breaking news
Shambhala Movie
-
ఆది సాయికుమార్ శంబాల.. తొలి రోజే ఊహించని వసూళ్లు
ఆది సాయికుమార్, అర్చనా అయ్యర్ జోడీగా నటించిన సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ శంబాల. యుగంధర్ ముని దర్శకత్వం వహించారు. ఈ చిత్రాన్ని షైనింగ్ పిక్చర్స్ బ్యానర్లో రాజశేఖర్ అన్నభీమోజు, మహీధర్ రెడ్డి నిర్మించారు. ఈ సినిమా అభిమానుల అంచనాల మధ్య క్రిస్మస్ కానుకగా 25న థియేటర్లలో విడుదలైంది. తొలి రోజే ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద పాజిటివ్ టాక్ తెచ్చుకుంది.ఈ సినిమా మొదటి రోజు కలెక్షన్ల పరంగా అదరగొట్టింది. బాక్సాఫీస్ వద్ద ఫస్ట్ డే రూ.3.3 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు సాధించింది. ఈ విషయాన్ని తెలియజేస్తూ హీరో ఆది సాయికుమార్ పోస్టర్ రిలీజ్ చేశారు. ఈ సినిమాకు మరిన్ని థియేటర్స్ యాడ్ చేయనున్నట్లు వెల్లడించారు. ఈ చిత్రంలో రవి వర్మ, మీసాల లక్ష్మణ్, స్వాసిక విజయ్, షీజు మీనన్, శివకార్తిక్ కీలక పాత్రల్లో నటించారు. ఈ మూవీకి శ్రీచరణ్ పాకాల సంగీతమందించారు. Thanks for your love and support plz do watch #Shambhala in Theatres 🙏❤️ pic.twitter.com/NPe07O79Us— Aadi Saikumar (@iamaadisaikumar) December 26, 2025 -
‘శంబాల’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)
-
‘శంబాల’ మూవీ రివ్యూ అండ్ రేటింగ్
టైటిల్: శంబాలనటీనటులు: ఆది సాయికుమార్, అర్చన అయ్యర్, రవి వర్మ, మీసాల లక్ష్మణ్, స్వాసిక విజయ్, షీజు మీనన్, శివకార్తిక్ తదితరులునిర్మాతలు : మహీధర్ రెడ్డి, రాజశేఖర్ అన్నభీమోజుదర్శకత్వం: యుగంధర్ మునిసంగీతం:శ్రీచరణ్ పాకాలవిడుదల తేది: డిసెంబర్ 25, 2025ఆది సాయికుమార్ ఖాతాలో హిట్ పడి చాలా కాలమైంది. ఈ మధ్య ఆయన నటించిన చిత్రాలన్నీ డిజాస్టర్స్‌గా నిలిచాయి. దీంతో కాస్త గ్యాప్ తీసుకొని సస్పెన్స్ థ్రిల్లర్ ‘శంబాల’తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఇటీవల ఆది ఏ సినిమాకు రానంత హైప్ శంబాలకు వచ్చింది. సినిమా ఫస్ట్ లుక్ నుంచి మొదలు ట్రైలర్ వరకు ప్రతీది ఆసక్తిని పెంచేసింది. భారీ అంచనాల మధ్య నేడు(డిసెంబర్ 25) ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఎలా ఉది? ఆది(aadi saikumar) ఖాతాలో హిట్ పడిందా లేదా? రివ్యూలో చూద్దాంకథేంటంటే...ఈ సినిమా కథంతా 1980 నేపథ్యంలో సాగుతుంది. శంబాల అనే గ్రామంలో ఆకాశం నుంచి ఒక ఉల్క పడుతుంది. అదే రోజు ఆ ఊరికి చెందిన రైతు రాములు(రవి వర్మ) ఆవు నుంచి పాలుకు బదులుగా రక్తం వస్తుంది. దీంతో ఆ ఉల్కని ఊరి ప్రజలంతా బండ భూతం అని బయపడారు. ఆ రాయిని పరీక్షించేందుకు డిల్లీ నుంచి ఖగోళ శాస్త్రవేత్త విక్రమ్(ఆది సాయికుమార్) వస్తాడు. చావులోనూ సైన్స్ ఉందనే నమ్మే వ్యక్తి విక్రమ్. అలాంటి వ్యక్తి శంబాలకు వచ్చిన తర్వాత వరుస హత్యలు జరుగుతుంటాయి. రాములుతో సహా పలువురు గ్రామస్తులు వింతగా ప్రవర్తిస్తూ కొంతమందిని చంపి..