ఈ ఏడాది చివరి వారం టాలీవుడ్‌లో చిన్న, మీడియం రేంజ్ సినిమాల జాతరే కనిపిస్తోంది. క్రిస్మస్ సెలవులు దొరకడంతో పాటు పెద్ద సినిమాలేవి విడుదల కాకపోవడంతో భారీ ఎత్తున చిన్న సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. ఈ నెల 25న ఛాంపియన్, శంబాల, ఈషా, దండోరా చిత్రాలు ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. ఈ నాలుగు సినిమాల జోనర్స్ వేరు వేరుగా ఉండడం గమనార్హం. ఇయర్ ఎండ్‌లో యాక్షన్, హారర్, మిస్టరీ,సోషియయో ఫాంటసీ.. ఇల రకరకాల సినిమాలను ఆడియన్స్‌ని పలకరించబోతున్నాయి. ఇప్పటికే అన్నింటిపైన మంచి అంచనాలే ఏర్పడ్డాయి.
శ్రీకాంత్ తనయుడు రోషన్ చాలా గ్యాప్ తర్వాత ‘ఛాంపియన్’తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ప్రదీప్ అద్వైతం దర్శకత్వం వహించిన ఈ యాక్షన్ చిత్రం తెలంగాణలోని బైరాన్ పల్లిలో జరిగిన ఓ వాస్తవ ఘటన ఆధారంగా తెరకెక్కుతుంది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ , పాటలకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది. డిసెంబర్ 25న విడుదల కాబోతున్న ఈ చిత్రంపై భారీ అంచనాలే ఏర్పడ్డాయి.
గతకొంత కాలంగా వరుస ఫ్లాపులతో సతమతమవుతున్న ఆది సాయికుమార్.. ఈ సారి మిస్టీరియస్ థ్రిల్లర్ శంబాలతో బాక్సాఫీస్ వద్ద తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నాడు. ఈ మూవీకి యగంధర్ ముని దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో అర్చన అయ్యర్, స్వసిక, రవివర్మ, మధునందన్, శివ కార్తీక్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. శ్రీ చరణ్ పాకాల సంగీతాన్ని అందించారు. ఇప్పటికే శంబాలా నుంచి వచ్చిన టీజర్, ట్రైలర్ సినిమాపై ఆసక్తి పెంచేసి హైప్ క్రియేట్ చేశాయి. డిసెంబర్ 25న భారీ ఎత్తున ఈ చిత్రం విడుదల కానుంది. ఈ చిత్రంలో ఆది హిట్ ట్రాక్ ఎక్కుతాడని దర్శకనిర్మాతలు బలంగా చెబుతున్నారు.
ఇటీవల లిటిల్‌హార్ట్స్, రాజు వెడ్స్ రాంబాయి లాంటి సూపర్‌హిట్ కల్ట్ చిత్రాలను ప్రేక్షకులకు అందించిన బన్నీవాస్, వంశీ నందిపాటి ద్వయం తాజాగా 'ఈషా' పేరుతో ఓహారర్ థ్రిల్లర్‌ను ప్రేక్షకుల ముందుకు తీసుకరాబోతున్నారు. వంశీ నందిపాటి ఎంటర్ టైన్ మెంట్స్, బన్నీ వాస్ వర్క్స్ బ్యానర్స్ పై వంశీ నందిపాటి, బన్నీ వాస్ గ్రాండ్‌గా ఈ చిత్రాన్నిడిసెంబరు 25న చిత్రాన్ని థియేట్రికల్ రిలీజ్ చేస్తున్నారు. ఇటీవల రాజు వెడ్స్ రాంబాయి చిత్రంతో సూపర్‌హిట్ కొట్టిన అఖిల్‌రాజ్‌తో పాటు త్రిగుణ్ హీరోలుగా నటిస్తున్న ఈ చిత్రంలో హెబ్బాపటేల్ కథానాయిక. సిరి హనుమంతు, బబ్లూ, పృథ్వీరాజ్ ఇతర ముఖ్యపాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రాన్ని హెచ్‌వీఆర్ ప్రొడక్షన్స్ పతాకంపై ప్రముఖ నిర్మాత కేఎల్ దామోదర ప్రసాద్ సమర్పణలో హేమ వెంకటేశ్వరరావు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శ్రీనివాస్ మన్నె దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం నుంచి ఇటీవల విడుదలైన రెండు ట్రైలర్లు బాగానే భయపెట్టాయి. ఇదే భయంలో థియేటర్స్‌లో పుట్టిస్తే.. సినిమా హిట్ అవ్వడం ఖాయం.
మరో చిన్న చిత్రం ‘దండోరా’ కూడా ఈ వారమే రిలీజ్ కానుంది. శివాజీ ప్రధాన పాత్రను పోషించిన ఈ చిత్రాన్ని ‘కలర్ ఫొటో’, ‘బెదురులంక 2012’ వంటి మంచి చిత్రాలను నిర్మించి అందరి దృష్టిని ఆకర్షించిన లౌక్య ఎంటర్‌టైన్‌మెంట్స్ అధినేత రవీంద్ర బెనర్జీ ముప్పానేని నిర్మించారు. ఈ చిత్రంలో శివాజీతో పాటుగా నవదీప్, నందు, రవికృష్ణ, మనికా చిక్కాల, మౌనికా రెడ్డి, బిందు మాధవి, రాధ్య, అదితి భావరాజు తదితరులు ముఖ్య పాత్రల్ని పోషించారు. ఈ చిత్రానికి మురళీకాంత్ దర్శకత్వం వహించారు. ఈ మూవీని డిసెంబర్ 25న భారీ ఎత్తున విడుదల చేస్తున్నారు. పల్లెటూరి నేపథ్యంలో తెరకెక్కించిన ఈ చిత్రంపై కూడా మంచి అంచనాలే ఏర్పడ్డాయి.
వీటితో పాటు మలయాళం డబ్బింగ్ సినిమా వృషభ కూడా ఈ వారమే రిలీజ్ అవుతుంది. మోహల్ లాల్ కీలక పాత్ర వహించిన ఈ చిత్రంపై కూడా టాలీవుడ్‌లో భారీ అంచనాలే ఉన్నాయి. మరి వీటిల్లో ఏ చిత్రం విజయం అవుతుందో? ఇయర్ ఎండ్‌లో ఎన్ని అద్భుతాలు క్రియేట్ చేస్తాయో చూడాలి.


