‘ఆయా షేర్‌...’కి వారం పట్టింది.. ‘జడల్‌’ లో ఎమోషన్‌ ఉంది: కాసర్ల శ్యామ్‌ | Kasarla Shyam Interesting Comments On Actor Nani The Paradise Movie Aaya Sher Song, Deets Inside | Sakshi
Sakshi News home page

సర్వస్వం కోల్పోయిన వ్యక్తి నా పాటతో స్ఫూర్తి పొందడం ఆనందంగా ఉంది

Mar 12 2026 8:27 AM | Updated on Mar 12 2026 9:02 AM

Kasarla Shyam Interesting Comments On Aaya Sher Song Of The Paradise Movie

‘‘ది ప్యారడైజ్‌’ సినిమాలోని ‘ఆయా షేర్‌...’ పాట ప్రోమో మంచి బజ్‌ క్రియేట్‌ చేసింది. పాట రిలీజ్‌ తర్వాత అన్ని రికార్డ్స్‌ బద్దలు కొడుతోంది. నా సాహిత్యానికి అనిరుధ్‌గారు జనాలకి రీచ్‌ అయ్యే విధంగా ట్యూన్‌ చేశారు. మట్టి వాసన తెలిసిన జానపద గాయకులు జంగిరెడ్డి, దేవయ్య అద్భుతంగా పాడారు. నా కెరీర్లో ఈ పాట ఇచ్చినంత కిక్కు ఏ పాటా ఇవ్వలేదు’’ అని పాటల రచయిత కాసర్ల శ్యామ్‌ చెప్పారు.  

నాని హీరోగా శ్రీకాంత్‌ ఓదెల దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం ‘ది ప్యారడైజ్‌’. ఎస్‌ఎల్‌వీ సినిమాస్‌ బ్యానర్‌పై సుధాకర్‌ చెరుకూరి నిర్మిస్తున్న ఈ మూవీ ఆగస్టు 21న రిలీజ్‌ కానుంది. అనిరుధ్‌ రవిచందర్‌ సంగీతం అందించిన ఈ మూవీ నుంచి విడుదల చేసిన తొలి పాట ‘ఆయా షేర్‌...’కి మంచి స్పందన వస్తోందని యూనిట్‌ తెలిపింది. 

ఈ సందర్భంగా ఈ పాట రచయిత కాసర్ల శ్యామ్‌ విలేకరలతో మాట్లాడుతూ– ‘‘ఈ సినిమాలో నానీగారి చేస్తున్న జడల్‌ క్యారెక్టర్‌లో ఒక అద్భుతమైన ఎమోషన్‌ ఉంటుంది. ఆ జడల వెనుక మంచి కథ ఉంది. ఇప్పుడు అందరూ జడలు వేసుకుని రీల్స్‌ చేస్తున్నారు. ఆ సంస్కృతిని గుర్తు చేస్తున్నందుకు ఆనందంగా ఉంది. 

‘ఆయా షేర్‌...’ జనం నుంచి పుట్టిన ఒక వీరుడు ఆ జనాలకు స్ఫూర్తినిచ్చే క్రమంలో వచ్చే పాట. ఈ పాట రాయడానికి వారం పట్టింది. ఈ చిత్ర కథ 80 దశకాల్లో జరిగే నేపథ్యం కాబట్టి అప్పుడు ఉర్దూ ప్రభావం ఉంటుంది. అందుకే ఇందులో చాలావరకు ఉర్దూ పదాలు ఉపయోగించాను. 

నేను ఉపయోగించిన భాష, యాసకి సోషల్‌ మీడియాలో అద్భుతమైన ప్రశంసలు కురిపిస్తున్నారు. జీవితంలో సర్వస్వం కోల్పోయానని బాధపడిన ఓ వ్యక్తి.. నా పాటతో కొత్త స్ఫూర్తి పొందానని చెప్పడం ఆనందాన్ని కలిగించింది. ఇక ఈ మధ్య ‘లెనిన్, మా ఇంటి బంగారం, ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌’ వంటి సినిమాల్లో పాటలు రాశాను’’ అని చెప్పారు. 

Advertisement
 
Advertisement
Advertisement