‘మహానటి’, ‘లక్కీ భాస్కర్’ చిత్రాలకు తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైన మలయాళ నటుడు దుల్కర్ సల్మాన్. ఆయన హీరోగా నటించిన తాజా చిత్రం ‘కాంత’. సెల్వరాజ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రానా, సముద్రఖని కీలక పాత్రలు పోషించారు. దుల్కర్‌కి జోడీగా భాగ్యశ్రీ బోర్సే నటించింది. దుల్కర్ సల్మాన్ ‘వేఫేర్ ఫిల్మ్స్ ప్రైవేట్ లిమిటెడ్’, రానా దగ్గుబాటి ‘స్పిరిట్ మీడియా’ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రం నేడు(నవంబర్ 14) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ చిత్రం ఎలా ఉందో రివ్యూలో చూద్దాం.
కథేంటంటే..
ఈ సినిమా కథంతా 1950 బ్యాక్‌డ్రాప్‌లో ఓ స్టార్ హీరో- దర్శకుడి చుట్టూ తిరుగుతుంది. అయ్య(సముద్రఖని) ఓ గొప్ప సీనీ దర్శకుడు. ఆయన డ్రీమ్ ప్రాజెక్ట్ ‘శాంత’. ‘నట చక్రవర్తి’ టీకే మహదేవన్ అలియాస్ టీకేఎం(దుల్కర్ సల్మాన్) హీరోగా ప్రారంభమైన ఈ సినిమా ఓ కారణంగా మధ్యలోనే ఆగిపోతుంది. మళ్లీ ఎనిమిదేళ్ల తర్వాత ఈ కథను టీకే మహదేవన్‌తోనే తెరకెక్కించాల్సి వస్తుంది.
అయ్యకు ఇష్టంలేకపోయినా..ప్రొడ్యూసర్ కారణంగా టీకేఎంతో సినిమా చేసేందుకు ఒప్పుకుంటాడు. కానీ టీకేఎం ఈ సారి ఈ కథ క్లైమాక్స్‌ని మార్చి దానికి ‘కాంత’(Kaantha Review) అనే టైటిల్‌ని ఫిక్స్ చేస్తాడు. అంతేకాదు అయ్యను కేవలం కుర్చీకే పరిమితం చేసి తనకు నచ్చినట్లుగా సినిమాను తీస్తుంటాడు. ఇందులో కొత్త అమ్మాయి కుమారి(భాగ్యశ్రీ) హీరోయిన్. ఆమెను నటిగా తీర్చిదిద్దింది కూడా అయ్యనే. అటు హీరో, ఇటు దర్శకుడి మధ్య ఈగో వార్ జరుగుతున్నప్పటీకీ..సినిమా షూటింగ్ మాత్రం ఆగదు.
చివరి రోజు ఒకే ఒక్క సీన్ మిగిలి ఉండగా..హీరో-దర్శకుడి మధ్య గొడవ జరిగి షూటింగ్ ఆగిపోతుంది. అదే రోజు స్టూడియోలో ఓ హత్య జరుగుతుంది. అది ఎవరిది? ఎందుకు చేశారు? గురు శిష్యులైన అయ్య, టీకేఎం మధ్య ఎందుకు విబేధాలు వచ్చాయి? వీరిద్దరి ఈగోల కారణంగా కుమారికి జరిగిన నష్టం ఏంటి? స్టూడియోలో జరిగిన హత్య కేసును పోలీసు అధికారి ఫీనిక్స్(రానా) ఎలా సాల్వ్ చేశాడు?అనేది తెలియాలంటే సినిమా(Kaantha Review) చూడాల్సిందే.
ఎలా ఉందంటే..
ఇది కల్పిత కథ అని చెప్పినప్పటీకీ..1934-59 మధ్యకాలంలో తమిళంలో సూపర్‌స్టార్‌గా వెలుగొందిన ఎంకే త్యాగరాజ భాగవతార్ జీవితంలో చోటు చేసుకున్న కొన్ని సంఘటలను ఈ సినిమాలో కనిపిస్తాయి. ఈగోతో ఓ దర్శకుడితో గొడవపడడం.. జైలుకు వెళ్లడం.. ఇవన్నీ ఎంకేటీ నిజజీవితంలో జరిగాయి. దర్శకుడు సెల్వరాజ్ ఈ ప్రధాన అంశాలకు కాస్త ఫిక్షనల్ స్టోరీ జోడించి ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు.
దర్శకుడు ఎంచుకున్న కాన్సెప్ట్‌ని తెరపై చూపించడం అంత ఈజీ కాదు. సినిమాలోనే ఓ సినిమా చూపించాలి. అదీ కూడా బ్లాక్ అండ్ వైట్ కాలంనాటి కథ. టెక్నికల్‌గా ఇది కష్టమైనప్పటీకీ.. తెరపై మాత్రం చాలా చక్కగా చూపించారు. ఆ కాలంనాటి సంగీతం, ఆర్ట్‌వర్క్, కలర్ టోన్.. ఈ విషయాల్లో తగిన జాగ్రత్తలు తీసుకొని ప్రేక్షకుడు అప్పటి సినిమా చూస్తున్న ఫీలింగ్ కలిగించారు. ఈ విషయంలో దర్శకుడితో పాటు టెక్నికల్ టీమ్‌ని కూడా అభినందించాల్సిందే.
