‘‘రాజశేఖర్, మహీధర్ రెడ్డిగార్లకు నిర్మాతలుగా ‘శంబాల’ తొలి చిత్రమైనా ఎంతో ప్యాషన్‌తో నిర్మించారు. అయితే కథపై నమ్మకంతో నా మార్కెట్‌కి మించి ఎక్కువగానే బడ్జెట్ పెట్టారు. కానీ ఎక్కడా వృథా ఖర్చు చేయలేదు. ఈ నెల 25న చాలా సినిమాలు వస్తున్నాయి...పోటీ బాగా ఉండంతో ప్రమోషన్స్ కూడా భారీ ఎత్తున నిర్వహించారు. ‘శంబాల’ ఔట్‌పుట్ పట్ల యూనిట్ అంతా చాలా సంతృప్తిగా ఉన్నాం’’ అని ఆది సాయికుమార్ చెప్పారు. ఆయన హీరోగా, అర్చనా అయ్యర్ హీరోయిన్‌గా నటించిన చిత్రం ‘శంబాల’. యుగంధర్ ముని దర్శకత్వంలో రాజశేఖర్ అన్నభీమోజు, మహీధర్ రెడ్డి నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 25న విడుదల కానుంది. అలాగే డిసెంబరు 23న ఆది పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆది సాయికుమార్ పంచుకున్న విశేషాలు...
⇒ ‘శంబాల’ నుంచి విడుదల చేసిన ఫస్ట్ లుక్ నుంచి మా మూవీపై మంచి బజ్ ఏర్పడింది. దుల్కర్ సల్మాన్ రిలీజ్ చేసిన టీజర్, ప్రభాస్, నానీగార్లు విడుదల చేసిన ట్రైలర్స్ ఆడియన్స్‌లో మా మూవీ పట్ల మంచి బజ్ తీసుకొచ్చాయి. ఈసారి మంచి విజయాన్ని అందుకోబోతున్నామనే నమ్మకం ఉంది. మా సినిమాని అందరూ ఎంజాయ్ చేస్తారనుకుంటున్నాను. 80వ దశకంలో వచ్చే కథ కాబట్టి లుక్స్ విషయంలో చాలా జాగ్రత్త పడ్డాం... అందుకే కాస్ట్యూమ్స్‌ని చాలా సెలెక్టివ్‌గా తీసుకున్నాం. మా సినిమాలో అద్భుతమైనపోరాట సన్నివేశాలున్నాయి. రాజ్‌కుమార్ మాస్టర్ బాగా చూపించారు.
⇒ ‘శంబాల’ అనే ప్రాంతం ఉందా? లేదా అనేది ఎవరికీ తెలీదు. మన పురాణాల ప్రకారం శంబాలకి ఓ మంచి గుర్తింపు ఉంది. ఆ టైటిల్ చెప్పినప్పుడు నేను చాలా ఎగ్జయిట్ అయ్యాను. ‘కల్కి’ తర్వాత శంబాల పేరు మరింత ఎక్కువగా ట్రెండ్ అయింది. ఈ మూవీ కోసం యుగంధర్‌గారు చాలా కష్టపడ్డారు... ఆయన పెద్ద డైరెక్టర్ అవుతారు. శ్రీచరణ్ పాకాల ఆర్‌ఆర్ చూసి అందరం షాక్ అయ్యాం. సినిమా చూసిన తర్వాత అందరూ నేపథ్య సంగీతం గురించి మాట్లాడుకుంటారు. ప్రస్తుతం ఆడియన్స్కు అద్భుతమైన సినిమాటిక్ ఎక్స్‌పీరియన్స్ కావాలి. ఇలాంటి జానర్‌లను ప్రేక్షకులు ఎక్కువగా ఇష్టపడుతున్నారు. ‘శంబాల’ లాంటి చిత్రాన్ని థియేటర్లో చూస్తేనే ఆ ఫీల్‌ను ఎంజాయ్ చేస్తారు.
⇒ క్రిస్మస్ అనేది మంచి సీజన్. శ్రీకాంత్‌గారి ఫ్యామిలీతో మాకు మంచి బాండింగ్ ఉంది. రోషన్ తో నాకు మంచి పరిచయం ఉంది. మా ‘శంబాల’తో పాటు రోషన్ నటించిన ‘చాంపియన్’ సినిమా కూడా పెద్ద హిట్ కావాలని కోరుకుంటున్నాను. ఇక ఇన్నేళ్ల నా కెరీర్ పట్ల పూర్తిగా సంతృప్తిగా లేను. ఎందుకంటే అప్ అండ్ డౌన్స్ ఉన్నాయి. ‘శంబాల’తో సక్సెస్ కొడుతున్నాను. ఆ తర్వాత కూడా మంచి కథలు ఎంచుకుంటాను. నేను నటించిన ‘సబ్ ఇన్‌స్పెక్టర్ యుగంధర్’ సినిమా చాలా బాగా వచ్చింది.. ఇంకా నా పాత్రకు నేను డబ్బింగ్ చెప్పాల్సి ఉంది. ఆ సినిమా త్వరలో విడుదలవుతుంది.