వాళ్లు చనిపోతుంటారు. ఇదంతా బండ భూతం వల్లే జరుగుందని సర్పంచ్‌తో సమా ఊరంతా నమ్ముతుంది. విక్రమ్ మాత్రం ఆ చావులకు, ఉల్కకు సంబంధం లేదంటాడు. ఆ రాయిని పరీక్షించే క్రమంలో ఓ రహస్యం తెలుస్తుంది. అదేంటి? అసలు శంబాల గ్రామ చరిత్ర ఏంటి? ఆ గ్రామదేవత కథేంటి? ఊర్లో విక్రమ్‌కి తోడుగా నిలిచిన దేవి(అర్చన ఐయ్యర్) ఎవరు? వింత చావుల వెనుక ఉన్న అసలు నిజం ఏంటి? అనేది తెలియాలంటే థియేటర్స్‌లో శంబాల(Shambhala Review) చూడాల్సిందే.ఎలా ఉందంటే..సైన్స్ గొప్పదా? శాస్త్రం గొప్పదా అంటే సరైన సమాధానం చెప్పలేం. కొంతమంది సైన్స్‌ని మాత్రమే నమ్ముతారు. మరికొంత మంది శాస్త్రాలనే నమ్ముతారు. అయితే సైన్స్‌లోనూ శాస్త్రం ఉంది..శాస్త్రంలోనూ సైన్స్ ఉంది అని చాటి చెప్పే చిత్రం శంబాల. దర్శకుడు యుగంధర్ ముని ట్రెండింగ్ సబ్జెక్ట్‌ని ఎంచుకొని.. దాన్ని తెరపై ఆసక్తికరంగా చూపించడంలో సక్సెస్ అయ్యాడు. అసలు కథ ఏంటో చెప్పకుండా టీజర్, ట్రైలర్ వదిలి ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తించాడు. అదే ఆసక్తితో థియేటర్స్‌కి వెళ్లిన ప్రేక్షకుడి అంతకు మించిన కొత్త విషయాలను పరిచయం చేసి అబ్బురపరిచాడు. సైన్స్, శాస్త్రాల నేపథ్యంలో ఇప్పటికే కొన్ని సినిమాలు వచ్చినా.. ఈ సినిమా కథనం కొత్త అనుభూతిని కలిగిస్తుంది. రొటీన్ కథే అయినా స్క్రీన్‌ప్లే కొత్తగా ఉంటుంది. ప్రతి ఐదారు నిమిషాలకు ఒక థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌ని పరిచయం చేస్తూ.. ఆసక్తికరంగా కథనాన్ని నడిపించారు.పురాణాల్లోని కథని సాయి కుమార్‌తో వాయిస్ ఓవర్ చెప్పించి.. శంబాల కథను ప్రారంభించారు దర్శకుడు. ఫస్టాఫ్ మొత్తం శంబాల గ్రామం పరిచయం..అక్కడి ప్రజలకు ఎదురయ్యే వింత ఘటనల చుట్టూనే కథనం సాగుతుంది. శంబాల ఊరిలో ఉల్క పడడం..ఆవు నుంచి పాలుకు బదులు రక్తం రావడం.. రైతు రాములు వింతగా ప్రవర్తించడం..ఇలా సినిమా ఆరంభంలోనే ప్రేక్షకుడిని శంబాల ప్రపంచంలోకి తీసుకెళ్లాడు.ఫస్ట్ సీన్ నుంచే ప్రేక్షకులను భయపెట్టడం స్టార్ట్ చేశాడు. రవివర్మ పాత్ర సన్నివేశాలే భయపెట్టేలా ఉంటే..అంతకు రెండింతలు అన్నట్లుగా మీసాల లక్ష్మణ్ పాత్రకు సంబంధించిన సన్నివేశాలు ఉంటాయి. కల్లు దుకాణంలో వచ్చే యాక్షన్ సీక్వెన్స్ అదిరిపోతుంది. ఇక లక్ష్మణ్ పాత్రకు సంబంధించిన కొన్ని సీన్లు అయితే ప్రేక్షకుడి వెన్నులో వణుకు పుట్టిస్తాయి.ఇంటర్వెల్ ట్విస్ట్ సెకండాఫ్‌పై ఆసక్తిని పెంచుతుంది. ఇక ద్వితియార్థంలో కథనం మరింత ఆసక్తికరంగా సాగుతుంది. ఊరి సమస్యను తీర్చేందుకు విక్రమ్ చేసే ప్రయత్నాలు మెప్పిస్తాయి. సినిమా ప్రారంభంలో వచ్చే ఒక పాటలోని లిరిక్స్‌కి ఈ కథను ముడిపెట్టిన విధానం బాగుంది. ప్రతీ సీన్ కన్విన్సింగ్ ఉంటుంది. కానీ చాలా చోట్ల రిపీటెడ్‌గా అనిపిస్తాయి. శంబాల గ్రామ చరిత్ర తెలిసిన తర్వాత కథనం ఊహకందేలా సాగుతుంది. ఇంద్రనీల్ పాత్రకు సంబంధించిన ఎపిసోడ్ ఆకట్టుకుంటుంది. క్లైమాక్స్ రొటీన్‌గానే ఉన్నా..అక్కడ వచ్చే ఓ ట్విస్ట్ మాత్రం ఆకట్టుకుంటుంది. సైన్స్‌కి, శాస్త్రాలకు మధ్య సంబంధం ఉందని చెప్పేలా ఆ ట్విస్ట్ ఉంటుంది. ఓవరాల్‌గా రైటింగ్ పరంగా చిన్న చిన్న లోపాలు ఉన్నప్పటికీ.. శంబాల మాత్రం ప్రేక్షకులను మెప్పిస్తుంది. ఆది సినీ కెరీర్లో ఇదొక డిఫరెంట్ చిత్రంగా నిలుస్తుంది.