కానీ ఈ కథను ఆడియన్స్‌ని ఆకట్టుకునేలా రూపొందించడంలో మాత్రం పూర్తిగా సఫలం కాలేదు. దర్శకుడు ఎంచుకున్న పాయింట్.. సినిమా సంబంధిత వర్గాలను మాత్రమే ఆకట్టుకుంటుంది. ఫస్టాఫ్ మొత్తం షూటింగ్ సమయంలో దర్శకుడికి, హీరోకి మధ్య గొడవలు.. వారి ఈగోల వల్ల కింది స్థాయి సిబ్బంది పడే ఇబ్బందులు.. హీరో-హీరోయిన్ల మధ్య ప్రేమ చుట్టూనే కథనం సాగుతుంది. దర్శకుడి- హీరోకి మధ్య విబేధాలు రావడానికి గల కారణం ఏంటనేది పూర్తిగా చెప్పకుండా..అక్కడక్కడ కొన్ని సీన్లను మాత్రమే చూపించడంతో అసలు వీళ్ల మధ్య ఏం జరిగి ఉంటుందనే క్యూరియాసిటీ ప్రేక్షకుల్లో కలుగుతుంది.
ఇంటర్వెల్ సీన్ సెకండాఫ్‌పై ఆసక్తిని పెంచుతుంది. ద్వితాయార్థం మొత్తం హత్య కేసు చుట్టూనే తిరుగుతూ..ఓ సాధారణ మర్డర్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ చూసిన ఫీలింగ్ కలుగుతుంది. పోలీసాఫీసర్‌గా రానా ఎంట్రీ ఇవ్వడంతో కథపై ఆసక్తి పెరుగుతుంది. కానీ ఆయన ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ మాత్రం కొన్ని చోట్ల చిరాకు తెప్పిస్తుంది. ఈ కథ 1950 బ్యాక్‌డ్రాప్‌లో సాగుతున్నప్పటికీ.. రానా ఎపిసోడ్ మాత్రం ప్రస్తుతం కాలాన్నే గుర్తు చేస్తుంది. ఇన్వెస్టిగేషన్‌లో బయటపడే చిన్న చిన్న ట్విస్టులు కథపై మరింత ఆసక్తిని పెంచుతుంది. హంతకుడు ఎవరనేది ముందే ఊహించినా.. ఎందుకు చేశాడనేది మాత్రం గెస్ చేయలేం. క్లైమాక్స్‌లో వచ్చే ఎమోషనల్ సన్నివేశాలు ఆకట్టుకుంటాయి.
ఎవరెలా చేశారంటే..
దుల్కర్ నటన గురించి అందరికి తెలిసిందే. ఎలాంటి పాత్రలోనైనా అవలీలగా నటిస్తాడు. అందులోనూ పిరియాడికల్ బ్యాక్‌డ్రాప్ పాత్రల్లో అయితే జీవించేస్తాడు.1950లలో నాటి సూపర్ స్టార్ టీకే మహాదేవ్ పాత్రలో ఆయన ఒదిగిపోయాడు. కొన్ని సీన్లను చూస్తే.. ఇది దుల్కర్ తప్ప మరే నటుడు చేయలేడు అన్నంతగా ఆయన ఫెర్మార్మెన్స్ ఉంది. దుల్కర్‌తో పోటీపడి నటించారు సముద్ర ఖని, భాగ్యశ్రీ. సముద్రఖని కెరీర్‌లో వన్ ఆఫ్ ది బెస్ట్ ఫెర్మార్మెన్స్‌గా ఈ సినిమా నిలుస్తుందని చెప్పవచ్చు.
తెరపై డైరెక్టర్ అయ్య మాత్రమే కనిపిస్తాడు తప్పితే సముద్రఖని కనిపించడు. ఇక భాగ్యశ్రీ కూడా అంతే. ఇంతవరకు అందాల ప్రదర్శనకు మాత్రమే పరిమితమైన భాగ్యశ్రీ.. ఈ చిత్రంతో నటన పరంగానూ ఆకట్టుకుంది. నటి కుమారి పాత్రలో జీవించేసింది. రానా తెరపై కనిపించేది కాసేపే అయినా..ఉన్నంతలో ఆకట్టుకున్నాడు. మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర ఆకట్టుకున్నారు.
సాంకేతికంగా ఈ సినిమా చాలా బాగుంది. జేక్స్ బిజోయ్ నేపథ్య సంగీతం ఆ సినిమాకు చాలా ప్లస్ అయింది. తనదైన బీజీఎంతో కొన్ని సీన్లకు ప్రాణం పోశాడు. జాను చాంతర్ పాటలు బాగున్నాయి. కథతో భాగంగా ఈ పాటలు వస్తుంటాయి తప్పితే..ఎక్కడా ఇరికించినట్లుగా అనిపించవు. డాని సినిమాటోగ్రఫీ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి.
అప్పటి టైంని రీ క్రియేట్ చేయడంలో తన కెమెరా పనితనాన్ని చూపించాడు. సినిమా చూస్తున్నంత సేపు అప్పటి రోజుల్లోకి వెళతాం. ఆర్ట్‌వర్క్ అద్భుతంగా ఉంది. ఎడిటర్ తన కత్తెరకు ఇంకాస్త పని చెప్పాల్సింది. సెకండాఫ్‌లోని కొన్ని సీన్లను మరింత షార్ప్‌గా కట్ చేయాల్సింది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లు ఉన్నతంగా ఉన్నాయి.
-అంజి శెట్టె, సాక్షి వెబ్‌డెస్క్


