అన్ని రకాల ఎమోషన్స్‌ను పండించే పాత్ర లభించడం అంటే ఓ నటుడికి అదృష్టం అనే చెప్పాలి. అలాంటి అదృష్టం నాకు శంబాల సినిమాతో దక్కింది అంటున్నాడు నటుడు శివకార్తిక్. ఆది సాయికుమార్ హీరోగా నటించిన చిత్రంలో శివకార్తిక్ కీలక పాత్ర పోషించాడు. సినిమా రిలీజ్ తర్వాత శివకార్తిక్‌కు మంచి ప్రశంసలు వచ్చాయి. చిత్ర విజయోత్సవంలో భాగంగా శివ కార్తిక్ తన సినీ ప్రయాణం, అందులోని ఒడిదుడుకుల గురించి ఎన్నో విషయాల్ని పంచుకున్నారు.
నాకు ఎలాంటి సినీ నేపథ్యం లేదు. ఒంటరిగానే ఇండస్ట్రీలోకి వచ్చాను. ‘జోష్’ మూవీ కోసం వేల మంది ఆడిషన్స్ ఇస్తే అందులో నేను సెలెక్ట్ అయ్యాను. ఆ తరువాత వరుసగా ‘భీమిలి కబడ్డీ జట్టు’, ‘పిల్లా జమీందార్’ చిత్రాలు చేశాను.
కారెక్టర్ ఆర్టిస్ట్‌గా బిజీగా ఉన్న సమయంలోనే హీరోగా ‘లజ్జా’ అనే సినిమాను చేశాను. అది అంతగా వర్కౌట్ కాలేదు. ఈ మూవీ కోసం నేను రెండున్నరేళ్లు కష్టపడ్డాను. కానీ ఫలితం మాత్రం రాలేదు. దీంతో అటు హీరోగా, ఇటు కారెక్టర్ ఆర్టిస్ట్‌గా గ్యాప్ వచ్చింది. ఆ సమయంలో నేను ఎన్నో కష్టాలు అనుభవించాను. అలాంటి టైంలోనే బాబీ గారు ‘పంతం’ సినిమాలో నా పర్ఫామెన్స్ చూసి చాలా మెచ్చుకున్నారు. నటుడిగా మంచి స్థాయికి వెళ్లాలని, ఇంకా గట్టిగా ప్రయత్నించాలన్న కసి అక్కడి నుంచి నాలో మరింత పెరిగింది.
అలా ప్రయత్నిస్తున్న సమయంలోనే నేను ఆర్జీవీ గారి ‘భైరవగీత’ చిత్రంలో పవర్ ఫుల్ రోల్ చేశాను. అది చూసి బోయపాటి గారు చాలా మెచ్చుకున్నారు. ఆ తరువాత ఆయనే నన్ను పిలిచి ‘అఖండ’లో అవకాశం ఇచ్చారు. అయితే ఈ క్రమంలో నేను చేసిన చాలా చిత్రాలకు మంచి పేరు వచ్చింది. ‘ఉగ్రం’ తరువాత మరింతగా నా పర్ఫామెన్స్ గురించి మాట్లాడుకున్నారు. ‘తండేల్’లో మంచి పాత్ర దక్కింది.
ఎప్పుడూ ఒకేలా సింపతీ పాత్రలు చేయకూడదు.. వెరైటీ పాత్రల్ని చేయాలని అనుకున్నాను. ఆ సమయంలో మనీష్ అని కో డైరెక్టర్ ద్వారా యుగంధర్ ముని వద్దకు నేను వెళ్లాను. ఆడిషన్స్ ఇచ్చాను. అలా ‘శంబాల’ మూవీలో నాకు అద్భుతమైన పాత్ర దక్కింది. అన్ని రకాల ఎమోషన్స్‌ను పండించే పాత్ర లభించడం అంటే ఓ నటుడికి అదృష్టం అనే చెప్పాలి. ‘శంబాల’లో అవకాశం ఇచ్చిన దర్శకుడు యుగంధర్ మునికి నేను ఎప్పటికీ రుణ పడి ఉంటాను.
ఆది గారు ‘శంబాల’ కోసం ఎంతో కష్టపడ్డారు. ఆయన డెడికేషన్ చూసి మాలోనూ మరింతగా కసి పెరిగింది. ఆయనతో పాటుగా, పోటీగా నటించాలని అందరూ వంద శాతం ఎఫర్ట్స్ పెట్టారు. ‘శంబాల’ సినిమాలో పని చేసిన ప్రతీ ఒక్కరికీ పేరు రావడం ఆనందంగా ఉంది.
ప్రస్తుతం నేను నటుడిగా సంతృప్తికరంగానే ఉన్నాను. అయితే విక్రమ్ చేసిన ‘శివ పుత్రుడు’ లాంటి డిఫరెంట్ రోల్స్ చేయాలన్నదే నా కోరిక, కల. అందులో శివ కార్తిక్ కాకుండా కేవలం ఆ పాత్ర మాత్రమే కనిపించాలి. అలా ఓ అద్భుతమైన పాత్ర చేయాలని అనుకుంటున్నాను. నేను కీలక పాత్రలు పోషించిన ‘హైందవ’, ‘వృషకర్మ’ చిత్రాలు ఈ ఏడాదిలో విడుదల కాబోతోన్నాయి. అందులోనూ అద్భుతమైన పాత్రల్నే పోషించాను.


