టైటిల్: శంబాల
నటీనటులు: ఆది సాయికుమార్, అర్చన అయ్యర్, రవి వర్మ, మీసాల లక్ష్మణ్, స్వాసిక విజయ్, షీజు మీనన్, శివకార్తిక్ తదితరులు
నిర్మాతలు : మహీధర్ రెడ్డి, రాజశేఖర్ అన్నభీమోజు
దర్శకత్వం: యుగంధర్ ముని
సంగీతం:శ్రీచరణ్ పాకాల
విడుదల తేది: డిసెంబర్ 25, 2025
ఆది సాయికుమార్ ఖాతాలో హిట్ పడి చాలా కాలమైంది. ఈ మధ్య ఆయన నటించిన చిత్రాలన్నీ డిజాస్టర్స్‌గా నిలిచాయి. దీంతో కాస్త గ్యాప్ తీసుకొని సస్పెన్స్ థ్రిల్లర్ ‘శంబాల’తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఇటీవల ఆది ఏ సినిమాకు రానంత హైప్ శంబాలకు వచ్చింది. సినిమా ఫస్ట్ లుక్ నుంచి మొదలు ట్రైలర్ వరకు ప్రతీది ఆసక్తిని పెంచేసింది. భారీ అంచనాల మధ్య నేడు(డిసెంబర్ 25) ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఎలా ఉది? ఆది(aadi saikumar) ఖాతాలో హిట్ పడిందా లేదా? రివ్యూలో చూద్దాం
కథేంటంటే...
ఈ సినిమా కథంతా 1980 నేపథ్యంలో సాగుతుంది. శంబాల అనే గ్రామంలో ఆకాశం నుంచి ఒక ఉల్క పడుతుంది. అదే రోజు ఆ ఊరికి చెందిన రైతు రాములు(రవి వర్మ) ఆవు నుంచి పాలుకు బదులుగా రక్తం వస్తుంది. దీంతో ఆ ఉల్కని ఊరి ప్రజలంతా బండ భూతం అని బయపడారు. ఆ రాయిని పరీక్షించేందుకు డిల్లీ నుంచి ఖగోళ శాస్త్రవేత్త విక్రమ్(ఆది సాయికుమార్) వస్తాడు. చావులోనూ సైన్స్ ఉందనే నమ్మే వ్యక్తి విక్రమ్. అలాంటి వ్యక్తి శంబాలకు వచ్చిన తర్వాత వరుస హత్యలు జరుగుతుంటాయి. రాములుతో సహా పలువురు గ్రామస్తులు వింతగా ప్రవర్తిస్తూ కొంతమందిని చంపి..వాళ్లు చనిపోతుంటారు.
ఇదంతా బండ భూతం వల్లే జరుగుందని సర్పంచ్‌తో సమా ఊరంతా నమ్ముతుంది. విక్రమ్ మాత్రం ఆ చావులకు, ఉల్కకు సంబంధం లేదంటాడు. ఆ రాయిని పరీక్షించే క్రమంలో ఓ రహస్యం తెలుస్తుంది. అదేంటి? అసలు శంబాల గ్రామ చరిత్ర ఏంటి? ఆ గ్రామదేవత కథేంటి? ఊర్లో విక్రమ్‌కి తోడుగా నిలిచిన దేవి(అర్చన ఐయ్యర్) ఎవరు? వింత చావుల వెనుక ఉన్న అసలు నిజం ఏంటి? అనేది తెలియాలంటే థియేటర్స్‌లో శంబాల(Shambhala Review) చూడాల్సిందే.
ఎలా ఉందంటే..
సైన్స్ గొప్పదా? శాస్త్రం గొప్పదా అంటే సరైన సమాధానం చెప్పలేం. కొంతమంది సైన్స్‌ని మాత్రమే నమ్ముతారు. మరికొంత మంది శాస్త్రాలనే నమ్ముతారు. అయితే సైన్స్‌లోనూ శాస్త్రం ఉంది..శాస్త్రంలోనూ సైన్స్ ఉంది అని చాటి చెప్పే చిత్రం శంబాల. దర్శకుడు యుగంధర్ ముని ట్రెండింగ్ సబ్జెక్ట్‌ని ఎంచుకొని.. దాన్ని తెరపై ఆసక్తికరంగా చూపించడంలో సక్సెస్ అయ్యాడు.
అసలు కథ ఏంటో చెప్పకుండా టీజర్, ట్రైలర్ వదిలి ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తించాడు. అదే ఆసక్తితో థియేటర్స్‌కి వెళ్లిన ప్రేక్షకుడి అంతకు మించిన కొత్త విషయాలను పరిచయం చేసి అబ్బురపరిచాడు. సైన్స్, శాస్త్రాల నేపథ్యంలో ఇప్పటికే కొన్ని సినిమాలు వచ్చినా.. ఈ సినిమా కథనం కొత్త అనుభూతిని కలిగిస్తుంది. రొటీన్ కథే అయినా స్క్రీన్‌ప్లే కొత్తగా ఉంటుంది. ప్రతి ఐదారు నిమిషాలకు ఒక థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌ని పరిచయం చేస్తూ.. ఆసక్తికరంగా కథనాన్ని నడిపించారు.