ఎవరెలా చేశారంటే..సైంటిస్ట్ విక్రమ్ పాత్రలో ఆది ఒదిగిపోయాడు. యాక్షన్‌తో పాటు ఎమోషనల్ సన్నివేశాల్లోనూ చక్కగా నటించాడు. దేవి పాత్రకు అర్చన అయ్యర్ న్యాయం చేసింది. అయితే ఆమె పాత్రను ఇంకాస్త బలంగా తీర్చిదిద్దితే బాగుండేదేమో. ముఖ్యంగా సెకండాఫ్‌లో ఆమెకు బలమైన సన్నివేశాలేవి ఉండవు. రైతు రాములుగా రవివర్మ తనదైన నటనతో భయపెట్టేశాడు. ఇక మీసాల లక్ష్మణ్‌కి కూడా ఈ సినిమాలో ఓ బలమైన పాత్ర లభించింది. దివ్యాంగుడు కృష్ణగా ఆయన నటన అదిరిపోయింది. కొన్ని చోట్ల కేవలం చూపులతోనే భయపెట్టేశాడు. కానిస్టేబుల్ హనుమంతుగా మధునందన్ బాగా చేశాడు. అతని కూతురిగా చేసిన అమ్మాయి కూడా చక్కగా నటించింది. స్వాసిక విజయ్, శివకార్తిక్, ఇంద్రనీల్, షిజు మీనన్, శైలజ ప్రియలతో పాటు మిగిలిన నటీనటులు కూడా తమ పాత్రల పరిధిమేర చక్కగా నటించారు.సాంకేతికంగా సినిమా బాగుంది. శ్రీచరణ్ పాకాల నేపథ్య సంగీతం ఈ సినిమాకు మరో ప్రధాన బలం. తనదైన బీజీఎంతో సినిమా స్థాయిని పెంచేశాడు. ప్రవీన్ కె బంగారి సినిమాటోగ్రఫీ బాగుంది. వీఎఫెక్స్ వర్క్ ఈ సినిమాలో తక్కువే ఉన్నా.. చక్కగా కుదిరింది. ఎడిటర్ తన కత్తెరకు ఇంకాస్త పని చెప్పాల్సింది. ఫస్టాఫ్‌లోని కొన్ని సీన్లను మరింత క్రిస్పీగా కట్ చేయాల్సింది. నిర్మాణ విలువలు బాగున్నాయి. -అంజి శెట్టె , సాక్షి డెస్క్ -
శంబాలతో సక్సెస్ కొడతాను: ఆది సాయికుమార్
‘‘రాజశేఖర్, మహీధర్ రెడ్డిగార్లకు నిర్మాతలుగా ‘శంబాల’ తొలి చిత్రమైనా ఎంతో ప్యాషన్‌తో నిర్మించారు. అయితే కథపై నమ్మకంతో నా మార్కెట్‌కి మించి ఎక్కువగానే బడ్జెట్ పెట్టారు. కానీ ఎక్కడా వృథా ఖర్చు చేయలేదు. ఈ నెల 25న చాలా సినిమాలు వస్తున్నాయి...పోటీ బాగా ఉండంతో ప్రమోషన్స్ కూడా భారీ ఎత్తున నిర్వహించారు. ‘శంబాల’ ఔట్పుట్ పట్ల యూనిట్ అంతా చాలా సంతృప్తిగా ఉన్నాం’’ అని ఆది సాయికుమార్ చెప్పారు. ఆయన హీరోగా, అర్చనా అయ్యర్ హీరోయిన్గా నటించిన చిత్రం ‘శంబాల’. యుగంధర్ ముని దర్శకత్వంలో రాజశేఖర్ అన్నభీమోజు, మహీధర్ రెడ్డి నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 25న విడుదల కానుంది. అలాగే డిసెంబరు 23న ఆది పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆది సాయికుమార్ పంచుకున్న విశేషాలు... ⇒ ‘శంబాల’ నుంచి విడుదల చేసిన ఫస్ట్ లుక్ నుంచి మా మూవీపై మంచి బజ్ ఏర్పడింది. దుల్కర్ సల్మాన్ రిలీజ్ చేసిన టీజర్, ప్రభాస్, నానీగార్లు విడుదల చేసిన ట్రైలర్స్ ఆడియన్స్‌లో మా మూవీ పట్ల మంచి బజ్ తీసుకొచ్చాయి. ఈసారి మంచి విజయాన్ని అందుకోబోతున్నామనే నమ్మకం ఉంది. మా సినిమాని అందరూ ఎంజాయ్ చేస్తారనుకుంటున్నాను. 80వ దశకంలో వచ్చే కథ కాబట్టి లుక్స్ విషయంలో చాలా జాగ్రత్త పడ్డాం... అందుకే కాస్ట్యూమ్స్‌ని చాలా సెలెక్టివ్‌గా తీసుకున్నాం. మా సినిమాలో అద్భుతమైనపోరాట సన్నివేశాలున్నాయి. రాజ్‌కుమార్ మాస్టర్ బాగా చూపించారు.