కొంతమంది నటులకు వంక పెట్టాల్సిన పనుండదు. సినిమా బాగున్నా, బాలేకపోయినా వారి నటన మాత్రం అద్భుతం అనేలా ఉంటుంది. అలాంటి నటుడే దుల్కర్ సల్మాన్. మలయాళ స్టార్ మమ్ముట్టి తనయుడిగా వెండితెరపై అడుగుపెట్టిన దుల్కర్.. తక్కువకాలంలోనే స్టార్ హీరోగా ఎదిగాడు. మహానటి, సీతారామం, లక్కీ భాస్కర్ చిత్రాలతో తెలుగువారికి సైతం దగ్గరయ్యాడు.
ఆ విమర్శలు చూస్తుంటా..
దుల్కర్ సల్మాన్ (Dulquer Salmaan) ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ మూవీ కాంత. సెల్వమణి సెల్వరాజ్ దర్శకత్వం వహించిన ఈ మూవీ నవంబర్ 14న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా దుల్కర్ ఓ మీడియా ఛానల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చాడు. అందులో ఆయన మాట్లాడుతూ.. నేను గొప్ప నటుడినని అనుకోవడం లేదు. నేను సరిగా యాక్ట్ చేయలేనని విమర్శించే ప్రేక్షకులు ఇప్పటికీ ఉన్నారు. వారి కామెంట్స్ చదివినిప్పుడు నాపై నాకే అనుమానం వేస్తుంది.
వెంటాడే భయం
నిజంగా నేను బాగా నటించడం లేదా? అని చిన్న భయం వెంటాడుతుంది. ఆ భయమే నన్ను మరింత కష్టపడేలా చేస్తుంది. ఇంకా కఠినమైన పాత్రలు ఎంపిక చేసుకునేందుకు దోహదపడుతుంది. కొన్ని సినిమాలు చేసినప్పుడు.. ఆయా పాత్రల్లో నేను తప్ప మరే నటుడూ ఇమడలేడు అని జనం అనుకునేలా చేయాలని మరింత కసిగా కష్టపడతాను అని చెప్పుకొచ్చాడు.
సినిమా
దుల్కర్ సల్మాన్.. 2012లో సెకండ్ షో సినిమాతో కెరీర్ ప్రారంభించాడు. చార్లీ, మహానటి, కురుప్, సీతారామం వంటి చిత్రాలతో స్టార్ హీరోగా విశేష ఆదరణ సంపాదించుకున్నాడు. ప్రస్తుతం ఇతడి చేతిలో ఆకాశంలో ఒక తార సినిమా ఉంది. అలాగే పూజా హెగ్డేతో ఓ మూవీ చేస్తున్నాడు. అలాగే తన చేతిలో మరో మలయాళ సినిమా కూడా ఉంది.
చదవండి: కాంత మూవీ రివ్యూ