పురాణాల్లోని కథని సాయి కుమార్‌తో వాయిస్ ఓవర్ చెప్పించి.. శంబాల కథను ప్రారంభించారు దర్శకుడు. ఫస్టాఫ్ మొత్తం శంబాల గ్రామం పరిచయం..అక్కడి ప్రజలకు ఎదురయ్యే వింత ఘటనల చుట్టూనే కథనం సాగుతుంది. శంబాల ఊరిలో ఉల్క పడడం..ఆవు నుంచి పాలుకు బదులు రక్తం రావడం.. రైతు రాములు వింతగా ప్రవర్తించడం..ఇలా సినిమా ఆరంభంలోనే ప్రేక్షకుడిని శంబాల ప్రపంచంలోకి తీసుకెళ్లాడు.
ఫస్ట్ సీన్ నుంచే ప్రేక్షకులను భయపెట్టడం స్టార్ట్ చేశాడు. రవివర్మ పాత్ర సన్నివేశాలే భయపెట్టేలా ఉంటే..అంతకు రెండింతలు అన్నట్లుగా మీసాల లక్ష్మణ్ పాత్రకు సంబంధించిన సన్నివేశాలు ఉంటాయి. కల్లు దుకాణంలో వచ్చే యాక్షన్ సీక్వెన్స్ అదిరిపోతుంది. ఇక లక్ష్మణ్ పాత్రకు సంబంధించిన కొన్ని సీన్లు అయితే ప్రేక్షకుడి వెన్నులో వణుకు పుట్టిస్తాయి.
ఇంటర్వెల్ ట్విస్ట్ సెకండాఫ్‌పై ఆసక్తిని పెంచుతుంది. ఇక ద్వితియార్థంలో కథనం మరింత ఆసక్తికరంగా సాగుతుంది. ఊరి సమస్యను తీర్చేందుకు విక్రమ్ చేసే ప్రయత్నాలు మెప్పిస్తాయి. సినిమా ప్రారంభంలో వచ్చే ఒక పాటలోని లిరిక్స్‌కి ఈ కథను ముడిపెట్టిన విధానం బాగుంది. ప్రతీ సీన్ కన్విన్సింగ్ ఉంటుంది. కానీ చాలా చోట్ల రిపీటెడ్‌గా అనిపిస్తాయి. శంబాల గ్రామ చరిత్ర తెలిసిన తర్వాత కథనం ఊహకందేలా సాగుతుంది. ఇంద్రనీల్ పాత్రకు సంబంధించిన ఎపిసోడ్ ఆకట్టుకుంటుంది. క్లైమాక్స్ రొటీన్‌గానే ఉన్నా..అక్కడ వచ్చే ఓ ట్విస్ట్ మాత్రం ఆకట్టుకుంటుంది. సైన్స్‌కి, శాస్త్రాలకు మధ్య సంబంధం ఉందని చెప్పేలా ఆ ట్విస్ట్ ఉంటుంది. ఓవరాల్‌గా రైటింగ్ పరంగా చిన్న చిన్న లోపాలు ఉన్నప్పటికీ.. శంబాల మాత్రం ప్రేక్షకులను మెప్పిస్తుంది. ఆది సినీ కెరీర్‌లో ఇదొక డిఫరెంట్ చిత్రంగా నిలుస్తుంది.
ఎవరెలా చేశారంటే..
సైంటిస్ట్ విక్రమ్ పాత్రలో ఆది ఒదిగిపోయాడు. యాక్షన్‌తో పాటు ఎమోషనల్ సన్నివేశాల్లోనూ చక్కగా నటించాడు. దేవి పాత్రకు అర్చన అయ్యర్ న్యాయం చేసింది. అయితే ఆమె పాత్రను ఇంకాస్త బలంగా తీర్చిదిద్దితే బాగుండేదేమో. ముఖ్యంగా సెకండాఫ్‌లో ఆమెకు బలమైన సన్నివేశాలేవి ఉండవు. రైతు రాములుగా రవివర్మ తనదైన నటనతో భయపెట్టేశాడు.
ఇక మీసాల లక్ష్మణ్‌కి కూడా ఈ సినిమాలో ఓ బలమైన పాత్ర లభించింది. దివ్యాంగుడు కృష్ణగా ఆయన నటన అదిరిపోయింది. కొన్ని చోట్ల కేవలం చూపులతోనే భయపెట్టేశాడు. కానిస్టేబుల్ హనుమంతుగా మధునందన్ బాగా చేశాడు. అతని కూతురిగా చేసిన అమ్మాయి కూడా చక్కగా నటించింది. స్వాసిక విజయ్, శివకార్తిక్, ఇంద్రనీల్, షిజు మీనన్, శైలజ ప్రియలతో పాటు మిగిలిన నటీనటులు కూడా తమ పాత్రల పరిధిమేర చక్కగా నటించారు.
సాంకేతికంగా సినిమా బాగుంది. శ్రీచరణ్ పాకాల నేపథ్య సంగీతం ఈ సినిమాకు మరో ప్రధాన బలం. తనదైన బీజీఎంతో సినిమా స్థాయిని పెంచేశాడు. ప్రవీన్ కె బంగారి సినిమాటోగ్రఫీ బాగుంది. వీఎఫెక్స్ వర్క్ ఈ సినిమాలో తక్కువే ఉన్నా.. చక్కగా కుదిరింది. ఎడిటర్ తన కత్తెరకు ఇంకాస్త పని చెప్పాల్సింది. ఫస్టాఫ్‌లోని కొన్ని సీన్లను మరింత క్రిస్పీగా కట్ చేయాల్సింది. నిర్మాణ విలువలు బాగున్నాయి.
-అంజి శెట్టె , సాక్షి డెస్క్