⇒ ‘శంబాల’ అనే ప్రాంతం ఉందా? లేదా అనేది ఎవరికీ తెలీదు. మన పురాణాల ప్రకారం శంబాలకి ఓ మంచి గుర్తింపు ఉంది. ఆ టైటిల్ చెప్పినప్పుడు నేను చాలా ఎగ్జయిట్ అయ్యాను. ‘కల్కి’ తర్వాత శంబాల పేరు మరింత ఎక్కువగా ట్రెండ్ అయింది. ఈ మూవీ కోసం యుగంధర్గారు చాలా కష్టపడ్డారు... ఆయన పెద్ద డైరెక్టర్ అవుతారు. శ్రీచరణ్ పాకాల ఆర్ఆర్ చూసి అందరం షాక్ అయ్యాం. సినిమా చూసిన తర్వాత అందరూ నేపథ్య సంగీతం గురించి మాట్లాడుకుంటారు. ప్రస్తుతం ఆడియన్స్‌కు అద్భుతమైన సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ కావాలి. ఇలాంటి జానర్లను ప్రేక్షకులు ఎక్కువగా ఇష్టపడుతున్నారు. ‘శంబాల’ లాంటి చిత్రాన్ని థియేటర్లో చూస్తేనే ఆ ఫీల్‌ను ఎంజాయ్ చేస్తారు.⇒ క్రిస్మస్ అనేది మంచి సీజన్. శ్రీకాంత్‌గారి ఫ్యామిలీతో మాకు మంచి బాండింగ్ ఉంది. రోషన్ తో నాకు మంచి పరిచయం ఉంది. మా ‘శంబాల’తో పాటు రోషన్ నటించిన ‘చాంపియన్’ సినిమా కూడా పెద్ద హిట్ కావాలని కోరుకుంటున్నాను. ఇక ఇన్నేళ్ల నా కెరీర్ పట్ల పూర్తిగా సంతృప్తిగా లేను. ఎందుకంటే అప్ అండ్ డౌన్స్ ఉన్నాయి. ‘శంబాల’తో సక్సెస్ కొడుతున్నాను. ఆ తర్వాత కూడా మంచి కథలు ఎంచుకుంటాను. నేను నటించిన ‘సబ్ ఇన్స్పెక్టర్ యుగంధర్’ సినిమా చాలా బాగా వచ్చింది.. ఇంకా నా పాత్రకు నేను డబ్బింగ్ చెప్పాల్సి ఉంది. ఆ సినిమా త్వరలో విడుదలవుతుంది. -
శంబాలపై పాజిటివ్ వైబ్ ఉంది: కిరణ్ అబ్బవరం
‘‘ఎస్ఆర్ కళ్యాణ మండపం’ సినిమాలో ధర్మపాత్ర కోసం సాయి కుమార్‌గారిని కలిసినప్పుడు ఆయన మాకు చేసిన సపోర్ట్‌ని ఎప్పటికీ మర్చిపోలేను. ఆయన వల్లే నా కెరీర్ బాగుందనుకుంటూ ఉంటాను. ‘శంబాల’ చిత్రంపై ముందు నుంచి పాజిటివ్ వైబ్ ఉంది.. తప్పకుండా అందరికీ నచ్చుతుంది. ఈ మూవీతో ఆదిగారికి మంచి విజయం రావాలి’’ అని కిరణ్ అబ్బవరం తెలిపారు. ఆది సాయికుమార్, అర్చనా అయ్యర్ జోడీగా నటించిన చిత్రం ‘శంబాల’. యుగంధర్ ముని దర్శకత్వంలో షైనింగ్ పిక్చర్స్‌పై రాజశేఖర్ అన్నభీమోజు, మహీధర్ రెడ్డి నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 25న విడుదల కానుంది.హైదరాబాద్‌లో నిర్వహించిన ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి హీరోలు మంచు మనోజ్, కిరణ్ అబ్బవరం, ప్రియదర్శి, అశ్విన్ బాబు, డైరెక్టర్ అనిల్ రావిపూడి, సంగీత దర్శకుడు తమన్, నిర్మాతలు నవీన్ యెర్నేని, టీజీ విశ్వ ప్రసాద్, మైత్రి శశిధర్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. మంచు మనోజ్ మాట్లాడుతూ–‘‘చిన్న సినిమా పెద్ద సినిమా అని ఉండదు.. మంచి చిత్రాల్ని ప్రేక్షకులు ఆదరిస్తూనే ఉంటారు’’ అన్నారు.‘‘సాయికుమార్‌గారి కొడుకుని అని చెప్పుకోవడాన్ని గర్వంగా భావిస్తాను’’ అని ఆది సాయికుమార్ తెలిపారు. ‘‘ఈ చిత్రంతో ఆదికి మంచి విజయం దక్కాలి’’ అన్నారు అనిల్ రావిపూడి. ‘‘శంబాల’తో ఆదికి చిత్రోత్సాహం, నాకు పుత్రోత్సాహం, టీమ్‌కి విజయోత్సాహం రావాలని కోరుకుంటున్నాను’’ అని నటుడు సాయికుమార్ చెప్పారు. ‘‘నా టీమ్ సపోర్ట్ వల్లే సినిమాను ఇంత గొప్పగా తీశాను’’ అని యుగంధర్ ముని పేర్కొన్నారు. -
ఒక్కోటి ఒక్కో జానర్.. ఈ వారం అయినా అద్భుతం జరిగేనా?
