సడన్‌గా పాపులర్ అయిపోయింది. హిందీ, మరాఠి, కన్నడ భాషల్లో పలు సినిమాలు చేసిన ఈ బ్యూటీ కొద్దిరోజులుగా సోషల్ మీడియాలో సెన్సేషన్ అయిపోయింది. ఎక్కడ చూసినా ఆమె ఇంటర్వ్యూ క్లిప్పింగ్సే కనిపిస్తున్నాయి.
చాలా హ్యాపీ..
ఇలా సడన్‌గా వైరల్‌గా మారడంపై సంతోషం వ్యక్తం చేసింది గిరిజ. అయితే తన ఫోటోలు మార్ఫింగ్ చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసింది. ఈ మేరకు ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ వీడియో షేర్ చేసింది. అందులో గిరిజ మాట్లాడుతూ.. ఆన్‌లైన్‌లో నాకు వస్తున్న సడన్ అటెన్షన్ చూసి షాకైపోయాను. చాలామంది నన్ను ఎంతగానో ప్రేమిస్తున్నారు. గ్యాప్ లేకుండా ఫోన్ కాల్స్, మెసేజ్‌లు వస్తూనే ఉన్నాయి. ఈ ప్రేమ చూస్తుంటే ఎంతో సంతోషంగా ఉంది. కొన్ని మీమ్స్ చూస్తుంటే భలే సరదాగా ఉన్నాయి.

నా 12 ఏళ్ల కొడుకుస్తే..
కానీ కొన్ని మీమ్స్‌లో మాత్రం ఏఐ (కృత్రిమ మేధ)ను ఉపయోగించి నా ఫోటోలు మార్ఫింగ్ చేస్తున్నారు. అవి చూడటానికి కూడా చాలా అసౌకర్యంగా ఉన్నాయి. ఆ ఎడిటింగ్స్ అస్సలు బాగోలేవు. ఏదైనా వైరలయితే చాలు ఇలా ఏవేవో ఇష్టమొచ్చినట్లు ఎడిట్లు చేస్తుంటారు. దీనికి హద్దులు, పరిమితులంటూ ఏవీ ఉండవు. అదే నాకు వచ్చిన పెద్ద సమస్య! నాకు 12 ఏళ్ల కొడుకున్నాడు. ప్రస్తుతానికైతే వాడు సోషల్ మీడియా వాడడు. కానీ, రేప్పొద్దున వాడు కూడా ఈ ఆన్‌లైన్ ప్రపంచంలో అడుగుపెట్టక మానడు.
చీప్ ట్రిక్స్ మానుకోండి
అప్పుడు నా మార్ఫింగ్ ఫోటోలు వాడి కంట పడతాయని భయంగా ఉంది. మా అమ్మ అభ్యంతరకర ఫోటోలు సోషల్ మీడియాలో ఉన్నాయేంటి? అని వాడు బాధపడతాడన్న ఆలోచనే నన్ను మరింత ఆందోళనకు గురి చేస్తోంది. వ్యూస్ కోసమే మీరిలాంటి అసభ్య ఫోటోలు సృష్టిస్తున్నారన్న విషయం అందరికీ తెలుసు. ఇలాంటి చీప్ ట్రిక్స్ మానుకోండి. ఒకమ్మాయి ఫోటోలను ఇలా ఎడిట్ చేసే ముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించండి.
అంతకంటే ఏం కావాలి!
అలాంటి ఎడిటింగ్ ఫోటోలను చూసి ఆస్వాదించేవారు కూడా ఈ తప్పుడు పనిలో భాగమైనట్లే లెక్క! దయచేసి అలాంటివి ఆపేయండి. ఇదంతా పక్కనపెడితే సడన్‌గా వచ్చిన ఈ పాపులారిటీ వల్ల ఎక్కువమంది జనాలు నా సినిమా, సిరీస్‌లు చూస్తే అంతే చాలు అని వీడియో ముగించింది. గిరిజ ఓక్... హిందీలో తారే జమీన్ పర్, షోర్ ఇన్ ద సిటీ, జవాన్, ద వ్యాక్సిన్ వార్, ఇన్‌స్పెక్టర్ జిండె సినిమాలు చేసింది.


