అశ్విన్, తమన్, ప్రియదర్శి, ఆది సాయికుమార్, కిరణ్ అబ్బవరం, అనిల్ రావిపూడి
‘‘ఎస్‌ఆర్ కళ్యాణ మండపం’ సినిమాలో ధర్మపాత్ర కోసం సాయి కుమార్‌గారిని కలిసినప్పుడు ఆయన మాకు చేసిన సపోర్ట్‌ని ఎప్పటికీ మర్చిపోలేను. ఆయన వల్లే నా కెరీర్ బాగుందనుకుంటూ ఉంటాను. ‘శంబాల’ చిత్రంపై ముందు నుంచి పాజిటివ్ వైబ్ ఉంది.. తప్పకుండా అందరికీ నచ్చుతుంది. ఈ మూవీతో ఆదిగారికి మంచి విజయం రావాలి’’ అని కిరణ్ అబ్బవరం తెలిపారు. ఆది సాయికుమార్, అర్చనా అయ్యర్ జోడీగా నటించిన చిత్రం ‘శంబాల’. యుగంధర్ ముని దర్శకత్వంలో షైనింగ్ పిక్చర్స్‌పై రాజశేఖర్ అన్నభీమోజు, మహీధర్ రెడ్డి నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 25న విడుదల కానుంది.
హైదరాబాద్‌లో నిర్వహించిన ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి హీరోలు మంచు మనోజ్, కిరణ్ అబ్బవరం, ప్రియదర్శి, అశ్విన్ బాబు, డైరెక్టర్ అనిల్ రావిపూడి, సంగీత దర్శకుడు తమన్, నిర్మాతలు నవీన్ యెర్నేని, టీజీ విశ్వ ప్రసాద్, మైత్రి శశిధర్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. మంచు మనోజ్ మాట్లాడుతూ–‘‘చిన్న సినిమా పెద్ద సినిమా అని ఉండదు.. మంచి చిత్రాల్ని ప్రేక్షకులు ఆదరిస్తూనే ఉంటారు’’ అన్నారు.
‘‘సాయికుమార్‌గారి కొడుకుని అని చెప్పుకోవడాన్ని గర్వంగా భావిస్తాను’’ అని ఆది సాయికుమార్ తెలిపారు. ‘‘ఈ చిత్రంతో ఆదికి మంచి విజయం దక్కాలి’’ అన్నారు అనిల్ రావిపూడి. ‘‘శంబాల’తో ఆదికి చిత్రోత్సాహం, నాకు పుత్రోత్సాహం, టీమ్‌కి విజయోత్సాహం రావాలని కోరుకుంటున్నాను’’ అని నటుడు సాయికుమార్ చెప్పారు. ‘‘నా టీమ్ సపోర్ట్ వల్లే సినిమాను ఇంత గొప్పగా తీశాను’’ అని యుగంధర్ ముని పేర్కొన్నారు.