ఈ ఏడాది చివరి వారం టాలీవుడ్లో చిన్న, మీడియం రేంజ్ సినిమాల జాతరే కనిపిస్తోంది. క్రిస్మస్ సెలవులు దొరకడంతో పాటు పెద్ద సినిమాలేవి విడుదల కాకపోవడంతో భారీ ఎత్తున చిన్న సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. ఈ నెల 25న ఛాంపియన్, శంబాల, ఈషా, దండోరా చిత్రాలు ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. ఈ నాలుగు సినిమాల జోనర్స్ వేరు వేరుగా ఉండడం గమనార్హం. ఇయర్ ఎండ్‌లో యాక్షన్, హారర్, మిస్టరీ,సోషియయో ఫాంటసీ.. ఇల రకరకాల సినిమాలను ఆడియన్స్‌ని పలకరించబోతున్నాయి. ఇప్పటికే అన్నింటిపైన మంచి అంచనాలే ఏర్పడ్డాయి.శ్రీకాంత్ తనయుడు రోషన్ చాలా గ్యాప్ తర్వాత ‘ఛాంపియన్’తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ప్రదీప్ అద్వైతం దర్శకత్వం వహించిన ఈ యాక్షన్ చిత్రం తెలంగాణలోని బైరాన్ పల్లిలో జరిగిన ఓ వాస్తవ ఘటన ఆధారంగా తెరకెక్కుతుంది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ , పాటలకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది. డిసెంబర్ 25న విడుదల కాబోతున్న ఈ చిత్రంపై భారీ అంచనాలే ఏర్పడ్డాయి.గతకొంత కాలంగా వరుస ఫ్లాపులతో సతమతమవుతున్న ఆది సాయికుమార్.. ఈ సారి మిస్టీరియస్ థ్రిల్లర్ శంబాలతో బాక్సాఫీస్ వద్ద తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నాడు. ఈ మూవీకి యగంధర్ ముని దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో అర్చన అయ్యర్, స్వసిక, రవివర్మ, మధునందన్, శివ కార్తీక్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. శ్రీ చరణ్ పాకాల సంగీతాన్ని అందించారు. ఇప్పటికే శంబాలా నుంచి వచ్చిన టీజర్, ట్రైలర్ సినిమాపై ఆసక్తి పెంచేసి హైప్ క్రియేట్ చేశాయి. డిసెంబర్ 25న భారీ ఎత్తున ఈ చిత్రం విడుదల కానుంది. ఈ చిత్రంలో ఆది హిట్ ట్రాక్ ఎక్కుతాడని దర్శకనిర్మాతలు బలంగా చెబుతున్నారు. ఇటీవల లిటిల్‌హార్ట్స్, రాజు వెడ్స్ రాంబాయి లాంటి సూపర్‌హిట్ కల్ట్ చిత్రాలను ప్రేక్షకులకు అందించిన బన్నీవాస్, వంశీ నందిపాటి ద్వయం తాజాగా 'ఈషా' పేరుతో ఓహారర్ థ్రిల్లర్‌ను ప్రేక్షకుల ముందుకు తీసుకరాబోతున్నారు. వంశీ నందిపాటి ఎంటర్ టైన్ మెంట్స్, బన్నీ వాస్ వర్క్స్ బ్యానర్స్ పై వంశీ నందిపాటి, బన్నీ వాస్ గ్రాండ్‌గా ఈ చిత్రాన్నిడిసెంబరు 25న చిత్రాన్ని థియేట్రికల్ రిలీజ్ చేస్తున్నారు. ఇటీవల రాజు వెడ్స్ రాంబాయి చిత్రంతో సూపర్‌హిట్ కొట్టిన అఖిల్‌రాజ్‌తో పాటు త్రిగుణ్ హీరోలుగా నటిస్తున్న ఈ చిత్రంలో హెబ్బాపటేల్ కథానాయిక. సిరి హనుమంతు, బబ్లూ, పృథ్వీరాజ్ ఇతర ముఖ్యపాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రాన్ని హెచ్‌వీఆర్ ప్రొడక్షన్స్ పతాకంపై ప్రముఖ నిర్మాత కేఎల్ దామోదర ప్రసాద్ సమర్పణలో హేమ వెంకటేశ్వరరావు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శ్రీనివాస్ మన్నె దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం నుంచి ఇటీవల విడుదలైన రెండు ట్రైలర్లు బాగానే భయపెట్టాయి. ఇదే భయంలో థియేటర్స్‌లో పుట్టిస్తే.. సినిమా హిట్ అవ్వడం ఖాయం.మరో చిన్న చిత్రం ‘దండోరా’ కూడా ఈ వారమే రిలీజ్ కానుంది. శివాజీ ప్రధాన పాత్రను పోషించిన ఈ చిత్రాన్ని ‘కలర్ ఫొటో’, ‘బెదురులంక 2012’ వంటి మంచి చిత్రాలను నిర్మించి అందరి దృష్టిని ఆకర్షించిన లౌక్య ఎంటర్టైన్మెంట్స్ అధినేత రవీంద్ర బెనర్జీ ముప్పానేని నిర్మించారు. ఈ చిత్రంలో శివాజీతో పాటుగా నవదీప్, నందు, రవికృష్ణ, మనికా చిక్కాల, మౌనికా రెడ్డి, బిందు మాధవి, రాధ్య, అదితి భావరాజు తదితరులు ముఖ్య పాత్రల్ని పోషించారు. ఈ చిత్రానికి మురళీకాంత్ దర్శకత్వం వహించారు. ఈ మూవీని డిసెంబర్ 25న భారీ ఎత్తున విడుదల చేస్తున్నారు. పల్లెటూరి నేపథ్యంలో తెరకెక్కించిన ఈ చిత్రంపై కూడా మంచి అంచనాలే ఏర్పడ్డాయి. వీటితో పాటు మలయాళం డబ్బింగ్ సినిమా వృషభ కూడా ఈ వారమే రిలీజ్ అవుతుంది. మోహల్ లాల్ కీలక పాత్ర వహించిన ఈ చిత్రంపై కూడా టాలీవుడ్లో భారీ అంచనాలే ఉన్నాయి. మరి వీటిల్లో ఏ చిత్రం విజయం అవుతుందో? ఇయర్ ఎండ్‌లో ఎన్ని అద్భుతాలు క్రియేట్ చేస్తాయో చూడాలి. -
ఆది సాయికుమార్ ‘శంబాల’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)
-
ఆది సాయికుమార్ మిస్టరీ థ్రిల్లర్.. ఆసక్తిగా శంబాల ట్రైలర్
ఆది సాయి కుమార్ హీరోగా వస్తోన్న లేటేస్ట్ హారర్ థ్రిల్లర్ మూవీ 'శంబాల'. ఈ సినిమాకు యగంధర్ ముని దర్శకత్వం వహించారు. షైనింగ్ పిక్చర్స్ బ్యానర్‌పై మహీధర్ రెడ్డి, రాజశేఖర్ అన్నభీమోజులు నిర్మించారు. ఇప్పటికే రిలీజైన సాంగ్స్‌కు ఆడియన్స్‌ను అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. రిలీజ్ తేదీ దగ్గర పడడంతో మూవీ ప్రమోషన్స్‌తో బిజీగా ఉన్నారు మేకర్స్. తాజాగా ఈ మూవీ ట్రైలర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. 'పంచభూతాల్ని శాసిస్తుందంటే ఇది సాధారణమైంది కాదు'.. అనే డైలాగ్‌తో ట్రైలర్ ప్రారంభమైంది. ట్రైలర్ చూస్తుంటే ఓ గ్రామంలో జరిగిన మిస్టరీ సంఘటనలతో తెరకెక్కించినటలు తెలుస్తోంది. ఈ చిత్రంలో అర్చన అయ్యర్, స్వసిక, మధునాదన్, రవివర్మ, మీసాల లక్ష్మణ్ కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమా క్రిస్మస్ కానుకగా థియేటర్లలో సందడి చేయనుంది. ఈ చిత్రానికి శ్రీచరణ్ పాకాలసంగీతమందించారు. -
‘కల్కి’ కంటే ముందే శంబాల టైటిల్‌ని ఫిక్స్ చేశాం
‘‘శంబాల’ సినిమాకి ముందు ఆదితో వేరే కథ అనుకున్నాం. ఇంతలో ‘శంబాల’ కథ రావడంతో ఈ కథతోనే సినిమా చేద్దాం అనుకున్నాం. యుగంధర్ ముని చెప్పిన ఈ కథ అంత బాగా నచ్చింది. డివోషనల్, హారర్ ఎలిమెంట్స్ కనెక్ట్ కావడంతో వెంటనే గ్రీన్‌సిగ్నల్ ఇచ్చి, సినిమా ఆరంభించాం’’ అని నిర్మాతలు రాజశేఖర్ అన్నభీమోజు, మహీధర్ రెడ్డి తెలిపారు. ఆది సాయికుమార్, అర్చనా అయ్యర్ జోడీగా నటించిన చిత్రం ‘శంబాల’. యుగంధర్ ముని దర్శకత్వంలో రాజశేఖర్ అన్నభీమోజు, మహీధర్ రెడ్డి నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 25న విడుదల కానుంది. ఈ సందర్భంగా రాజశేఖర్ అన్నభీమోజు, మహీధర్ రెడ్డి మాట్లాడుతూ– ‘‘ఇండస్ట్రీతో మాకు అనుబంధం ఉంది. పెద్ద సినిమాల వీడియో డీవీడీస్ హక్కులు మా వద్ద ఉండేవి. అలాగే ఓవర్సీస్ డిస్ట్రిబ్యూటర్స్‌గా పని చేశాం. నిర్మాతలుగా ‘శంబాల’ తొలి చిత్రం. ఇందులో హారర్‌తో పాటు సస్పెన్స్, ఎమోషన్స్ ఉంటాయి. ‘కల్కి 2898 ఏడీ’ వచ్చిన తర్వాత ‘శంబాల’ (కల్కిలో శంబాల ప్రపంచం ఉంటుంది) గురించి అందరికీ తెలిసింది. అయితే అంతకు ముందే మేం ఈ టైటిల్‌ని ఫిక్స్ చేశాం. కథపై నమ్మకంతో బడ్జెట్ ఎక్కువైనా రాజీ పడలేదు. మా పెట్టుబడిలో 80 శాతం వరకు బిజినెస్‌తో సేఫ్ జోన్లోకి వచ్చాం.. ఆది, అర్చనా అయ్యర్‌తో పాటు సినిమాలో అన్ని పాత్రలకి ప్రాధాన్యం ఉంటుంది. శ్రీ చరణ్ పాకాల సంగీతం మా సినిమాకు పెద్ద ప్లస్. తెలుగులో రిలీజ్ అయిన వారం రోజుల్లో హిందీలో విడుదల చేస్తాం. మా తర్వాతి సినిమాల కోసం కొన్ని కథలు వింటున్నాం. డిస్ట్రిబ్యూషన్ కూడా కంటిన్యూ చేస్తున్నాం’’ అని చెప్పారు. -
థ్రిల్లర్ రెడీ
ఆది సాయికుమార్, అర్చనా అయ్యర్ జోడీగా నటించిన చిత్రం ‘శంబాల’. ‘ఏ మిస్టిక్ వరల్డ్’ అనేది ఉపశీర్షిక. యుగంధర్ ముని దర్శకత్వంలో రాజశేఖర్ అన్నభీమోజు, మహీధర్ రెడ్డి నిర్మించారు. ఈ నెల 25న ఈ చిత్రం విడుదల కానుంది.ఈ సినిమా నైజాం విడుదల హక్కులను మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూటర్స్ సొంతం చేసుకుంది. ‘‘ఆది నటించిన మరో వైవిధ్యభరితమైన థ్రిల్లర్ మూవీ ‘శంబాల’. ఈ చిత్రం నైజాం హక్కులను భారీ మొత్తం చెల్లించి సొంతం చేసుకుంది మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూటర్స్’’ అని చిత్రయూనిట్ తెలిపింది. -
ఆది సాయికుమార్ 'శంబాల' మూవీ ప్రెస్ మీట్ (ఫొటోలు)
-
విజువల్ వండర్లా 'శంబాల' ట్రైలర్..
టాలీవుడ్ హీరో ఆది సాయికుమార్(Aadi Sai Kumar) నటించిన కొత్త సినిమా ‘శంబాల: ఏ మిస్టికల్ వరల్డ్’(Shambhala)... డిసెంబర్ 25న విడుదల కానున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ క్రమంలో తాజాగా మూవీ ట్రైలర్‌ను ప్రభాస్ రిలీజ్ చేశారు. సూపర్ నేచురల్ థ్రిల్లింగ్‌తో పాటు సిల్వర్ స్క్రీన్‌పై విజువల్ వండర్‌ను క్రియేట్ చేసేలా ట్రైలర్ ఉంది. ఈ సినిమాతో ఆది హిట్ అందుకునేలా ఉన్నాడు. ఇందులో అర్చన అయ్యర్ హీరోయిన్గా నటించగా స్వాసిక, రవివర్మ, మధునందన్, శివ కార్తీక్ కీలక పాత్రల్లో నటించారు. యుగంధర్ ముని దర్శకత్వంలో రాజశేఖర్ అన్నభీమోజు, మహీధర్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు. పరమశివుడికి, అసురుడికి మధ్య జరిగిన యుద్ధమే ఈ కథకు మూలం అంటూ సాయికుమార్ వాయిస్‌తో ట్రైలర్ ప్రారంభమైంది. ఇందులోని డైలాగులు అన్నీ కూడా ప్రేక్షకులను ఆసక్తి కలిగించేలా ఉన్నాయి. -
సరికొత్త ఆధ్యాత్మిక ప్రపంచంలో...
ఆది సాయికుమార్ హీరోగా నటిస్తున్న చిత్రం ‘శంబాల’. ‘ఏ మిస్టిక్ వరల్డ్’ అనేది ఉపశీర్షిక. యుగంధర్ ముని దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో అర్చనా అయ్యర్ కథానాయికగా నటిస్తున్నారు. రాజశేఖర్ అన్నభీమోజు, మహీధర్ రెడ్డి నిర్మిస్తున్నారు. ఈ మూవీ మేకింగ్ వీడియోను విడుదల చేశారు. ‘‘ఇండియన్ సిల్వర్ స్క్రీన్‌పై ఇదివరకెన్నడూ టచ్ చేయని పాయింట్‌తో సూపర్ నేచురల్ హారర్ థ్రిల్లర్‌గా రూపొందుతోన్న చిత్రం ‘శంబాల’.ఈ చిత్రంలో భౌగోళిక శాస్త్రవేత్త పాత్రలో ఆది కనిపిస్తారు. కాల్పనిక ప్రపంచంలో జరిగే అద్భుతమైన ఘట్టాలతో ప్రేక్షకులను సరికొత్త ఆధ్యాత్మిక ప్రపంచంలోకి తీసుకెళ్లేలా ఈ సినిమా ఉంటుంది. ఈ చిత్రంలో భారీ యాక్షన్ ఎపిసోడ్స్ ఉంటాయి. త్వరలోనే విడుదల తేదీని ప్రకటిస్తాం’’ అని చిత్రయూనిట్ పేర్కొంది. శ్వాసిక, రవివర్మ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: శ్రీరామ్ మద్దూరి. -
‘శంబాల’ లో ఏం జరిగింది? దేవి సమస్య ఏంటి?
వెనకాల గుడి, చుట్టూ పక్షులు, ఎర్రబారిన కళ్లు, విషణ్ణ వదనంతో ‘ఈ అమ్మాయికి ఏమైందబ్బా’ అనేలా కనిపించింది దేవి. ఇంతకీ ఆమె సమస్య ఏంటి? అనేది ‘శంబాల: ఎ మిస్టికల్ వరల్డ్’ చిత్రంలో చూడాల్సిందే. ఆది సాయికుమార్ హీరోగా రూపొందుతున్న సూపర్ నేచురల్ హారర్ థ్రిల్లర్ మూవీ ‘శంబాల’. ఈ చిత్రంలో దేవి అనే ముఖ్య పాత్రలో నటిస్తున్న అర్చనా అయ్యర్ లుక్‌ని విడుదల చేశారు. యుగంధర్ ముని దర్శకత్వంలో రాజశేఖర్ అన్నభీమోజు, మహిధర్ రెడ్డి నిర్మిస్తున్నారు.దేవీ పాత్రలో అర్చన అయ్యర్ ఇంటెన్స్ లుక్‌లో కనిపించారు. ఈ ఫస్ట్ లుక్ పోస్టర్లో అర్చన ఎరుపు చీరలో కనిపిస్తోంది. ఇంటెన్స్ ఎమోషన్స్‌ను పలికిస్తూ కనిపించింది. బ్యాక్ గ్రౌండ్లో పంట, గుడి, పక్షులు, దిష్టిబొమ్మ ఇలా అన్నీ కూడా చాలా క్యూరియాసిటీని పెంచేలా ఉన్నాయి. పోస్టర్లతోనే అందరిలోనూ ఆసక్తిని పెంచేస్తోంది చిత్రయూనిట్. ‘‘ఈ చిత్రంలో ఆది సాయికుమార్ జియో సైంటిస్ట్ పాత్ర చేస్తున్నారు. సరికొత్త కథ, గ్రిప్పింగ్ స్క్రీన్‌ప్లే, అద్భుతమైన విజువల్ ఎఫెక్ట్స్‌తో ఈ చిత్రం ప్రేక్షకులకు సరికొత్త అనుభూతినిచ్చే విధంగా ఉంటుంది. ప్రస్తుతం హైదరాబాద్‌లో తాజా షెడ్యూల్ షూటింగ్ జరుగుతోంది’’ అని యూనిట్ పేర్కొంది.


